![పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61488581296_625x300.jpg.webp?itok=CVYnT-Y7)
పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి
జనవరి కంటే ఫిబ్రవరి ఆదాయం రూ.100 కోట్లు అధికం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కోలుకుంటోంది. జనవరి ఆదాయం కంటే ఫిబ్రవరిలో దాదాపు రూ.100 కోట్లు ఎక్కువగా ఆదాయం లభించడం రిజిస్ట్రేషన్ వర్గాలకు ఊరట కలిగిస్తోంది. జనవరిలో రిజిస్ట్రేసన్ల శాఖకు రూ.175.04 కోట్ల ఆదాయం లభించగా, ఫిబ్రవరి ఆదాయం రూ.274.87 కోట్లకు చేరడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పంట సొమ్ము చేతికి రావడం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు నగదు విత్‌డ్రా పరిమితులను బ్యాంకులు సడలించడంతో అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాలను రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధం చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల వినియోగదారులు తమ స్థిరాస్తులను ఐటీ రిటర్నుల్లో తప్పనిసరిగా చూపించాల్సి ఉన్నందున, తమ ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇదే తీరు కొనసాగితే మార్చిలో మరింత రాబడి వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.