50% ఇండెక్స్‌ షేర్లు బేర్‌ ట్రెండ్‌లోనే | 50% Index shares in bear trend | Sakshi
Sakshi News home page

50% ఇండెక్స్‌ షేర్లు బేర్‌ ట్రెండ్‌లోనే

Published Fri, May 22 2020 2:33 PM | Last Updated on Fri, May 22 2020 2:36 PM

50% Index shares in bear trend - Sakshi

సాధారణంగా బేర్‌ మార్కెట్లు ఆరు నెలల నుంచి 30 నెలలవరకూ కొనసాగుతాయంటున్నారు టారస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ హెడ్‌ ప్రసన్న పథక్‌. ప్రస్తుతం దేశీ మార్కెట్లు రెండు నెలల బేర్‌ దశలో ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజానికి ప్రామాణిక ఇండెక్సులు నిఫ్టీ, సెన్సెక్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజాలలో 50 శాతంవరకూ ఏడాది కాలంగా బేర్‌ ట్రెండ్‌లో కదులుతున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

9,000 స్థాయిలో 
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రస్తుతం 9,000 పాయింట్ల స్థాయిలో కదులుతోంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ను సైతం పరిగణిస్తే.. గత రెండేళ్లుగా మొత్తం మార్కెట్లు బేర్‌ దశలోనే ఉన్నాయి. రానున్న ఆరు నెలల కాలంలో కోవిడ్‌-19 ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించనుంది. దీంతో స్టాక్‌ మార్కెట్లలో మరోసారి పతన పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే ఈసారి పతనంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఔట్‌పెర్ఫార్మ్‌ చేసే వీలుంది. కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పలు దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్నాయి. భారీ లిక్విడిటీ చర్యలు చేపడుతున్నాయి. దీంతో దేశాల మధ్య అంతరాలు ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో పెట్టుబడులకు విఘాతం కలిగే వీలుంది. వ్యవస్థలలోకి భారీగా విడుదలవుతున్న చౌక నిధులు ఎటు ప్రవహిస్తాయన్నది వేచి చూడవలసి ఉంది. 

పోర్ట్‌ఫోలియో ఎలా
ఇన్వెస్టర్లు వయసు, రిస్క్‌ సత్తా, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు 30ఏళ్ల వ్యక్తి ఓమాదిరి రిస్క్‌కు సిద్ధపడితే.. ఈక్విటీలకు 35 శాతం, ఎఫ్‌డీలు, లిక్విడ్‌ ఫండ్స్‌కు 30 శాతం, డెట్‌ ఫండ్స్‌లో 20 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసే ఆలోచన చేయవచ్చు. ఈ బాటలో పసిడి లేదా రియల్టీకి 15 శాతం కేటాయించవచ్చు. ఇది పెట్టుబడులను విభిన్న ఆస్తులలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా నష్టభయాలను తగ్గించుకోవడంతోపాటు.. కొంతమేర హామీగల ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. అయితే ఎవరికివారు వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులు, రిస్కు సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఫైనాన్షియల్‌ సలహాదారులను సంప్రదించడం మేలు.

అనుకోని విధంగా
మార్కెట్‌  నిపుణులు వార్షిక ప్రాతిపదికన నిఫ్టీ ఆర్జనలో 14-15 శాతం వృద్ధిని అంచనా వేస్తుంటారు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వంటి ఊహించని సవాళ్లు ఎదురైతే అంచనాలు తలకిందులుకావచ్చు. ఇక ప్రస్తుతం నెలకొన్న కోవిడ్‌-19 పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో అంచనాల్లేవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోంది. అయితే కరోనా వైరస్‌ కట్టడికి ఔషధాన్ని కనుగొంటే.. స్టాక్‌ మార్కెట్లకు ఒక్కసారిగా జోష్‌రావచ్చు. వెరసి 6-12 కాలానికి మార్కెట్లను అంచనా వేయడం కష్టం. రెండు, మూడేళ్ల వ్యవధిని పరిగణిస్తే.. మంచి రిటర్నులకు అవకాశమున్నట్లు చరిత్ర చెబుతోంది.   

ఈ రంగాలు ఓకే
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. చైనాకు బదులుగా స్థానిక తయారీకి ప్రోత్సాహం లభించవచ్చు. ప్రధానంగా పటిష్ట బ్యాలన్స్‌షీట్లు కలిగి ఎగుమతులు నిర్వహించే కంపెనీలు లబ్ది పొందే వీలుంది. దేశీయంగా ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, డయాగ్నోస్టిక్‌, కన్జూమర్‌ ఆధారిత రంగాలు, కంపెనీలు బలపడే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement