మేళ్లకుంటలో రియల్టర్ల మేత!
కరీంనగర్ రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ కుంట శిఖం ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ,కోట్ల విలువైన శిఖం స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని రహదారులను నిర్మించారు. దాదాపు రూ.8కోట్ల విలువైన రెండెకరాల భూమిని బై నెంబర్లతో రియల్టర్లు పలువురికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ భూముల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.
కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లోని సర్వే నెంబరు-71లోని మేళ్లకుంట ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతుంది. నగర విస్తరణతో కుంట చుట్టూ ఉన్న స్థలానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం గుంట ధర రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంది. 13 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటశిఖంలో గత కొన్ని నెలల నుంచి అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి.
రియల్టర్లతో స్థానిక ప్రజాప్రతినిధి కుమ్మక్కు
రూ.కోట్ల విలువైన కుంటశిఖం స్థలంపై కొందరు రియల్టర్లు కన్నేశారు. గ్రామానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధిని వాటా పేరుతో మచ్చిక చేసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కుంట శిఖం స్థలంలో దాదాపు ఇరవై అడుగుల వెడల్పుతో స్థానిక ప్రజాప్రతినిధి సాయంతో ఎల్ ఆకారంలో రహదారి నిర్మించారు. దీంతో సమీపంలోని నివాసగృహాలు, పట్టాదారులకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు సైతం ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు
కుంట శిఖం స్థలాన్ని రియల్టర్లు బై నెంబర్లతో మాయ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులతో కుమ్మక్కైన రియల్టర్లు దర్జాగా రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు. మేళ్లకుంట సర్వేనెంబరు-71 కాగా రియల్టర్లు సర్వేనెంబరు-71/1,2,3, పేరిట దాదాపు ఇరవై మందికిపైగా ఒక్కొక్కరికి రెండు గుంటలు, మూడు గుంటల చొప్పున ఎకరంన్నర స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పహణీలో సర్వేనెంబరు-71కి బై నెంబర్లు లేకపోయినప్పటికీ అధికారులకు మామూళ్లు అందుతుండటంతో కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ తతంగాన్ని ముగిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు కరువు
కుంట శిఖం స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు గృహనిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుంట స్థలానికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్లు-51,52, 66లోని భూములకు సంబంధించిన పట్టాదారులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
గ్రామ పంచాయతీ నుంచి పట్టాభూమిలో గృహనిర్మాణం కోసం అనుమతి తీసుకుని శిఖం స్థలంలో కడుతున్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఒక వ్యక్తి కుంట శిఖంలో గృహ నిర్మాణం చేపట్టాడని రెవెన్యూ అధికారులు అడ్డుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వ్యవహారం ముగియక ముందే సదరు వ్యక్తి గృహనిర్మాణం పూర్తికావడంతోపాటు మరికొందరు వ్యక్తులు ప్రహరీ, గృహ నిర్మాణం చేపట్టడం గమనార్హం.