కొత్తగా 4 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించండి
పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎం
అమరావతి/మడకశిర: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ అనువైన వాతావరణం కల్పించేలా ఐదు నూతన పారిశ్రామిక విధానాలను 100 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంతో పాటు ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తేవాలని సూచించారు. సచివాలయంలో బుధవారం పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా చేయాలన్న లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని సూచించారు.
కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త పారిశ్రామిక క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ పనితీరుతో పాటు నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, రూ.60 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం సమీక్షించారు.
ప్రోత్సాహకాల అంశాన్ని పరిశీలిస్తాం..
2014–19 హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో తిరిగి సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తానే వారితో మాట్లాడతానని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా ఏడాదిలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
నేడు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు
సీఎం చంద్రబాబు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం కె.గుండుమలలో మ«ధ్యాహ్నం 2.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గ్రామ ప్రజలు, పట్టు రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. మల్బరీ షెడ్, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలిస్తారు.
కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో బుధవారం కలిశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అదే విధంగా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment