రియల్ మార్కెట్లో కొనుగోళ్ల హుషారు!
* జిల్లాల్లోనూ అమ్మకాల జోరు
* కొనుగోళ్లకిదే సరైన సమయమంటున్న నిపుణులు
* కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్న కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: వేచి చూద్దామా? కొనుగోలు చేద్దామా? స్థిరాస్తి మార్కెట్లో పరిణామాలు చూస్తుంటే కొనుగోలుకు మరింకెంతమాత్రం ఆలస్యం చేయవద్దు అంటున్నాయి. స్థిరాస్తి డెవలపర్లు, మార్కెట్ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే పాతికశాతం వృద్ధి నమోదుచేయడం గమనిస్తే మార్కెట్ క్రమంగా పెరుగుతుందన్న సంకేతాలూ కనబడుతున్నాయి. ఆల స్యం చేస్తే ఇప్పుడున్న ధరల్లో భవిష్యత్తులో రక్కపోవచ్చు.
స్థిరాస్తి రంగంలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్లుపక్కలే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికాలంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమల నిర్వాహకులు రాజధానితో పాటూ చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లాంట్లు, కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల పెట్టుబడులను ప్రకటించేశాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడి స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మొదలు.. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్‌లు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. పాతికశాతం పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయమే ఇందుకు నిదర్శనం.
జిల్లాల్లోనూ వృద్ధి..
నగరానికి దీటుగా జిల్లాల్లోనూ రియల్ రంగం పరుగులు పెడుతోంది. యాదాద్రి క్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, వరంగల్-హైదరాబాద్‌ను పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి.పెట్టుబడి కోణంలో ఎక్కువమంది ఇక్కడ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ర్టంలోకెల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 37 శాతం పెరగడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఎప్పుడూ ముందుండే రంగారెడ్డి జిల్లాను నల్లగొండ మించిపోయింది.
రంగారెడ్డి జిల్లాల్లోనూ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మాణాలు, స్థలాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వృద్ధి 29 శాతంగా ఉంది. ఆపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు నగరానికొచ్చాయి. ఇవన్నీ మార్కెట్‌ను సానుకూల దిశగా తీసుకెళుతున్నాయని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణాలపరంగా వేగం పెరగడంతో హైదరాబాద్ సౌత్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు తగ్గట్టుగానే డెవలపర్లూ కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు.
హైదరాబాద్ పశ్చిమం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కొత్తగా వచ్చేవారూ ఇక్కడే కావాలంటున్నారు. సంస్థలన్నీ ఈ ప్రాంతంలో కేంద్రీకృతం కావటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. పూర్తికావొచ్చిన ప్రాజెక్ట్‌ల్లోనూ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రాజెక్ట్‌ల విస్తరణలతో..
హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. ఇదేదో మేం చెబుతున్నది కాదు. పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే మార్కెట్లో క్రయవిక్రయాలు పెరిగాయనేందుకు రుజువు. ఇటీవల ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కొన్ని కంపెనీలు తమ ప్లాంట్ ఏర్పాటుకూ ముందుకు రావటం ఈ వృద్ధికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లూ రానున్నాయి. వరంగల్‌లో ఐటీ విస్తరణకు చర్యలు మొదలయ్యాయి. సైయంట్ సంస్థ కార్యాలయ ఏర్పాటుకు ముందుకొచ్చింది కూడా. టెక్స్‌టైల్స్‌గా ప్రకటించేసింది ప్రభుత్వం. ఖమ్మం నగరంలో ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటు వంటివి ప్రభుత్వం ప్రకటించేసింది. ఇవన్నీ ఆయా జిల్లాల్లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి దోహదపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.