నెల రోజుల్లో 10,000 పాయింట్లు జంప్
ఫలితాల రోజున ఏకంగా 6,234 పాయింట్లు క్రాష్
70,234 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి.
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం.
కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!
జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.
కట్ చేస్తే...
జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment