లాభాల స్వీకరణకు అవకాశం | Opportunity to receive profits says market experts | Sakshi
Sakshi News home page

లాభాల స్వీకరణకు అవకాశం

Published Mon, Apr 17 2023 4:49 AM | Last Updated on Mon, Apr 17 2023 4:49 AM

Opportunity to receive profits says market experts - Sakshi

ముంబై: గత తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం డేటా, ఆర్‌బీఐ మినిట్స్, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు, బాండ్లపై రాబడులు తదితర సాధారణ అంశాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

ట్రేడింగ్‌ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్‌ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.   ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 17,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఎగువున 18వేల స్థాయి వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాల దృష్ట్యా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ రంగం ఒత్తిడికి లోనుకావచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రీటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు.

► కార్పొరేట్‌ ఫలితాల ప్రభావం  
మార్కెట్‌ ముందుగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల క్యూ4 ఆర్థిక ఫలితాలను స్పందించాల్సి ఉంటుంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్‌తో సహా 50కి పైగా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఎగుమతి ఆధారిత కంపెనీలపై అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మార్చి త్రైమాసిక ఫలితాల ద్వారా తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయా కంపెనీల యాజమాన్య అవుట్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది.

► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం  
మార్చి డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా సోమవారం(నేడు) విడుదల అవుతుంది. మరుసటి రోజు మంగళవారం చైనా తొలి క్వార్టర్‌ జీడీపీ వృద్ధి, పారిశ్రామి కోత్పత్తి డేటాతో పాటు యూరోజోన్‌ ఫిబ్రవరి బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ గణాంకాలు వెల్లడి కానున్నా యి. ఇక బుధవారం జపాన్‌ ఫిబ్రవరి పారిశ్రామి కోత్పత్తి, యూరోజోన్‌ మార్చి ద్రవ్యోల్బణ విడుదల అవుతుంది. జపాన్‌ మార్చి బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్, అమెరికా ఇళ్ల అమ్మకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపా న్‌ మార్చి ద్రవ్యోల్బణం, యూరోజోన్‌ తయారీ రంగ సర్వీసు, అమెరికా తయారీ రంగ సర్వీసు డేటా వెల్లడి కానుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.

► విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు  
గత ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ ఇన్వెస్టర్లు 2023–24ని సానుకూలంగా ప్రారంభించారు. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో డెట్‌ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్‌ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్‌ మినిట్స్‌ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్‌ 25 బేసిస్‌ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్‌పీఐ ధోరణి అస్థిరంగా ఉండొచ్చు’’అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement