కనిగిరి: ఇప్పటిదాకా నిస్తేజంగా.. నిస్సారంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. దళారుల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది. ఇప్పుడు వారంతా కనిగిరి వీధుల్లో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే నల్లగొండ జిల్లా నకరికల్ నుంచి చిత్తూరు జిల్లా ఏర్పేడు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి.. కనిగిరి నియోజకవర్గం నుంచి కూడా వెళ్లనుంది. జిల్లా పరిధిలో నిర్మించనున్న డబుల్ లేన్ రోడ్డు కోసం రూ. 253 కోట్లకు గాను టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ హైవే కనిగిరిని ఆనుకొని కొత్తూరు మీదుగా వెళ్లనుండటంతో స్థానిక భూ వ్యాపారుల్లో కదలిక వచ్చింది. రెండు రోజుల నుంచి అధికారులు మార్కింగ్ వేసేపనిలో నిమగ్నమయ్యారు.
కనిగిరిలో రోడ్డు స్వరూపం ఇలా..
కనిగిరి డివిజన్‌లో(డీకేడీ రోడ్డు) 67.4 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు పడనుంది. ఇది కనిగిరి పట్టణానికి సమీపంలో స్థానిక పొదిలి రోడ్డులోని ముస్లిం బరియల గ్రౌండ్ ఎత్తు రోడ్డు నుంచి చెరువు అలుగు ఆనుకుంటూ కంభం రోడ్డు మీదుగా గంగనగర్ వెంచర్ మధ్యలో నుంచి సుదర్శన్ థియేటర్ వెనుక పొలాల మీదుగా.. కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద తారు రోడ్డును ఎక్కే విధంగా మార్కింగ్ చేశారు. చెరువు అలుగు, సాధనడాబా వెనుక, గంగానగర్ వెంచర్ మధ్యలో బౌండరీ మార్కింగ్ వేశారు. అక్కడ నుంచి పామూరు మండలంలోని వగ్గంపల్లితో హైవే వెళ్లే జిల్లా సరిహద్దు పూర్తవుతుంది.
ప్లాట్లు కొన్నవాళ్ల టెన్షన్...
ఒకప్పుడు రియల్ బూమ్ ఆకాశానికి ఎగబాకడంతో కనిగిరిలో బోలెడు వెంచర్లు వెలిశాయి. ఎంతోమంది ప్లాట్లు సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా రోడ్డు నిర్మాణం ప్రతిపాదనతో ఆయా ప్రదేశాల్లో స్థలాలు కొన్నవారిలో ఆందోళన మొదలైంది. అంకణానికి (6 గదులు) రూ. 60వేల నుంచి లక్ష వరకు చెల్లించిన వెంచర్ల మధ్య రోడ్డు మార్కింగ్ పడటంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.
అయితే భూమి రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు చెల్లించి భూములు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులంటున్నారు. రెండు లేన్ల రోడ్డు కోసం 7 నుంచి 10 మీటర్ల భూమి అవసరమైతే.. పాతూరు వెనుక వైపు, కొత్తూరు వాగు వెనుకగల కొన్ని వెంచర్లు పూర్తిగా కనుమరుగు అవ్వాల్సిందే. అలాగే ఆయా ప్రదేశాల్లో జొన్ని, వరి, కంది పండించే పొలాలు కూడా రోడ్డు పరిధిలోకి వెళ్లిపోతాయి.
కనిగిరిలో రియల్ ఎస్టేట్ సందడి
Published Thu, Sep 11 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement