న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు 2018–22 మధ్య భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. 12.2 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు సమారు) ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,800 ఎకరాల భూమిని సమీకరించినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో డెవలపర్ల నుంచి భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగినట్టు తెలిపింది.
ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో భూముల కొనుగోలు పెరిగిందని.. 6,800 ఎకరాల్లో అధిక భాగం 2021 జనవరి తర్వాత సమకీరించినదిగా పేర్కొంది. ‘‘భూముల క్రయ విక్రయాల పరంగా 2022 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలం కోసం చూస్తున్నట్టు ఇది తెలియజేస్తోంఇ’’ అని సీబీఆర్‌ఆ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.
మొత్తం కొనుగోలు చేసిన భూముల్లో నివాస, మిశ్రమ వినియోగానికి సంబంధించే 60 శాతంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే భూముల సమీకరణకు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రానున్న సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి ప్రాపర్టీల సరఫరా ఎక్కువగా ఉంటుందని సీబీఆర్‌ఈ నివేదిక అంచనా వేసింది. గ్రీన్‌ఫీల్డ్ కార్యాలయాల అభివృద్ధికి సంబంధించి భూముల కొనుగోళ్లు మొత్తం పెట్టుబడుల్లో 19 శాతంగా ఉండగా, ఇండస్ట్రియల్ రంగంలో 9 శాతం, లాజిస్టిక్స్ అవసరాల భూముల కోసం 7 శాతం పెట్టుబడులు వచ్చాయి. పార్క్‌ల అభివృద్ధికి సంబంధించి భూముల సమీకరణ 3 శాతంగా ఉంది.
ప్రాంతాల వారీ..
► 2018–22 మధ్య జరిగిన భూముల కొనుగోళ్లలో 67 లావాదేవీలు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోనే నమోదయ్యాయి. 760 ఎకరాల కొనుగోలుకు 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబలు వచ్చాయి.
► ముంబైలో 960 ఎకరాలకు సంబంధించి 3.8 బిలియన్ డాలర్ల విలువైన 73 లావాదేవీలు నమోదయ్యాయి.
► బెంగళూరులో 1.1 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 ఎకరాలకు సంబంధించి 44 లావాదేవీలు జరిగాయి.
► హైదరాబాద్ మార్కెట్లో 2018–22 మధ్య మొత్తం 24 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 970 ఎకరాల కొనుగోలుకు 0.9 బిలియన్ డాలర్లు వెచ్చించారు.
► పుణె నగరంలో 450 ఎకరాలకు సంబంధించి 27 లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వీటి విలువ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
► చెన్నై రియల్టీ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది.
► ఇక దేశంలోని మిగిలిన పట్టణాల్లో 1,300 ఎకరా లకు సంబంధించి లావాదేవీలు నమోదయ్యాయి.
విలువలు ఇలా...
2018–22 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొత్తం మీద 43.3 బిలియన్ డాలర్ల విలువ చేసే (రూ.3.55 లక్షల కోట్లు) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. నార్త్ అమెరికా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లను ఈక్విటీ రూపంలో సమకూర్చారు. ఈ కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల్లో ఇవి 58 శాతంగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా ఉంటుందని, 16–17 బిలియన్ డాలర్ల మేర రావచ్చని అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఆఫీస్ విభాగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయన్నారు.
రియల్టీలో భారీ లావాదేవీలు
Published Thu, Apr 20 2023 6:34 AM | Last Updated on Thu, Apr 20 2023 6:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment