పెట్టుబడులకు భూములు రెడీ!
‘మేడిన్ తెలంగాణ ’ నినాదమెత్తుకున్న కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరుస్తోంది. ఏకగవాక్షం (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తరలివచ్చే ఐటీ ఆధారిత, ఫార్మా తదితర రంగాలకు భూముల కేటాయింపులను సరళతరం చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. భూ కేటాయింపుల్లో జాప్యాన్ని నివారిస్తే పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం... నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గత ప్రభుత్వాల హయాంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూమిలో అవసరాలకు సరిపోగా, మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా కేటాయించిన భూమిలో ఇప్పటికీ పరిశ్రమలు స్థాపించని వారి నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే వివిధ సంస్థలకు బదలాయించిన భూములపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది.
ఆయా సంస్థలకు కేటాయించిన భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. ఒకవైపు యూఎల్‌సీ, సీలింగ్ భూములపై సర్వే చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం... మరోవైపు ఈ ప్రక్రియను కూడా చకచకా పూర్తిచేస్తోంది. తద్వారా కొత్తగా వచ్చేవారికి భూములను వెంటవెంటనే కేటాయిస్తే పరిశ్రమల స్థాపన త్వరితగతిన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పరిశ్రమలు తరలకుండా...
పన్ను మినహాయింపు, రాయితీలతో పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోయే ఆస్కారం ఉన్న తరుణంలో.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ), ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ), దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్), రాజీవ్ స్వగృహ తదితర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల వినియోగంపై క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు.
భూ సేకరణ చట్టం కఠినతరం చేసినందునభవిష్యత్తులో ప్రైవేటు భూముల సేకరణ కష్టతరమని భావిస్తున్న ప్రభుత్వం... గతంలో సేకరించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములపై దృష్టి సారించింది. ఐటీ కంపెనీలు, పరిశ్రమల స్థాపన, ప్రజావసరాల కోసం జిల్లాలో 39,500 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆయా సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టింది. దీంట్లో కేవలం 26,500 ఎకరాలు మాత్రమే వినియోగంలోకి వచ్చింది. మిగతా దాంట్లో 9,824 ఎకరాలను సదరు సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం... దీన్ని స్వాధీనం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది.
బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ కార్యాకలాపాలను స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువుగా ఉన్నందున, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు న్యాయపరమైన చిక్కులు ఉన్న భూములను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది.
ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు జిల్లాలో వస్తున్నందున పలు సాఫ్ట్‌వేర్ ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అదే విధంగా ఫార్మారంగంలోనూ పెట్టుబడులు పెట్టడానికి ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ, స్పేస్ సిటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణను మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం... దీనికి జిల్లాను కేంద్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.
జిల్లాలో కొన్ని ప్రధాన సంస్థలకు
కేటాయించిన భూమి (ఎకరాల్లో)
ఏపీఐఐసీ 8,450
హెచ్‌ఎండీఏ 4,738
దిల్ 4,435
ప్రభుత్వ సంస్థలు 12,031
ప్రైవేటు 2,273
ఆయా సంస్థల ఆధీనంలో ఉన్న భూమి
హెచ్‌ఎండీఏ 2900
దిల్ 3449
ఏపీఐఐసీ 2863
రాజీవ్‌స్వగృహ 612