పెట్రోల్‌ బంకుల్లో కార్డులకు ఓకే | Dharmendra Pradhan clarifies: No additional charges for card payments | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో కార్డులకు ఓకే

Published Tue, Jan 10 2017 2:56 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

పెట్రోల్‌ బంకుల్లో కార్డులకు ఓకే - Sakshi

పెట్రోల్‌ బంకుల్లో కార్డులకు ఓకే

డెబిట్, క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు ప్రత్యేక చార్జీలుండవ్‌
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌ బంకుల్లో కార్డుల ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక చార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13 తర్వాత కూడా అదనపు చార్జీలు లేకుండా వినియోగదారులు కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్‌ కొనుక్కోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి మేం కట్టుబడి ఉన్నాం. కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేవారికి ఎటువంటి అదనపు చార్జీలు పడకుండా చూస్తాం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం కార్డు లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) చార్జీలు వేశారు.

అయితే వాటిని ఎవరు చెల్లించాలి? బ్యాంకులా, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలా అనే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ తేల్చుకోవాలి. ప్రభుత్వం మాత్రం ఈ చార్జీలు చెల్లించదు. దీనిపై త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడు తుంది. పెట్రోల్‌ రిటైల్‌ అవుట్‌లెట్లు, బంకుల యజమానులు కమీషన్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నందున వారిపై ఆ చార్జీలు విధించమని ఆదివారమే హామీ ఇచ్చాం’ అని వివరణ ఇచ్చారు. కార్డు లావాదేవీలపై పడుతున్న ఎండీఆర్‌ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోల్‌ డీలర్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ కొనుగోలుకు సోమవారం నుంచి కార్డులను అంగీకరించమని ప్రకటించిన ఆలిండియా పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌.. తన నిర్ణయాన్ని ఈ నెల 13 వరకు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ దీనిపై వివరణ ఇచ్చారు. బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై వినియోగదారులకు 0.75 శాతం డిస్కౌంట్‌ ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేశారు. ఎండీఆర్‌ చార్జీల్లో పేమెంట్‌ గేట్‌వేలు, పీవోఎస్‌ మెషీన్‌ ప్రొవైడర్లు, బ్యాంకులకు వాటా ఉంటుందని.. ఆ చార్జీలను కూడా ఎంతవరకు తగ్గించవచ్చనే విషయమై చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement