Land investment
-
అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?
పెట్టుబడి మార్గంగా అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ కంటే భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల 10 రెట్లు ఎక్కువ రాబడిని ఇస్తుందని కొలియర్స్ (Colliers)అడ్వైజరీ సర్వీసెస్ ప్రచురించిన నివేదిక తెలిపింది. అద్దె రూపంలో రాబడి అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భూములు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అపార్ట్మెంట్ల కంటే 10 రెట్లు అధిక రాబడి పొందవచ్చని కొలియర్స్ నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్‌కు సమీపంలో ఉండటం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు, ఆర్థిక స్థోమత వంటివి దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ అప్రిషియేషన్కు కీలకమైన చోదకాలుగా ఉన్నాయని ‘టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాక్షన్ కొనసాగుతోందని, దీనికి తోడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెరిగిందని, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోని మైక్రో-మార్కెట్లు కీలక పెట్టుబడి కారిడార్లుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్లు వ్యవసాయేతర భూమి లభ్యత అత్యధికంగా ఉండటంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల రాక వంటి అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని వసాయి విరార్, భివండి, నేరల్-మాథెరన్ వంటి ప్రాంతాలు కీలకమైన హాట్స్పాట్లుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక గుర్తించింది. హైదరాబాద్‌లోనూ.. కీలకమైన పెట్టుబడి ప్రాంతాలలో ఒకటిగా పరిగణించే మహారాష్ట్రలోని నెరల్-మాథెరన్ మైక్రో-మార్కెట్లో హాలిడే హోమ్‌లకు సగటు వార్షిక అద్దె రాబడి 15 శాతం ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాలలో భూమి పెట్టుబడులపై ఐదు రెట్లు రాబడిని పొందగలదని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. గుజరాత్‌లోని పర్యాటక, పారిశ్రామిక కేంద్రం - సనంద్ నల్ సరోవర్ కారిడార్, చెన్నైలోని ECR, హైదరాబాద్‌లోని మేడ్చల్, కోల్‌కతాలోని న్యూ టౌన్, రాజర్హట్లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పింది. పుష్కలమైన భూమి లభ్యత, పర్యాటకరంగంలో పెరిగిన ట్రాక్షన్, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి కారణాలతో ఈ కారిడార్లు పెట్టుబడుల గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలలో 2.5 నుంచి 4 శాతం సగటు వార్షిక అద్దె రాబడి మధ్య, భూమిపై 6 నుంచి 8 శాతం వార్షిక ధర పెరుగుదల ఉంటుందని వివరించింది. -
రియల్టీలో భారీ లావాదేవీలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు 2018–22 మధ్య భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. 12.2 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు సమారు) ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,800 ఎకరాల భూమిని సమీకరించినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో డెవలపర్ల నుంచి భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో భూముల కొనుగోలు పెరిగిందని.. 6,800 ఎకరాల్లో అధిక భాగం 2021 జనవరి తర్వాత సమకీరించినదిగా పేర్కొంది. ‘‘భూముల క్రయ విక్రయాల పరంగా 2022 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలం కోసం చూస్తున్నట్టు ఇది తెలియజేస్తోంఇ’’ అని సీబీఆర్ఆ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మొత్తం కొనుగోలు చేసిన భూముల్లో నివాస, మిశ్రమ వినియోగానికి సంబంధించే 60 శాతంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే భూముల సమీకరణకు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రానున్న సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి ప్రాపర్టీల సరఫరా ఎక్కువగా ఉంటుందని సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. గ్రీన్‌ఫీల్డ్ కార్యాలయాల అభివృద్ధికి సంబంధించి భూముల కొనుగోళ్లు మొత్తం పెట్టుబడుల్లో 19 శాతంగా ఉండగా, ఇండస్ట్రియల్ రంగంలో 9 శాతం, లాజిస్టిక్స్ అవసరాల భూముల కోసం 7 శాతం పెట్టుబడులు వచ్చాయి. పార్క్‌ల అభివృద్ధికి సంబంధించి భూముల సమీకరణ 3 శాతంగా ఉంది. ప్రాంతాల వారీ.. ► 2018–22 మధ్య జరిగిన భూముల కొనుగోళ్లలో 67 లావాదేవీలు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే నమోదయ్యాయి. 760 ఎకరాల కొనుగోలుకు 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబలు వచ్చాయి. ► ముంబైలో 960 ఎకరాలకు సంబంధించి 3.8 బిలియన్ డాలర్ల విలువైన 73 లావాదేవీలు నమోదయ్యాయి. ► బెంగళూరులో 1.1 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 ఎకరాలకు సంబంధించి 44 లావాదేవీలు జరిగాయి. ► హైదరాబాద్ మార్కెట్లో 2018–22 మధ్య మొత్తం 24 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 970 ఎకరాల కొనుగోలుకు 0.9 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ► పుణె నగరంలో 450 ఎకరాలకు సంబంధించి 27 లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వీటి విలువ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ► చెన్నై రియల్టీ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది. ► ఇక దేశంలోని మిగిలిన పట్టణాల్లో 1,300 ఎకరా లకు సంబంధించి లావాదేవీలు నమోదయ్యాయి. విలువలు ఇలా... 2018–22 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొత్తం మీద 43.3 బిలియన్ డాలర్ల విలువ చేసే (రూ.3.55 లక్షల కోట్లు) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. నార్త్ అమెరికా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లను ఈక్విటీ రూపంలో సమకూర్చారు. ఈ కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల్లో ఇవి 58 శాతంగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా ఉంటుందని, 16–17 బిలియన్ డాలర్ల మేర రావచ్చని అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఆఫీస్ విభాగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయన్నారు. -
పెట్టుబడులకు భూములు రెడీ!
‘మేడిన్ తెలంగాణ ’ నినాదమెత్తుకున్న కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరుస్తోంది. ఏకగవాక్షం (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తరలివచ్చే ఐటీ ఆధారిత, ఫార్మా తదితర రంగాలకు భూముల కేటాయింపులను సరళతరం చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. భూ కేటాయింపుల్లో జాప్యాన్ని నివారిస్తే పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం... నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గత ప్రభుత్వాల హయాంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూమిలో అవసరాలకు సరిపోగా, మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా కేటాయించిన భూమిలో ఇప్పటికీ పరిశ్రమలు స్థాపించని వారి నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే వివిధ సంస్థలకు బదలాయించిన భూములపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. ఆయా సంస్థలకు కేటాయించిన భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. ఒకవైపు యూఎల్సీ, సీలింగ్ భూములపై సర్వే చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం... మరోవైపు ఈ ప్రక్రియను కూడా చకచకా పూర్తిచేస్తోంది. తద్వారా కొత్తగా వచ్చేవారికి భూములను వెంటవెంటనే కేటాయిస్తే పరిశ్రమల స్థాపన త్వరితగతిన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలు తరలకుండా... పన్ను మినహాయింపు, రాయితీలతో పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోయే ఆస్కారం ఉన్న తరుణంలో.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ), ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ), దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్), రాజీవ్ స్వగృహ తదితర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల వినియోగంపై క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. భూ సేకరణ చట్టం కఠినతరం చేసినందునభవిష్యత్తులో ప్రైవేటు భూముల సేకరణ కష్టతరమని భావిస్తున్న ప్రభుత్వం... గతంలో సేకరించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములపై దృష్టి సారించింది. ఐటీ కంపెనీలు, పరిశ్రమల స్థాపన, ప్రజావసరాల కోసం జిల్లాలో 39,500 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆయా సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టింది. దీంట్లో కేవలం 26,500 ఎకరాలు మాత్రమే వినియోగంలోకి వచ్చింది. మిగతా దాంట్లో 9,824 ఎకరాలను సదరు సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం... దీన్ని స్వాధీనం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యాకలాపాలను స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువుగా ఉన్నందున, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు న్యాయపరమైన చిక్కులు ఉన్న భూములను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు జిల్లాలో వస్తున్నందున పలు సాఫ్ట్వేర్ ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అదే విధంగా ఫార్మారంగంలోనూ పెట్టుబడులు పెట్టడానికి ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ, స్పేస్ సిటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణను మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం... దీనికి జిల్లాను కేంద్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కొన్ని ప్రధాన సంస్థలకు కేటాయించిన భూమి (ఎకరాల్లో) ఏపీఐఐసీ 8,450 హెచ్ఎండీఏ 4,738 దిల్ 4,435 ప్రభుత్వ సంస్థలు 12,031 ప్రైవేటు 2,273 ఆయా సంస్థల ఆధీనంలో ఉన్న భూమి హెచ్ఎండీఏ 2900 దిల్ 3449 ఏపీఐఐసీ 2863 రాజీవ్‌స్వగృహ 612