card transactions
-
కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు
సాక్షి, అమరావతి: కరోనా దెబ్బతో నగదు లావాదేవీలు కంటే కార్డు లావాదేవీలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా బ్యాంకులు జారీ చేస్తున్న కార్డుల సంఖ్య, పెరుగుతున్న లావాదేవీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లాక్డౌన్ సమయంలోనే అనగా ఏప్రిల్–జూన్ మూడు నెలల కాలంలో రికార్డు స్థాయిలో బ్యాంకులు 1.6 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. మార్చి నెలాఖరునాటికి 82.85 కోట్లుగా ఉన్న డెబిట్ కార్డుల సంఖ్య జూన్ నెలాఖరు నాటికి 84.54 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కార్డులు జారీ చేయడంలో ప్రైవేటు బ్యాంకులు కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజంలో ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు డెబిట్ కార్డుల సంఖ్య 58.56 కోట్ల నుంచి 59.71 కోట్లకు పెరిగితే, ప్రైవేటు బ్యాంకులు కొత్తగా 40 లక్షల కార్డులు జారీ చేయడం ద్వారా మొత్తం కార్డుల సంఖ్య 16.86 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం డిజిటిల్ లావాదేవీలు పెంచడాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రస్తుతమున్న మాగ్నటిక్ కార్డులు స్థానంలో చిప్ ఆధారిత కాంటాక్ట్ లెస్ కార్డులు జారీ చేయడం కార్డు వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు కేంద్ర ఫ్రభుత్వం మహిళలకు చెందిన జన్థన్ ఖాతాల్లో నగదు వేయడం కూడా కార్డుల వినియోగం పెరగడానికి మరో కారణంగా చెపుతున్నారు. ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగడం ఇదే తొలిసారి అని బ్యాంకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగలేదు. డిజిటిల్ చెల్లింపులపై బ్యాంకులు దృష్టి డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 90 నుంచి 93 శాతానికి పెరిగింది. అదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్లో డిజిటల్ లావాదేవీలు 87 శాతం నుంచి 90 శాతానికి చేరాయి. డిపాజిట్లు, రుణాల మంజూరు వంటివి కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసే విధంగా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. -
పెట్రోల్ బంకుల్లో కార్డులకు ఓకే
• డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులకు ప్రత్యేక చార్జీలుండవ్ • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక చార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13 తర్వాత కూడా అదనపు చార్జీలు లేకుండా వినియోగదారులు కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుక్కోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి మేం కట్టుబడి ఉన్నాం. కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేవారికి ఎటువంటి అదనపు చార్జీలు పడకుండా చూస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలు వేశారు. అయితే వాటిని ఎవరు చెల్లించాలి? బ్యాంకులా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలా అనే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ తేల్చుకోవాలి. ప్రభుత్వం మాత్రం ఈ చార్జీలు చెల్లించదు. దీనిపై త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడు తుంది. పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లు, బంకుల యజమానులు కమీషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నందున వారిపై ఆ చార్జీలు విధించమని ఆదివారమే హామీ ఇచ్చాం’ అని వివరణ ఇచ్చారు. కార్డు లావాదేవీలపై పడుతున్న ఎండీఆర్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోల్ డీలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు సోమవారం నుంచి కార్డులను అంగీకరించమని ప్రకటించిన ఆలిండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్.. తన నిర్ణయాన్ని ఈ నెల 13 వరకు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై వివరణ ఇచ్చారు. బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై వినియోగదారులకు 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేశారు. ఎండీఆర్ చార్జీల్లో పేమెంట్ గేట్వేలు, పీవోఎస్ మెషీన్ ప్రొవైడర్లు, బ్యాంకులకు వాటా ఉంటుందని.. ఆ చార్జీలను కూడా ఎంతవరకు తగ్గించవచ్చనే విషయమై చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. -
డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలపై కేంద్ర వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహాన్నందిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల లోపు లావాదేవీపై సర్వీస్ పన్నును రద్దు చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సేవల్లో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 2012 నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు నోటిఫికేషన్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా! ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది. కాగా నిన్న (బుధవారం)ఆన్లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.