17 నుంచి పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం : గోకుల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మ న్ బిక్కిన సత్యనారాయణ, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 17న సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ట కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 18న పుణ్యాహవచనం, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం, సాయంత్రం 8 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 19 న నిత్యహోమంతో పాటు నీరాజనం, తీర్థ ప్రసాదగోష్టి జరుగుతాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు హనుమదుత్సవం చేపడుతున్నట్టు తెలిపారు. 20న శనివారం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం కోలాటం, భజన, విచిత్ర వేషధారణలతో గరుడ వాహన సేవ (గ్రామోత్సవం) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 22 సోమవారం వసంతోత్సవం, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రికి గజవాహన సేవ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు రుత్విక్కుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 23 మంగళవారం ఉదయం ధృవమూర్తికి పంచామృతాభిషేకం, నవకలశ స్నపనము, రాత్రి ద్వాదశారాధ న, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా 17న ఉదయం 11 గంటలకు 108 మంది దంపతులతో సామూహిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయన, గుళ్లపూడి శ్రీదేవి, యిళ్ల రామ్మోహనరావు, మారిశెట్టి బాలకృష్ణ, తోట రామకృష్ణ, బోడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.