ఇటీవల మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత రెండు వారాల్లోనే 12 శాతం లాభపడ్డాయి. దీంతో ఇకపై కొంతమేర కరెక్షన్‌కు చాన్స్ ఉన్నదంటున్నారు ఎన్‌విజన్ క్యాపిటల్ ఎండీ, సీఈవో నీలేష్ షా. భవిష్యత్‌లో మార్కెట్ల గమనం, పెట్టుబడి అవకాశాలు, విభిన్న రంగాలు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..
క్యూ1, క్యూ2 వీక్
ఈ ఏడాది ద్వితీయార్థంకంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించకపోవచ్చని అత్యధిక శాతం కార్పొరేట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా మార్కెట్లు పుల్‌బ్యాక్ ర్యాలీలో సాగుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేస్తుండటంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12 శాతం లాభపడ్డాయి. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైతం పెట్టుబడులను కుమ్మరిస్తుండటంతో సెంటిమెంటు బలపడింది. మరోవైపు మిడ్, స్మాల్ క్యాప్స్ ఇటీవల జోరు చూపుతున్నాయి. ఈ ఏడాది(2020-21) తొలి రెండు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు నిరాశపరిచే వీలుంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక ఫలితాలు బలహీనపడనున్నాయి. దీంతో మార్కెట్లు ఇకపై మరింత ర్యాలీ చేయకపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడినుంచీ వెనకడుగువేసే అవకాశముంది.
7,500 చాన్స్ తక్కువే
ఇటీవల ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లలో మళ్లీ భారీ కరెక్షన్‌కు చాన్స్ తక్కువే. వెరసి మార్చి కనిష్టం 7,500 పాయింట్ల స్థాయికి నిఫ్టీ పతనంకాకపోవచ్చు. అయితే కొన్ని రంగాలు ఊహించినదానికంటే అధికంగా దెబ్బతినవచ్చు. ఇదే విధంగా కొన్ని కంపెనీలు నిరుత్సాహకర పనితీరు చూపడంతో కొత్త కనిష్టాలను తాకే వీలుంది. నాయకత్వ పటిమ, పటిష్ట బిజినెస్‌లవైపు మార్కెట్లు దృష్టిసారిస్తాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను విసరనున్నాయి. భవిష్యత్‌లోనూ ఫైనాన్షియల్ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే.. తిరిగి లాక్‌డవున్ పరిస్థితులు తలెత్తవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్లను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము.
వచ్చే ఏడాదిలోనే
ఈ ఏడాది పలు రంగాలలోని కంపెనీలు అంతంతమాత్ర పనితీరునే చూపవచ్చు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో పరిస్థితులు సర్దుకునే వీలుంది. ఏఏ రంగాల నుంచి డిమాండ్ పుట్టవచ్చు లేదా.. ఎలాంటి కంపెనీలు వృద్ధి సాధించవచ్చన్న అంచనాలు కీలకంగా మారనున్నాయి. కొన్ని కంపెనీలు కోవిడ్-19 పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతోపాటు.. పటిష్ట ఫలితాలవైపు సాగవచ్చు. ప్రధానంగా సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా రంగాలు వెలుగులో నిలిచే వీలుంది. ఇదే విధంగా కిచెన్- హోమ్ అప్లయెన్సెస్ విభాగాలకు సైతం డిమాండ్ కనిపించనుంది. ఈ బాటలో ఆరోగ్య పరిరక్షణ(హెల్త్, వెల్‌నెస్), వ్యక్తిగత సంరక్షణ విభాగాలు పటిష్ట పనితీరు ప్రదర్శించవచ్చని భావిస్తున్నాం. రానున్న రెండేళ్లలో టెక్నాలజీ కౌంటర్లు సైతం బౌన్స్‌బ్యాక్ సాధించవచ్చు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ద్వారా టెక్నాలజీ సర్వీసులకు డిమాండ్ పెరిగే వీలుంది.
చిన్న షేర్లు గుడ్
ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేస్తున్నాయి. అయినప్పటికీ 2017-18 గరిష్టాలతో పోలిస్తే 50 శాతం తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే ఈ విభాగంలో నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కన్జూమర్ అప్లయెన్సెస్, హెల్త్, వెల్‌నెస్ తదితర రంగాలకు చెందిన కొన్ని కౌంటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమర్ధవంత నిర్వహణ, తక్కువ రుణ భారం, పటిష్ట బ్యాలన్స్‌షీట్స్, నగదు నిల్వలు కలిగిన కంపెనీలు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముంది. సరైన రంగాల నుంచి నాణ్యమైన కంపెనీలను ఎంచుకుంటే భారీ ప్రతిఫలాలను పొందవచ్చని ఆశిస్తున్నాం.
ఎన్‌బీఎఫ్‌సీలు వద్దు
మార్చి చివరి వారంలో మార్కెట్లు బాటమవుట్ అయినప్పటికీ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ విభాగాన్ని తప్పించుకోవడమే మేలు. కొన్ని కంపెనీలు బలమైన యాజమాన్యం, పెట్టుబడులను కలిగి ఉన్నప్పటికీ రుణ నాణ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యే వీలుంది. సమీపకాలంలో రుణ వసూళ్లు, మొండిబకాయిలు వంటి సవాళ్లకు ఆస్కారం ఉంది. మారటోరియం ప్రభావం భవిష్యత్‌లో కనిపించనుంది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి ఈ ఏడాది సమస్యాత్మకంగా నిలిచే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment