కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం
పడిపోయిన భూ క్రయవిక్రయాలు
రియల్టర్ల అంచనాలు తలకిందులు
రూ.కోట్లకు ఐపీ పెడుతున్న వ్యాపారులు
తగ్గిపోయిన రిజిస్ట్రేషన్ ఆదాయం
గతంలో జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు నెలకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. ఈసారి ఏప్రిల్‌లో రూ.13కోట్లు, మేలో రూ.14 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వరుసగా ఆరు నెలలుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఆ శాఖకు వచ్చే ఆదాయం తగ్గిపోవటం ఇప్పుడున్న సంక్షోభానికి అద్దం పడుతోంది.
కరీంనగర్ అర్బన్ : రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో వ్యాపారం పడిపోయింది. స్థలాల క్రయవిక్రయాలు జరుగకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తా యనే ఆశతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన వారు నేడు భూములు అమ్ముడుపోక ఆందోళన చెందుతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి భూములపై పెట్టుబడులు పెట్టినవారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. జిల్లాలో పదేళ్ల నుంచి గత రెండుమూడు సంవత్సరాల దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాసులు కురిపించింది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్క డ వెంచర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో సామాన్యులు సైతం అప్పులు చేసి ఇంటిస్థలాలు కొను క్కున్నారు. మరికొందరు వ్యాపార ధోరణితో పెట్టుబడులు పెట్టారు. స్థలం ఒకసారి చేయి మారితే రూ.లక్షల్లో లాభాలు వచ్చాయి. ఈ వ్యాపారంతో కొందరు స్వల్ప వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. కానీ గత రెండు మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. భూముల ధరలు అనూహ్యంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
ఉదాహరణకు కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గుంట స్థలానికి రూ.10-20 లక్షల ధర పలుకుతోంది. ఇంత భారీ ధరకు స్థలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇంతకన్నా తక్కువ ధరకు అమ్మితే వ్యాపారులకు గిట్టుబాటు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. దీంతో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. గత సంవత్సరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్తబ్ధత నెలకొని రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యానికి తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు వరుసగా స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిందని వ్యాపారులు అంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇలాఉంటే.. ఈ సంవత్సరం గతేడాది కంటే 25 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ ఆదాయం ఆర్జించాలని సర్కారు లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ జనవరి నుంచి ఇప్పటివరకు భూ క్రయవిక్రయాలు జరుగక ప్రతి నెల లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఆస్తులు, స్థలాల క్రయవిక్రయాల ద్వారా ఏప్రిల్ నెలలో జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.13 కోట్ల ఆదాయం లభించింది. మే నెలలో రూ.14 కోట్లు ఆదాయం వచ్చింది. గతంలో నెలకు రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తుండేది. ఇప్పుడు రూ.15 కోట్లు కూడా ఆదాయం రావడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. దస్తావేజు లేఖరులు పనిలేక ఖాళీగా కూర్చుంటున్నారు. వరుసగా ఆరు నెలలుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఆ శాఖకు వచ్చే ఆదాయం తగ్గిపోవటం ఇప్పుడున్న సంక్షోభానికి అద్దం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదేవిధంగా ఉంటే రిజిస్ట్రేషన్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయి.
ఐపీ వైపు వ్యాపారుల అడుగులు
రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనాలు తలకిందులు కావడంతో పలువురు అప్పుల్లో కూరుకుపోతున్నారు. లాభాల సంగతి పక్కనపెడితే.. పెట్టుబడులు రాబట్టుకునేం దుకు తంటాలు పడుతున్నారు. ఇలాంటి వారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ (ఇన్‌సాల్వేషన్ ఫిటిషన్) వేస్తున్నారు. తాము వ్యాపారంలో దివాళా తీసినట్టు కోర్టుకు ఆధారాలు సమర్పిస్తే రుణదాతల ఒత్తిళ్ల నుంచి కొంతకాలం రక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో ఐపీ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో రూ.వందల కోట్లకు ఐపీలు దాఖలు చేశారు. మరికొంతమంది ఐపీ దాఖలు చేసేందుకు యోచిస్తున్నారు.