real estate developers
-
అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం
న్యూఢిల్లీ: టాటాల బాటలోనే రియల్టీ దిగ్గజం అభిషేక్ లోధా, ఆయన కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో విరాళమిచ్చింది. లిస్టెడ్ సంస్థ మ్యాక్రోటెక్ డెవలపర్స్‌లో 18 శాతం వాటాకు సరిసమానమైన షేర్లను లాభాపేక్షరహిత సంస్థ లోధా ఫిలాంత్రొపీ ఫౌండేషన్‌కు (ఎల్పీఎఫ్) బదలాయించింది.శుక్రవారం షేరు ముగింపు ధర రూ. 1,175.75 ప్రకారం వీటి విలువ రూ. 21,000 కోట్ల పైగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2013లో ప్రారంభించిన ఎల్పీఎఫ్ .. జాతీయ, సామాజిక ప్రయోజన కార్యక్రమాలపై పని చేస్తోంది. విరాళంగా లభించిన షేర్లపై వచ్చే రాబడిన ఎల్పీఎఫ్.. విద్య, మహిళా సాధికారత తదితర సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించనుంది.టాటాల బాటలోనే తమ సంపదలో గణనీయమైన భాగాన్ని సమాజ ప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించాలని కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు అభిషేక్ లోధా గతంలో వెల్లడించారు. ‘వందేళ్ల క్రితం టాటా కుటుంబం గ్రూప్ సంస్థల్లోని షేర్‌హోల్డింగ్‌లో సింహభాగాన్ని టాటా ట్రస్ట్స్‌కి బదలాయించింది. దేశానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ బహుమతి గణనీయంగా ప్రభావం చూపడం, టాటా ట్రస్ట్స్ చేపట్టిన అనేక మంచి పనులు నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని పేర్కొన్నారు. -
రియల్టీలో భారీ లావాదేవీలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు 2018–22 మధ్య భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. 12.2 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు సమారు) ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,800 ఎకరాల భూమిని సమీకరించినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో డెవలపర్ల నుంచి భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో భూముల కొనుగోలు పెరిగిందని.. 6,800 ఎకరాల్లో అధిక భాగం 2021 జనవరి తర్వాత సమకీరించినదిగా పేర్కొంది. ‘‘భూముల క్రయ విక్రయాల పరంగా 2022 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలం కోసం చూస్తున్నట్టు ఇది తెలియజేస్తోంఇ’’ అని సీబీఆర్ఆ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మొత్తం కొనుగోలు చేసిన భూముల్లో నివాస, మిశ్రమ వినియోగానికి సంబంధించే 60 శాతంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే భూముల సమీకరణకు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రానున్న సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి ప్రాపర్టీల సరఫరా ఎక్కువగా ఉంటుందని సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. గ్రీన్‌ఫీల్డ్ కార్యాలయాల అభివృద్ధికి సంబంధించి భూముల కొనుగోళ్లు మొత్తం పెట్టుబడుల్లో 19 శాతంగా ఉండగా, ఇండస్ట్రియల్ రంగంలో 9 శాతం, లాజిస్టిక్స్ అవసరాల భూముల కోసం 7 శాతం పెట్టుబడులు వచ్చాయి. పార్క్‌ల అభివృద్ధికి సంబంధించి భూముల సమీకరణ 3 శాతంగా ఉంది. ప్రాంతాల వారీ.. ► 2018–22 మధ్య జరిగిన భూముల కొనుగోళ్లలో 67 లావాదేవీలు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే నమోదయ్యాయి. 760 ఎకరాల కొనుగోలుకు 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబలు వచ్చాయి. ► ముంబైలో 960 ఎకరాలకు సంబంధించి 3.8 బిలియన్ డాలర్ల విలువైన 73 లావాదేవీలు నమోదయ్యాయి. ► బెంగళూరులో 1.1 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 ఎకరాలకు సంబంధించి 44 లావాదేవీలు జరిగాయి. ► హైదరాబాద్ మార్కెట్లో 2018–22 మధ్య మొత్తం 24 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 970 ఎకరాల కొనుగోలుకు 0.9 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ► పుణె నగరంలో 450 ఎకరాలకు సంబంధించి 27 లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వీటి విలువ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ► చెన్నై రియల్టీ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది. ► ఇక దేశంలోని మిగిలిన పట్టణాల్లో 1,300 ఎకరా లకు సంబంధించి లావాదేవీలు నమోదయ్యాయి. విలువలు ఇలా... 2018–22 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొత్తం మీద 43.3 బిలియన్ డాలర్ల విలువ చేసే (రూ.3.55 లక్షల కోట్లు) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. నార్త్ అమెరికా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లను ఈక్విటీ రూపంలో సమకూర్చారు. ఈ కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల్లో ఇవి 58 శాతంగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా ఉంటుందని, 16–17 బిలియన్ డాలర్ల మేర రావచ్చని అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఆఫీస్ విభాగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయన్నారు. -
Shopping Mall: షాపింగ్ మాల్స్ ఢమాల్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్స్ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్‌లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్ యజమానులు సాధారణంగా లీజ్ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్డౌన్ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్ వేవ్‌లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్ గ్రూప్ ఈడీ అభిషేక్ బన్సల్ తెలిపారు. రెంటల్ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్ డైరెక్టర్ హర్‡్ష బన్సల్ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్మన్, వేక్ఫీల్డ్ చెబుతోంది. ఇతర ఆదాయాలూ తగ్గాయి.. మొత్తం రెంటల్ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్–అప్ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్ ఇండియా డైరెక్టర్ హర్షవర్ధన్ సింగ్ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్ పుంజుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముప్పులా పరిణమించిందని చెప్పారు. -
రియల్ మార్కెట్లో కొనుగోళ్ల హుషారు!
* జిల్లాల్లోనూ అమ్మకాల జోరు * కొనుగోళ్లకిదే సరైన సమయమంటున్న నిపుణులు * కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్న కంపెనీలు సాక్షి, హైదరాబాద్: వేచి చూద్దామా? కొనుగోలు చేద్దామా? స్థిరాస్తి మార్కెట్లో పరిణామాలు చూస్తుంటే కొనుగోలుకు మరింకెంతమాత్రం ఆలస్యం చేయవద్దు అంటున్నాయి. స్థిరాస్తి డెవలపర్లు, మార్కెట్ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే పాతికశాతం వృద్ధి నమోదుచేయడం గమనిస్తే మార్కెట్ క్రమంగా పెరుగుతుందన్న సంకేతాలూ కనబడుతున్నాయి. ఆల స్యం చేస్తే ఇప్పుడున్న ధరల్లో భవిష్యత్తులో రక్కపోవచ్చు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్లుపక్కలే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికాలంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమల నిర్వాహకులు రాజధానితో పాటూ చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లాంట్లు, కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల పెట్టుబడులను ప్రకటించేశాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడి స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మొదలు.. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్‌లు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. పాతికశాతం పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయమే ఇందుకు నిదర్శనం. జిల్లాల్లోనూ వృద్ధి.. నగరానికి దీటుగా జిల్లాల్లోనూ రియల్ రంగం పరుగులు పెడుతోంది. యాదాద్రి క్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, వరంగల్-హైదరాబాద్‌ను పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి.పెట్టుబడి కోణంలో ఎక్కువమంది ఇక్కడ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ర్టంలోకెల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 37 శాతం పెరగడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఎప్పుడూ ముందుండే రంగారెడ్డి జిల్లాను నల్లగొండ మించిపోయింది. రంగారెడ్డి జిల్లాల్లోనూ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మాణాలు, స్థలాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వృద్ధి 29 శాతంగా ఉంది. ఆపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు నగరానికొచ్చాయి. ఇవన్నీ మార్కెట్‌ను సానుకూల దిశగా తీసుకెళుతున్నాయని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణాలపరంగా వేగం పెరగడంతో హైదరాబాద్ సౌత్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు తగ్గట్టుగానే డెవలపర్లూ కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ పశ్చిమం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కొత్తగా వచ్చేవారూ ఇక్కడే కావాలంటున్నారు. సంస్థలన్నీ ఈ ప్రాంతంలో కేంద్రీకృతం కావటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. పూర్తికావొచ్చిన ప్రాజెక్ట్‌ల్లోనూ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ల విస్తరణలతో.. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. ఇదేదో మేం చెబుతున్నది కాదు. పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే మార్కెట్లో క్రయవిక్రయాలు పెరిగాయనేందుకు రుజువు. ఇటీవల ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కొన్ని కంపెనీలు తమ ప్లాంట్ ఏర్పాటుకూ ముందుకు రావటం ఈ వృద్ధికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లూ రానున్నాయి. వరంగల్‌లో ఐటీ విస్తరణకు చర్యలు మొదలయ్యాయి. సైయంట్ సంస్థ కార్యాలయ ఏర్పాటుకు ముందుకొచ్చింది కూడా. టెక్స్‌టైల్స్‌గా ప్రకటించేసింది ప్రభుత్వం. ఖమ్మం నగరంలో ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటు వంటివి ప్రభుత్వం ప్రకటించేసింది. ఇవన్నీ ఆయా జిల్లాల్లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి దోహదపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
వాటికా గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై చీటింగ్ కేసు
వాటికా గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో పాటు ఇద్దరు డైరెక్టర్లపై చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయల మేరకు మోసం చేసినందుకు ఈ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎండీ గౌతమ్ భల్లా, గ్రూపు డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లాలపై ఐపీసీ సెక్షన్లు 406, 420ల కింద కేసు నమోదైంది. ఢిల్లీ మాలవీయ నగర్‌కు చెందిన రాజ్‌కమల్ భాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అనిల్ భల్లా, ఆయన కుమారులు కోటి రూపాయల మేరకు మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 డిసెంబర్ నెలలో ఓ విల్లా కొనుగోలు కోసం భాటియా ఈ మొత్తం చెల్లించారని, కానీ ఆ కంపెనీ మాత్రం విల్లా ఇవ్వలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విల్లా ఇవ్వకపోగా.. తన సొమ్ము కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదని భాటియా వాపోయారు. పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం దీనిపై విచారణ జరుపుతోంది. -
వార్ పేరుతో రియల్ బెదిరింపులు
సిద్దిపేట క్రైం : సులువుగా డబ్బు సంపాదించేందుకు పీపుల్స్‌వార్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టును సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌కు చెందిన ఆరగొండ విఠల్, లక్ష్మీనారాయణ సోదరులు. వీరి మధ్య ఆస్తి తగదాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన అడెపు కృష్ణమూర్తిని కలిసి తమ వివాదం గురించి చెప్పాడు. దీంతో కృష్ణమూర్తి.. గతంలో పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ ఆర్ఎస్యూలో పని చేసిన వరంగల్ జిల్లా బొడ్లాడ మండలం నెల్లికుదురుకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్‌ను లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ప్రసాద్‌తో పాటు కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య, ఉడుగుల కృష్ణ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. విఠల్-లక్ష్మీనారాయణ మధ్య ఉన్న ఆస్తి తగదాను అనువుగా చేసుకుని ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరున లేఖలు ముద్రించి, విఠల్‌కు బెదిరింపు లేఖ రాశారు. అందులో విఠల్ ఆస్తి వివరాలను పేర్కొంటూ తమకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుట్టు రట్టయిందిలా.. మొదట బెదిరింపు లేఖపై విఠల్ స్పందించలేదు. దీంతో ముఠా సభ్యులు ఫోన్‌చేసి కుటుంబసభ్యులందరిని చంపేస్తామని బెదిరించారు. విఠల్ భయపడి రూ.50 వేలు ప్రసాద్‌కు అందించాడు. మరో వారం తర్వాత ప్రసాద్ ఫోన్‌చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విఠల్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సూచనతో విఠల్.. సిద్దిపేటకు వచ్చి డబ్బులు తీసుకోవాలని ప్రసాద్ ముఠాకు చెప్పాడు. మంగళవారం ప్రసాద్, కృష్ణ, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య సిద్దిపేట వచ్చారు. మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, రూ. 40వేలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు బెదిరించి వసూలు చేసిన రూ. 98వేలు బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు వెంకటేశ్వర్రావు పరారీలో ఉన్నాడు. కేసును చేధించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఐడీ సిబ్బంది సంపత్, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌ను డీఎస్పీ అభినందించారు. ఏపీ, తెలంగాణలో 11 కేసులు వరంగల్ జిల్లాకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్.. తన మిత్రుడైన సీతారాంరెడ్డితో కలిసి ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరుతో లెటర్ ప్యాడ్‌ను కొట్టించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరింపు లేఖలు రాసేవారు. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేయగా, అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రసాద్.. మరో స్నేహితుడైన వెంకటేశ్వర్రావుతో కలిసి ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ప్రాంతాల్లోని మరికొందరికి లేఖలు రాసి డబ్బులు డిమాండ్ చేయగా, ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరులోని స్టోన్‌క్రషర్ యజమాని, కాకినాడలోని స్వామిజీకి కూడా ఫోన్‌చేసి బెదిరించిన కేసుల్లో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ప్రసాద్ ముఠాపై వివిధ ప్రాంతాల్లో 11 కేసులు నమోదైనట్టు పోలీసులు వివరించారు. ఎవరికైనా బెదిరింపు ఫోన్లు, లేఖలు వస్తే పోలీసులను సంప్రదించాలని, సెటిల్మెంట్ల జోలికి పోవద్దని డీఎస్పీ శ్రీధర్ సూచించారు. -
పింఛాపై రియల్ కన్ను
- గుట్టుచప్పుడు కాకుండా నదిని పూడ్చివేస్తున్న వైనం - పట్టించుకోని అధికార యంత్రాంగం పీలేరు: దశాబ్దాల చరిత్ర కలిగిన పీలేరు పింఛా నదిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఏటి సమీపంలో కొంతమేరకు దురాక్రమణకు పాల్పడుతున్నారు. వందలాది మంది రైతులకు ఆధారమైన నది పరిసర ప్రాంతాలను రోజుకు కొంత చొప్పున మట్టితోలి చదును చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూములకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ పరిసర ప్రాంతాల్లోని డీకేటీ భూములు, వాగులు, వంకలు, గుట్టలను చదునుచేసి ప్లాట్లు వేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అనతి కాలంలోనే లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పీలేరు పరిసర ప్రాంతాల్లో పలు గుట్టలను చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పీలేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఎవ్వరికీ ఇవ్వమని ఓ వైపు అధికారులు చెబుతున్నప్పటికీ మరో వైపు ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. తాజాగా పింఛా ఏటిని ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమేరకు మట్టితో పూడ్చి ఆక్రమించుకున్నారు. మదనపల్లె మార్గం లోని బడబళ్లవంక ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మరోవైపు కాకులారంపల్లె పంచాయతీ కోళ్లపారం గ్రామ సమీపంలో ఎన్నో ఏళ్లనుంచి ఉండే వంకను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి సిమెంట్ ఇటుకలతో మురుగునీటి కాలువ తరహాలో గోడ కట్టేశారు. పీలేరు పట్టణ నడిబొడ్డున వెళుతున్న అయ్యపునాయుని చెర్వు కాలువ అనేక చోట్ల ఆక్రమణకు గురైం ది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు, పలువురు రైతులు వాపోతున్నారు. బోడుమల్లువారి పంచాయతీ పరిధిలోని బ్రిడ్జివద్ద భూములను చదునుచేసే క్రమంలో భాగంగా పింఛా నదిని కొంతమేరకు పూడ్చివేసి రాతికట్టడం కట్టేశారు. మరోవైపు నదిలో మట్టితోలి ఆక్రమణకు ఉపక్రమిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా ఆక్రమణలు చోటుచేసుకోకుండా తగు చ ర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఐఏఎస్ రవి మృతిపై అనేక అనుమానాలు...
బెంగళూరు: యువ ఐఏఎస్ అధికారి డీకె రవి అనుమానాస్పద మృతిపై ఆర్టీఐ కార్యకర్త గణేష్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవి నిజాయితీగా పనిచేసే అధికారి. ఆయన లాండ్ మాఫియా భరతం పట్టే క్రమంలో ఉన్నారని... దానికి సంబంధించి కొన్ని ప్రతాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. బెంగళూరులో ఓ భూ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలోనే డీకె రవి హత్య జరిగి ఉంటుందని గణేష్ అనుమానపడుతున్నారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉండి ఉంటుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. డీకె రవి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని గణేష్ ఆరోపిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా కోరేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్నారని సమాచారం. కాగా తమ ప్రాథమిక దర్యాప్తులో డీకె రవి తన అపార్ట్ మెంట్లో ఉరి వేసుకున్నట్టుగా తేలిందని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రతీ కోణాన్ని పరిశీలిస్తున్నామని ... వైద్య నివేదికలు వచ్చేంతవరకు వేచి వుండాలని కోరారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేయడం, ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. -
మేళ్లకుంటలో రియల్టర్ల మేత!
కరీంనగర్ రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ కుంట శిఖం ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ,కోట్ల విలువైన శిఖం స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని రహదారులను నిర్మించారు. దాదాపు రూ.8కోట్ల విలువైన రెండెకరాల భూమిని బై నెంబర్లతో రియల్టర్లు పలువురికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ భూముల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లోని సర్వే నెంబరు-71లోని మేళ్లకుంట ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతుంది. నగర విస్తరణతో కుంట చుట్టూ ఉన్న స్థలానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం గుంట ధర రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంది. 13 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటశిఖంలో గత కొన్ని నెలల నుంచి అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. రియల్టర్లతో స్థానిక ప్రజాప్రతినిధి కుమ్మక్కు రూ.కోట్ల విలువైన కుంటశిఖం స్థలంపై కొందరు రియల్టర్లు కన్నేశారు. గ్రామానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధిని వాటా పేరుతో మచ్చిక చేసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కుంట శిఖం స్థలంలో దాదాపు ఇరవై అడుగుల వెడల్పుతో స్థానిక ప్రజాప్రతినిధి సాయంతో ఎల్ ఆకారంలో రహదారి నిర్మించారు. దీంతో సమీపంలోని నివాసగృహాలు, పట్టాదారులకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు సైతం ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు కుంట శిఖం స్థలాన్ని రియల్టర్లు బై నెంబర్లతో మాయ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులతో కుమ్మక్కైన రియల్టర్లు దర్జాగా రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు. మేళ్లకుంట సర్వేనెంబరు-71 కాగా రియల్టర్లు సర్వేనెంబరు-71/1,2,3, పేరిట దాదాపు ఇరవై మందికిపైగా ఒక్కొక్కరికి రెండు గుంటలు, మూడు గుంటల చొప్పున ఎకరంన్నర స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పహణీలో సర్వేనెంబరు-71కి బై నెంబర్లు లేకపోయినప్పటికీ అధికారులకు మామూళ్లు అందుతుండటంతో కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ తతంగాన్ని ముగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు కరువు కుంట శిఖం స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు గృహనిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుంట స్థలానికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్లు-51,52, 66లోని భూములకు సంబంధించిన పట్టాదారులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి పట్టాభూమిలో గృహనిర్మాణం కోసం అనుమతి తీసుకుని శిఖం స్థలంలో కడుతున్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఒక వ్యక్తి కుంట శిఖంలో గృహ నిర్మాణం చేపట్టాడని రెవెన్యూ అధికారులు అడ్డుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వ్యవహారం ముగియక ముందే సదరు వ్యక్తి గృహనిర్మాణం పూర్తికావడంతోపాటు మరికొందరు వ్యక్తులు ప్రహరీ, గృహ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
కనిగిరిలో రియల్ ఎస్టేట్ సందడి
కనిగిరి: ఇప్పటిదాకా నిస్తేజంగా.. నిస్సారంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. దళారుల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది. ఇప్పుడు వారంతా కనిగిరి వీధుల్లో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే నల్లగొండ జిల్లా నకరికల్ నుంచి చిత్తూరు జిల్లా ఏర్పేడు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి.. కనిగిరి నియోజకవర్గం నుంచి కూడా వెళ్లనుంది. జిల్లా పరిధిలో నిర్మించనున్న డబుల్ లేన్ రోడ్డు కోసం రూ. 253 కోట్లకు గాను టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ హైవే కనిగిరిని ఆనుకొని కొత్తూరు మీదుగా వెళ్లనుండటంతో స్థానిక భూ వ్యాపారుల్లో కదలిక వచ్చింది. రెండు రోజుల నుంచి అధికారులు మార్కింగ్ వేసేపనిలో నిమగ్నమయ్యారు. కనిగిరిలో రోడ్డు స్వరూపం ఇలా.. కనిగిరి డివిజన్లో(డీకేడీ రోడ్డు) 67.4 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు పడనుంది. ఇది కనిగిరి పట్టణానికి సమీపంలో స్థానిక పొదిలి రోడ్డులోని ముస్లిం బరియల గ్రౌండ్ ఎత్తు రోడ్డు నుంచి చెరువు అలుగు ఆనుకుంటూ కంభం రోడ్డు మీదుగా గంగనగర్ వెంచర్ మధ్యలో నుంచి సుదర్శన్ థియేటర్ వెనుక పొలాల మీదుగా.. కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద తారు రోడ్డును ఎక్కే విధంగా మార్కింగ్ చేశారు. చెరువు అలుగు, సాధనడాబా వెనుక, గంగానగర్ వెంచర్ మధ్యలో బౌండరీ మార్కింగ్ వేశారు. అక్కడ నుంచి పామూరు మండలంలోని వగ్గంపల్లితో హైవే వెళ్లే జిల్లా సరిహద్దు పూర్తవుతుంది. ప్లాట్లు కొన్నవాళ్ల టెన్షన్... ఒకప్పుడు రియల్ బూమ్ ఆకాశానికి ఎగబాకడంతో కనిగిరిలో బోలెడు వెంచర్లు వెలిశాయి. ఎంతోమంది ప్లాట్లు సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా రోడ్డు నిర్మాణం ప్రతిపాదనతో ఆయా ప్రదేశాల్లో స్థలాలు కొన్నవారిలో ఆందోళన మొదలైంది. అంకణానికి (6 గదులు) రూ. 60వేల నుంచి లక్ష వరకు చెల్లించిన వెంచర్ల మధ్య రోడ్డు మార్కింగ్ పడటంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే భూమి రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు చెల్లించి భూములు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులంటున్నారు. రెండు లేన్ల రోడ్డు కోసం 7 నుంచి 10 మీటర్ల భూమి అవసరమైతే.. పాతూరు వెనుక వైపు, కొత్తూరు వాగు వెనుకగల కొన్ని వెంచర్లు పూర్తిగా కనుమరుగు అవ్వాల్సిందే. అలాగే ఆయా ప్రదేశాల్లో జొన్ని, వరి, కంది పండించే పొలాలు కూడా రోడ్డు పరిధిలోకి వెళ్లిపోతాయి. -
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం
పడిపోయిన భూ క్రయవిక్రయాలు రియల్టర్ల అంచనాలు తలకిందులు రూ.కోట్లకు ఐపీ పెడుతున్న వ్యాపారులు తగ్గిపోయిన రిజిస్ట్రేషన్ ఆదాయం గతంలో జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు నెలకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. ఈసారి ఏప్రిల్‌లో రూ.13కోట్లు, మేలో రూ.14 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వరుసగా ఆరు నెలలుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఆ శాఖకు వచ్చే ఆదాయం తగ్గిపోవటం ఇప్పుడున్న సంక్షోభానికి అద్దం పడుతోంది. కరీంనగర్ అర్బన్ : రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో వ్యాపారం పడిపోయింది. స్థలాల క్రయవిక్రయాలు జరుగకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తా యనే ఆశతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన వారు నేడు భూములు అమ్ముడుపోక ఆందోళన చెందుతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి భూములపై పెట్టుబడులు పెట్టినవారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. జిల్లాలో పదేళ్ల నుంచి గత రెండుమూడు సంవత్సరాల దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాసులు కురిపించింది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్క డ వెంచర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో సామాన్యులు సైతం అప్పులు చేసి ఇంటిస్థలాలు కొను క్కున్నారు. మరికొందరు వ్యాపార ధోరణితో పెట్టుబడులు పెట్టారు. స్థలం ఒకసారి చేయి మారితే రూ.లక్షల్లో లాభాలు వచ్చాయి. ఈ వ్యాపారంతో కొందరు స్వల్ప వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. కానీ గత రెండు మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. భూముల ధరలు అనూహ్యంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఉదాహరణకు కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గుంట స్థలానికి రూ.10-20 లక్షల ధర పలుకుతోంది. ఇంత భారీ ధరకు స్థలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇంతకన్నా తక్కువ ధరకు అమ్మితే వ్యాపారులకు గిట్టుబాటు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. దీంతో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. గత సంవత్సరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్తబ్ధత నెలకొని రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యానికి తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు వరుసగా స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిందని వ్యాపారులు అంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇలాఉంటే.. ఈ సంవత్సరం గతేడాది కంటే 25 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ ఆదాయం ఆర్జించాలని సర్కారు లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ జనవరి నుంచి ఇప్పటివరకు భూ క్రయవిక్రయాలు జరుగక ప్రతి నెల లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఆస్తులు, స్థలాల క్రయవిక్రయాల ద్వారా ఏప్రిల్ నెలలో జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.13 కోట్ల ఆదాయం లభించింది. మే నెలలో రూ.14 కోట్లు ఆదాయం వచ్చింది. గతంలో నెలకు రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తుండేది. ఇప్పుడు రూ.15 కోట్లు కూడా ఆదాయం రావడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. దస్తావేజు లేఖరులు పనిలేక ఖాళీగా కూర్చుంటున్నారు. వరుసగా ఆరు నెలలుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఆ శాఖకు వచ్చే ఆదాయం తగ్గిపోవటం ఇప్పుడున్న సంక్షోభానికి అద్దం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదేవిధంగా ఉంటే రిజిస్ట్రేషన్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయి. ఐపీ వైపు వ్యాపారుల అడుగులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనాలు తలకిందులు కావడంతో పలువురు అప్పుల్లో కూరుకుపోతున్నారు. లాభాల సంగతి పక్కనపెడితే.. పెట్టుబడులు రాబట్టుకునేం దుకు తంటాలు పడుతున్నారు. ఇలాంటి వారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ (ఇన్‌సాల్వేషన్ ఫిటిషన్) వేస్తున్నారు. తాము వ్యాపారంలో దివాళా తీసినట్టు కోర్టుకు ఆధారాలు సమర్పిస్తే రుణదాతల ఒత్తిళ్ల నుంచి కొంతకాలం రక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో ఐపీ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో రూ.వందల కోట్లకు ఐపీలు దాఖలు చేశారు. మరికొంతమంది ఐపీ దాఖలు చేసేందుకు యోచిస్తున్నారు. -
‘రియల్’ దందా
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : రియల్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న ప్రజలకు ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్ నిర్మించి ప్లాట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి డబ్బులతోనే వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చినవారికి ప్లాట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఇగో.. అగో అని తప్పించుకుంటున్నారు. బలవంతులైన మోసగాళ్లను ఏమీ చేయలేని మధ్యతరగతి ప్రజలు.. తమ అదృష్టాన్ని నిందించుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు. తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు గడించవచ్చు అని భావిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగిడుతున్నారు. రాత్రికి రాత్రే బోర్డు పెట్టుకుని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఉండి నగరంలో స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలనుకునేవారి వివరాలు సేకరిస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకొని వల వేస్తున్నారు. తక్కువ ధరలకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. డబ్బులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని చెప్పి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తర్వాత ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో పలు జరిగాయి. మోసం చేస్తున్నారిలా.. నగరంలో ఓ వర్గానికి చెందిన కొందరు వివిధ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలుండడంతో వీరు నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు తన ఆస్తిని వీరికి రూ. 65 లక్షలకు విక్రయించాడు. ఆస్తిని కొనుగోలు చేసిన సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు చెల్లించలేదు. డబ్బులు తర్వాత ఇస్తామని, తాము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే లాభాన్ని నెలనెలా చెల్లిస్తామని నమ్మించారు. నెలలు గడుస్తున్నా సదరు నాయకుడికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తాను మోసపోయానని సదరు నాయకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాను మోసపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలిసింది. తన డబ్బులు రాబట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మందినే మోసం చేసినట్లు తెలుస్తోంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామని చెప్పి పలువురి వద్దనుంచి డబ్బులు తీసుకున్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి పురోగతిలేదు. దీంతో డబ్బులిచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యాపారులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో డబ్బులకోసం నిలదీయలేకపోతున్నారని సమాచారం. అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
నిబంధనలకు పంచర్
ఇల్లందలో అక్రమ వెంచర్ పట్టించుకోని అధికారులు సాక్షి, హన్మకొండ : అధికార పార్టీ నాయకులు లాభాపేక్షే లక్ష్యంగా రియల్ దందా సాగిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికార యం త్రాంగం.. వారికే అండగా నిలవడంతో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారిపోతున్నాయి. వర్ధన్నపేట మండలంలో వందల ఎకరాల సాగు భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. తాజాగా ఇల్లంద సమీపంలో అక్రమంగా మరో వెంచర్ వెలిసింది. వర్ధన్నపేట మండలం.. వరంగల్ నగరానికి అతి సమీపంగా ఉండడంతో పాటు వరంగల్-ఖమ్మం హైవే ఈ మండలం మధ్యగుండా పోతున్నది. దీంతో ఇక్కడి వ్యవసాయ భూములకు రియల్ కళ వచ్చేసింది. ముఖ్యంగా వర్దన్నపేట మండల కేంద్రం డీసీతండా, ఇల్లంద, కట్య్రాల, పంథిని గ్రామాలపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఇక్కడి రైతుల నుంచి ఎకరా భూమిని రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇల్లందలో మరోసారి.. తాజాగా ఇల్లంద గ్రామ సమీపంలో వెలసిన వెంచర్ ఇక్కడి రియల్‌దందా తీరుకు అద్దం పడుతోంది. హైవే పక్కన ఎస్సీ హాస్టల్ వెనక భాగంలో ఐదెకరాల స్థలాన్ని గ్రామంచాయతీ, రెవెన్యూశాఖల అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు వెంచర్ చేశారు. అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తోంది. నిబంధనలను బేఖాతర్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకోకుండా, భూబదాలయింపు జరగకుండానే ఐదెకరాల్లో మొత్తం 100 ప్లాట్లతో ఈ వెంచర్ ప్రారంభించారు. ఇందులో గజం స్థలానికి రూ. 3వేల నుంచి రూ.8వేలు ధర నిర్ణయించినట్లు సమాచారం. పంచాయతీ ఆదాయానికి గండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో ప్లాట్లు చేస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేయాలంటే తొలుత పంచాయతీ అనుమతి తీసుకోవాలి. ఎన్ని అడుగుల స్థలాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నారు.. పబ్లిక్ ట్యాప్‌లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు సమాచారంతో ప్లాన్ రూపొందిం చి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి. అంతే కాకుండా భవిష్యత్తు సామాజిక అవసరాల దృష్ట్యా వెంచర్లో పది శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఆందోళన చేసినా ఆగలేదు ఇల్లంద ఎస్సీ కాలనీ నుంచి ప్రవహించే వరద నీటి కాల్వకు అడ్డుగా ఈ రియల్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడంతో దళితులు మూడు నెలల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి వెంచర్ ఏర్పాటును అడ్డుకున్నారు. ఈ వెంచర్లో ఇళ్లు వెలిస్తే తమ ఇళ్లు మురికికూపాలుగా మారిపోతాయని ఇక్కడి దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతపరిచారు. అధికారులు జోక్యం చేసుకుని వరద కాల్వ నిర్మించిన తర్వాత వెంచర్ చేసుకోవాలని చెప్పారు. కానీ, అనుమతి లేకుండానే భూమిని చదును చేసి, రాళ్లు పాతి ప్లాట్లుగా మార్చినా అధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాల్సి న పంచాయతీ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. గతంలో రెవెన్యూ సిబ్బంది వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో రెండేళ్ల క్రింతం ఇల్లంద, పంథిని గ్రామాల్లో సర్వే చేసి అనుమతి లేని వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై రెవెన్యూ అధికారులు నిఘా పెట్టడం లేదు. సరై న అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు పంచాయతీ అనుమతుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.