
రాబడికి కేటాయింపే కీలకం..
పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు చాలా సందర్భాల్లో మార్కెట్ ట్రెండ్స్‌నే నమ్ముకుంటూ ఉంటారు.
పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు చాలా సందర్భాల్లో మార్కెట్ ట్రెండ్స్‌నే నమ్ముకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా కొన్ని సాధనాల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, ఇది అంత సరైన వ్యూహం కాదు. ఎందుకంటే.. ఏ సాధనంలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం షేర్లు, ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు ఎఫ్‌డీలు, బంగారం..వెండి వంటి కమోడిటీలు మొదలైన అనేక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ ఆల్‌టైం గరిష్ట స్థాయుల్లో తిరుగాడుతుంటే.. 10 ఏళ్ల బాండ్లపై రాబడులు మాత్రం 15 నెలల కనిష్ట స్థాయుల్లో కదలాడుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలా లేక బాండ్లవైపు మొగ్గు చూపాలా అన్న మీమాంస తలెత్తుతుంది.
సాధారణంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఇది అన్ని వేళలా సరికాదు. ఉదాహరణకు 2007లో మార్కెట్లు గరిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు.. ఇన్వెస్టర్లు భారీ ఎత్తున స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. కానీ 2008 నాటి ఆర్థిక సంక్షోభ కాలంలో అందులో చాలా మటుకు పోగొట్టుకున్నారు. 2013లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాయి.
దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతుండటమే ఇందుకు కారణం. రాజకీయపరమైనవి కావొచ్చు..ప్రకృతి వైపరీత్యాలు కావొచ్చు ఏదైనా సరే ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారినా.. వివిధ సాధనాల పనితీరుపై ప్రభావం పడుతుంటుంది. మార్పు నిర్మాణాత్మకమైనదైతే.. సదరు సాధనం విలువ పెరుగుతుంది. అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం తగ్గిపోతుంది. ఇందువల్లే షేర్లు, బంగారం, డెట్ సాధనాలు ఒక్కో సమయంలో మాత్రమే పెరుగుతుంటాయి. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే.. గతకాలపు పనితీరును చూసి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేకానేక సాధనాల్లో దేనికెంత కేటాయించవచ్చన్నది.. రిస్కు సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాలు, జీవితంలో వివిధ దశల్లో నిర్దేశించుకునే లక్ష్యాలు మొదలైన వాటిని బట్టి ఉంటుంది. ఒకే దాంట్లో కాకుండా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కును కొంత తగ్గించుకునే వీలవుతుంది. ఒక్కసారి సాధనాలను, కేటాయింపులను నిర్ణయించుకున్న తర్వాత పదే పదే మార్పులు, చేర్పులు చేయడం కాకుండా.. పెట్టుబడి పెడుతూ ముందుకు సాగడం మంచిది.
లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్‌ను బట్టి కాకుండా సరైన కేటాయింపు వ్యూహాలను క్రమం తప్పకుండా అనుసరించినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలను సునాయాసంగా సాధించగలమని ఇన్వెస్టర్లు గుర్తించాలి. మార్కెట్లో స్వల్పకాలికంగా చోటు చేసుకునే మార్పులను బట్టి .. పోర్ట్‌ఫోలియోనూ మార్చేస్తూ పోతే ప్రయోజనం ఉండదు. ఇలా ఇన్వెస్టర్లు అనుసరించతగిన వ్యూహాల్లో కొన్ని ఇవి..
దీర్ఘకాలిక ప్రణాళిక..
దీర్ఘకాలిక దృష్టికోణంతోనే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. రిస్కు సామర్ధ్యాలను బట్టి సరైన సాధనంలో ..సరైన స్థాయిలో కేటాయింపుల ప్రణాళికకు కట్టుబడి ముందుకు సాగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ తరహా దీర్ఘకాలిక ప్రణాళికలు 5-20 సంవత్సరాల దాకా లక్ష్యాలకు సంబంధించినవై ఉంటాయి. ఇలాంటి వాటివల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది.
సెంటిమెంటు పెట్టుకోవద్దు ..
ఏ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాన్నైనా ఎంచుకున్నప్పడు దానిపై భవిష్యత్‌లో ఎంత మేర రాబడులు రాగలవన్నది నిష్పాక్షికంగా, సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. అంతే తప్ప భావావేశాలకు ఇక్కడ తావుండకూడదు. సదరు సాధనం గతంలో భారీ రాబడులు ఇచ్చింది కదా అని.. భవిష్యత్‌లోనూ అలాగే ఉంటుందని అనుకోవద్దు.
అధ్యయనం చేయండి..
వివిధ కారణాల వల్ల ఒక్కో సాధనం ఒక్కోసారి పెరుగుతుంది..ఒక్కోసారి తగ్గుతుంటుంది. కనుక.. వ్యక్తిగత స్థాయిలో మార్కెట్ స్థితిగతులను ఇన్వెస్టరు అంచనా వేయడం కష్టం. కనుక ఇందుకోసం మీ వంతుగా పరిశోధన చేయండి. మార్కెట్ ధోరణిని బట్టి నిర్ణయాలు తీసేసుకోకుండా.. కొనుగోలు చేసేటప్పుడు ఓపికగా వేచి చూడండి. మార్కెట్లు పెరిగినా, తగ్గినా.. స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా సరైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది.
పోర్ట్‌ఫోలియో మదింపు..
మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలంటే.. మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు, ఎంతకాలంలోగా సాధించాలనుకుంటున్నదీ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వాటి ఆధారంగానే ఆర్థిక విజయాలు సాధ్యమవుతాయని గుర్తెరగాలి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలు, వాటి సాధనకు పట్టే సమయం, మీరు తీసుకోగలిగే రిస్కు అంశాల ఆధారంగా ఏ సాధనానికి ఎంత మేర కేటాయించవచ్చన్నది ఒక అంచనాకు రండి. మీ లక్ష్యాలు, రిస్కు సామర్ధ్యాలు మారుతున్న కొద్దీ తదనుగుణంగా మధ్యమధ్యలో కేటాయింపులను సవరించుకుంటూ ముందుకు సాగాలి. కనీసం 12 నెలలకోసారైనా .. పోర్ట్‌ఫోలియోను మదింపు చేసుకోవాలి.
చివరగా చెప్పేదేమిటంటే.. మంచి రాబడులను సాధించాలంటే పోర్ట్‌ఫోలియోలో కేటాయింపులే చాలా ముఖ్యం. మీ రిస్కు సామర్ధ్యాన్ని బట్టి సరైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. దాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను పెద్దగా రిస్కు లేకుండా సాధించవచ్చు.
పాటించాల్సిన సూత్రాలు..
* మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నంత కాలం వ్యూహాలను క్రమం తప్పకుండా అమలు చేయండి.
* పోర్ట్‌ఫోలియో నుంచి ఒక మోస్తరు స్థాయిలో రాబడులను ఆశించండి. దీనివల్ల మెరుగైన ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుంది.
* పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆయా సాధనాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి
* పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మదింపు చేసు కుంటూ.. తగిన మార్పులు, చేర్పులూ చేస్తుండండి.