సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : రియల్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న ప్రజలకు ఎరవేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నిర్మించి ప్లాట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి డబ్బులతోనే వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చినవారికి ప్లాట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఇగో.. అగో అని తప్పించుకుంటున్నారు. బలవంతులైన మోసగాళ్లను ఏమీ చేయలేని మధ్యతరగతి ప్రజలు.. తమ అదృష్టాన్ని నిందించుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు.
తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు గడించవచ్చు అని భావిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగిడుతున్నారు. రాత్రికి రాత్రే బోర్డు పెట్టుకుని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఉండి నగరంలో స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయాలనుకునేవారి వివరాలు సేకరిస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకొని వల వేస్తున్నారు. తక్కువ ధరలకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. డబ్బులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని చెప్పి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తర్వాత ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో పలు జరిగాయి.
మోసం చేస్తున్నారిలా..
నగరంలో ఓ వర్గానికి చెందిన కొందరు వివిధ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలుండడంతో వీరు నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు తన ఆస్తిని వీరికి రూ. 65 లక్షలకు విక్రయించాడు. ఆస్తిని కొనుగోలు చేసిన సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు చెల్లించలేదు. డబ్బులు తర్వాత ఇస్తామని, తాము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే లాభాన్ని నెలనెలా చెల్లిస్తామని నమ్మించారు.
నెలలు గడుస్తున్నా సదరు నాయకుడికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తాను మోసపోయానని సదరు నాయకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాను మోసపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలిసింది. తన డబ్బులు రాబట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మందినే మోసం చేసినట్లు తెలుస్తోంది.
సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నామని చెప్పి పలువురి వద్దనుంచి డబ్బులు తీసుకున్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి పురోగతిలేదు. దీంతో డబ్బులిచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యాపారులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో డబ్బులకోసం నిలదీయలేకపోతున్నారని సమాచారం. అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
‘రియల్’ దందా
Published Wed, May 14 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement