కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు | cards transitions use hike in lockdown | Sakshi
Sakshi News home page

కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు

Published Tue, Aug 18 2020 12:22 AM | Last Updated on Tue, Aug 18 2020 8:58 AM

cards transitions use hike in lockdown - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా దెబ్బతో నగదు లావాదేవీలు కంటే కార్డు లావాదేవీలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా బ్యాంకులు జారీ చేస్తున్న కార్డుల సంఖ్య, పెరుగుతున్న లావాదేవీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలోనే అనగా ఏప్రిల్‌–జూన్‌ మూడు నెలల కాలంలో రికార్డు స్థాయిలో బ్యాంకులు 1.6 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేశాయి.

మార్చి నెలాఖరునాటికి 82.85 కోట్లుగా ఉన్న డెబిట్‌ కార్డుల సంఖ్య జూన్‌ నెలాఖరు నాటికి 84.54 కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కార్డులు జారీ చేయడంలో ప్రైవేటు బ్యాంకులు కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజంలో ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు డెబిట్‌ కార్డుల సంఖ్య 58.56 కోట్ల నుంచి 59.71 కోట్లకు పెరిగితే, ప్రైవేటు బ్యాంకులు కొత్తగా 40 లక్షల కార్డులు జారీ చేయడం ద్వారా మొత్తం కార్డుల సంఖ్య 16.86 కోట్లకు చేరింది.

కేంద్ర ప్రభుత్వం డిజిటిల్‌ లావాదేవీలు పెంచడాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రస్తుతమున్న మాగ్నటిక్‌ కార్డులు స్థానంలో చిప్‌ ఆధారిత కాంటాక్ట్‌ లెస్‌ కార్డులు జారీ చేయడం కార్డు వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు కేంద్ర ఫ్రభుత్వం మహిళలకు చెందిన జన్‌థన్‌ ఖాతాల్లో నగదు వేయడం కూడా కార్డుల వినియోగం పెరగడానికి మరో కారణంగా చెపుతున్నారు. ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగడం ఇదే తొలిసారి అని బ్యాంకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగలేదు.

డిజిటిల్‌ చెల్లింపులపై బ్యాంకులు దృష్టి
డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీల్లో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య 90 నుంచి 93 శాతానికి పెరిగింది. అదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిజిటల్‌ లావాదేవీలు 87 శాతం నుంచి 90 శాతానికి చేరాయి. డిపాజిట్లు, రుణాల మంజూరు వంటివి కూడా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తి చేసే  విధంగా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement