మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఆదుకోవడానికి రూ.50,000 కోట్లనిధులు అందుబాటులోకి తెస్తామన్న ఆర్‌బీఐ ప్రకటన సోమవారం స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటలో నడిపించింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ సెన్సెక్స్ 31,500 పాయింట్ల పైకి, నిఫ్టీ 9,200 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 31,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఆర్‌బీఐ అభయం...: మ్యూచువల్ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులను అందుబాటులోకి తేవడంతో కరోనా వైరస్ కల్లోలంతో అల్లకల్లోలమవుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడానికి మరిన్ని చర్యలను తీసుకోగలమని ఆర్‌బీఐ అభయం ఇచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఒక దశలో సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్ల మేర లాభపడ్డాయి. ట్రేడింగ్ చివర్లో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి జపాన్ కేంద్ర బ్యాంక్ మరోసారి ప్యాకేజీని ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు 0.2–2% రేంజ్‌లో పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1–2% రేంజ్ లాభాల్లో ముగిశాయి.
మ్యూచువల్ ఫండ్ షేర్ల జోరు...
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నిధులను ఆర్‌బీఐ అందుబాటులోకి తేనుండటంతో మ్యూచువల్ ఫండ్, ఆర్థిక రంగ షేర్లు జోరుగా పెరిగాయి. నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ 13 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ 8 శాతం, శ్రీరామ్ ఏఎమ్‌సీ 5 శాతం చొప్పున ఎగిశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా మనీ క్యాపిటల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు 6–11 శాతం రేంజ్‌లో పెరిగాయి.
► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోగా మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 6శాతం లాభంతో రూ.407 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ షేర్ బాగా పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
► యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ ఆ్యంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి.
► ఒక్కో షేర్‌కు రూ.320 (3200 శాతం) స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించడంతో ఫైజర్ షేర్ 11 శాతం లాభంతో రూ.4,891 వద్ద ముగిసింది.
► స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, ఇంట్రాడేలో వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సైయంట్, చాలెట్ హోటల్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► సన్ ఫార్మా, లుపిన్, లారస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.
మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్
Published Tue, Apr 28 2020 3:59 AM | Last Updated on Tue, Apr 28 2020 3:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment