గ్రేటర్ హైదరాబాద్‌లో జల వనరులను మింగేస్తున్న రియల్టర్ల ధనదాహం, అధికారుల అవినీతి
చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెంచర్లు, నిర్మాణాలు
సాగునీటి శాఖ నుంచి ‘ఎన్‌ఓసీ’లేకున్నా.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు
అక్రమ నిర్మాణాలకు ఠంఛనుగా ‘ఆక్యుపెన్సీ’ సర్టిఫికెట్లు
భారీ స్థాయిలో చేతులు మారుతున్న సొమ్ము
కొన్ని చెరువులైతే 90 శాతానికిపైగా మాయం
ఇప్పటికైనా మేల్కొనకుంటే హైదరాబాద్ మనుగడే ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే చిత్తడి.. రోడ్డెక్కాలంటే రోత.. కాస్త గట్టి వానొస్తే కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా నీళ్లే.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడంతో వచ్చిన దుస్థితి ఇది. రియల్టర్ల ధనదాహానికి, అధికారుల అవినీతి తోడై.. చెరువులు, కుంటలన్నీ కాలనీలుగా, భారీ భవనాలుగా మారిపోతున్నాయి. దీనిపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా)’ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)’అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని 56 ప్రధాన చెరువుల పరిస్థితిని పరిశీలించింది. 1979లో 10,416.8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జలవనరులు.. గత ఏడాది చివరి నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయని తేల్చి0ది. అంటే 61 శాతం మాయమై 39 శాతమే మిగిలినట్టు లెక్కగట్టింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది.
ధనదాహం, అవినీతి కలగలిసి..
‘గ్రేటర్’హైదరాబాద్‌తోపాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జలవనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు, బిల్డర్ల ధనదాహం, అధికారుల అవినీతి, సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది. చెరువులు, కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ అదీనంలో ఉంటాయి. కొన్నిచోట్ల చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో పట్టా భూములున్నా.. వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు సాగునీటిశాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)’తీసుకోవాలనే రూల్ ఉంది. అయితే ఈ ఎన్‌ఓసీ లేకపోయినా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచీ అక్రమంగా ఎన్‌ఓసీలు జారీ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ముందే జారీ..
ఏదైనా భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఆ నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించి, నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నివాస యోగ్యమంటూ ‘ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ (ఓసీ)’జారీ చేయాలి. కానీ గ్రేటర్ నగరంలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో వెలుస్తున్న చాలా భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ‘ఆక్యుపెన్సీ’జారీ అయిపోతోంది.
కొందరు అధికారుల కాసుల కక్కుర్తే దీనికి కారణం. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఇక చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిని రద్దు చేయాలంటూ హెచ్‌ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టనున్నారు.
జాడ కూడా లేని తుమ్మలకుంట
హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 56 జల వనరులను ‘ఎన్‌ఆర్‌ఎస్‌సీ’అధ్యయనం చేసింది. కీసర మండలం అహ్మద్‌గూడలో 101 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మలకుంట పూర్తిగా మాయమైనట్టు తేలింది. ఆ చెరువు మొత్తం ఇప్పుడు ఓ కాలనీగా మారింది. అన్నింటికంటే తక్కువగా ఆక్రమణలకు గురైనది హుస్సేన్‌సాగర్.. 1,475.2 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్‌సాగర్ 21 శాతం ఆక్రమణలకు గురై 1,163.8 ఎకరాల మేర మిగిలింది.
సాధారణ ప్రాంతాల్లో ఉన్న జల వనరుల కంటే రక్షణశాఖ పరిధిలో ఏరియాల్లో ఉన్నవి సురక్షితంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. హకీంపేటలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న 18 ఎకరాల చెరువు ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ఆయా చోట్ల నిఘా, ఆంక్షలు ఎక్కువగా ఉండమే దీనికి కారణమని అంటున్నారు.
సికింద్రాబాద్‌లోని చంద్రపురికాలనీలో ఉన్న చెన్నపురం చెరువు.. విస్తీర్ణం పెరిగినట్టు తేలడం ఆసక్తికరంగా మా రింది. 1979లో 16 ఎకరాలుగా రికార్డుల్లో ఉన్న ఈ చెరువు.. 2023లో 18.2 ఎకరాలు ఉన్నట్టు తేలింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. అదెలా జరిగిందో తేల్చాలని నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్, శివార్లలోని ప్రధాన చెరువులు 56
44 ఏళ్ల కిందట ఈ చెరువుల విస్తీర్ణం10,416.8 ఎకరాలు
ఇప్పుడు వాటి విస్తీర్ణం 3,974.1 ఎకరాలు
కబ్జా అయిన శాతం 61%
సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోనూ కబ్జా అయినది 21%
Comments
Please login to add a commentAdd a comment