ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిధులతోనే స్టాక్ మార్కెట్లకు జోష్‌వస్తున్నందటున్నారు మార్కెట్ల స్వతంత్ర విశ్లేషకులు ఆనంద్ టాండన్. దీంతో వాస్తవిక పరిస్థితులను విస్మరిస్తూ ఇండెక్సులు పరుగుతీస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరు, లిక్విడిటీ, కోవిడ్-19 ప్రభావం వంటి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..
చివరి దశ..?
నిజానికి స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ ప్రభావంతో పరుగుతీస్తున్నాయి. ఇందువల్లనే ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్‌సైతం ర్యాలీ చేస్తున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని అడ్డుకునేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా చౌక నిధులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రంగాల కంపెనీలు సైతం ఇటీవల జోరు చూపుతున్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ దిగ్గజాలు ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆతిథ్య రంగం, వాహన రంగాలు ఇంకా కోలుకోవలసి ఉంది. ఇక ట్రక్కుల విక్రయాలు ఊపందుకోనప్పటికీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వీటిని పక్కనపెడితే.. పలు మిడ్, స్మాల్ క్యాప్స్ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఫండమెంటల్స్ లేదా కంపెనీల ఆర్జన మెరుగుపడే అంచనాలకంటే లిక్విడిటీ ప్రభావమే ఇందుకు సహకరిస్తోంది. ఆటో రంగాన్నే తీసుకుంటే.. వాణిజ్య వాహన విక్రయాలు వెనకడుగులో ఉన్నాయి. సీవీలు, కార్లతో పోలిస్తే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపించే వీలుంది. నిజానికి అండర్‌పెర్ఫార్మింగ్ కంపెనీల షేర్లు సైతం బలపడుతున్నాయంటేటే.. ర్యాలీ చివరి దశకు చేరినట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే లిక్విడిటీ కారణంగా పరుగెడుతున్న మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా వ్యవహరించడమే మేలు. తద్వారా స్వల్పకాలంలో కొంతమేర లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.
దీర్ఘకాలంలోనూ
నిజానికి మార్కెట్లను అధిక సమయాలలో లిక్విడిటీనే నడిపిస్తుంటుంది. గత ఐదు, ఆరేళ్లుగా చూస్తే దేశీయంగా కంపెనీల ఆర్జనలకు మించుతూ మార్కెట్లు లాభపడుతూ వచ్చాయి. ఇందుకు వడ్డీ రేట్లు వంటివి దోహదం చేశాయి. దీంతో ఫండమెంటల్స్‌కంటే వడ్డీ రేట్లే స్టాక్స్‌కు బలాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు, కంపెనీలు రుణ భారాన్ని అధికంగా మోస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో ఇప్పుడే అంచనా వేయలేము. చౌకగా లభిస్తున్న నిధులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా కంపెనీలు నిలదొక్కుకోవాలనుకుంటే.. డిమాండ్ పెరిగి ధరలు పుంజుకోవలసి ఉంటుంది. ఇది జరిగితే.. ప్రస్తుత స్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగకపోవచ్చు.
గైడెన్స్ ఎలా
వచ్చే ఏడాది లేదా ఒకటి రెండు త్రైమాసికాలకు ప్రస్తుతం ఏ కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు దీనికి కారణంకాగా.. మార్కెట్లలో సాధారణంగా ఎప్పటికప్పుడు పలువురు నిపుణులు 25 శాతం ఆర్జనలు అంచనా వేస్తూ ఉంటారు. అయితే పలు కంపెనీలు నిరాశను మిగులుస్తుంటాయి. అయితే ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావంతో ఎవరూ సరైన అంచనాలు వేసే పరిస్థితులు లేవు. నిజానికి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంలో కూడా సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల కాలాన్ని అంచనా వేయాలంటే చీకట్లో గురిపెట్టవలసిందే. త్వరలో కోవిడ్-19 చికిత్సకు ఔషధం వెలువడుతుందని ఆశిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంచనాలు అంత సులభంకాదు. ఎందుకంటే కోవిడ్-19కు ముందు సైతం ప్రపంచ దేశాలు మందగమన పరిస్థితులను ఎదర్కొంటూ వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయంగా జీడీపీ 4 శాతానికి పరిమితమైంది. ఇందుకు ప్రభుత్వ ప్యాకేజీసైతం ప్రోత్సాహాన్నివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను మించి భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగుతీస్తుందని చెప్పాలంటే ఎంతో ఆశావహం ధృక్పథం కలిగి ఉండాలి. అయినప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయంటే ఫండమెంటల్స్ లేదా వాస్తవిక పరిస్థితులకంటే లిక్విడిటీయే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment