నిబంధనలకు పంచర్ | The terms of the puncture | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పంచర్

Published Sun, Mar 2 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

The terms of the puncture

  ఇల్లందలో అక్రమ వెంచర్
     పట్టించుకోని అధికారులు


 సాక్షి, హన్మకొండ : అధికార పార్టీ నాయకులు లాభాపేక్షే లక్ష్యంగా రియల్ దందా సాగిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికార యం త్రాంగం.. వారికే అండగా నిలవడంతో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారిపోతున్నాయి. వర్ధన్నపేట మండలంలో వందల ఎకరాల సాగు భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. తాజాగా ఇల్లంద సమీపంలో అక్రమంగా మరో వెంచర్ వెలిసింది. వర్ధన్నపేట మండలం.. వరంగల్ నగరానికి అతి సమీపంగా ఉండడంతో పాటు వరంగల్-ఖమ్మం హైవే ఈ మండలం మధ్యగుండా పోతున్నది.

దీంతో ఇక్కడి వ్యవసాయ భూములకు రియల్ కళ వచ్చేసింది. ముఖ్యంగా వర్దన్నపేట మండల కేంద్రం డీసీతండా, ఇల్లంద, కట్య్రాల, పంథిని గ్రామాలపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఇక్కడి రైతుల నుంచి ఎకరా భూమిని రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
 
ఇల్లందలో మరోసారి..
 
తాజాగా ఇల్లంద గ్రామ సమీపంలో వెలసిన వెంచర్ ఇక్కడి రియల్‌దందా తీరుకు అద్దం పడుతోంది. హైవే పక్కన ఎస్సీ హాస్టల్ వెనక భాగంలో ఐదెకరాల స్థలాన్ని  గ్రామంచాయతీ, రెవెన్యూశాఖల అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు వెంచర్ చేశారు. అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తోంది. నిబంధనలను బేఖాతర్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకోకుండా, భూబదాలయింపు జరగకుండానే ఐదెకరాల్లో మొత్తం 100 ప్లాట్లతో ఈ వెంచర్ ప్రారంభించారు. ఇందులో గజం స్థలానికి  రూ. 3వేల నుంచి రూ.8వేలు ధర నిర్ణయించినట్లు సమాచారం.
 
పంచాయతీ ఆదాయానికి గండి
 
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో ప్లాట్లు చేస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేయాలంటే తొలుత పంచాయతీ అనుమతి తీసుకోవాలి. ఎన్ని అడుగుల స్థలాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నారు.. పబ్లిక్ ట్యాప్‌లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు సమాచారంతో ప్లాన్ రూపొందిం చి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి. అంతే కాకుండా భవిష్యత్తు సామాజిక అవసరాల దృష్ట్యా వెంచర్‌లో పది శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.
 
ఆందోళన చేసినా ఆగలేదు
 
ఇల్లంద ఎస్సీ కాలనీ నుంచి ప్రవహించే వరద నీటి కాల్వకు అడ్డుగా ఈ రియల్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడంతో దళితులు మూడు నెలల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి వెంచర్ ఏర్పాటును అడ్డుకున్నారు. ఈ వెంచర్‌లో ఇళ్లు వెలిస్తే తమ ఇళ్లు మురికికూపాలుగా మారిపోతాయని ఇక్కడి దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతపరిచారు.

అధికారులు జోక్యం చేసుకుని వరద కాల్వ నిర్మించిన తర్వాత వెంచర్ చేసుకోవాలని చెప్పారు. కానీ, అనుమతి లేకుండానే భూమిని చదును చేసి, రాళ్లు పాతి ప్లాట్లుగా మార్చినా అధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాల్సి న పంచాయతీ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి.

గతంలో రెవెన్యూ సిబ్బంది వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో రెండేళ్ల క్రింతం ఇల్లంద, పంథిని గ్రామాల్లో సర్వే చేసి అనుమతి లేని వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై రెవెన్యూ అధికారులు నిఘా పెట్టడం లేదు. సరై న అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు పంచాయతీ అనుమతుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement