
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై మండలిలో టీడీపీ సభ్యులు నోటీసు ఇవ్వడం తగదని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు స్పష్టంచేశారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన చర్య తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు కేఈ ప్రభాకర్, జి.దీపక్‌రెడ్డి, పి.అశోక్‌బాబు తదితరులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును తిరస్కరిస్తున్నట్టు గురువారం సభలో ప్రకటించారు. ‘జంగారెడ్డిగూడెంలో సంభవించిన 26 మరణాలు సహజమైనవని, 2011 జనాభా లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994 అని, ఈ దశాబ్ద కాలంలో 12% పెరిగితే ప్రస్తుత జనాభా 54,880 మంది ఉంటారని, వారిలో 26 మంది మరణాలు ఒకే సమయంలో సంభవించలేదని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పారు.
టీడీపీ వాస్తవాలను వక్రీకరించి సహజ మరణాలపై రాజకీయం చేస్తోందని సీఎం ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆ మరణాలు సహజమే తప్ప కల్తీ మద్యం వల్ల కాదని సీఎం అసెంబ్లీలో వివరించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (శాసన మండలి) విధివిధానాలు, బిజినెస్ ప్రవర్తన నియమాలు 173 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. వాస్తవానికి ఈ అంశాన్ని ఏ రోజున లేవనెత్తాలని అనుకుంటారో అదే రోజు సభ ప్రారంభానికి ముందు తగిన ఫార్మాట్‌లో ఆధారాలతో సహా చైర్మన్‌కు అందించాలి. సభ సమావేశ సమయంలో నోటీసు తగిన ఫార్మాట్‌లో లేకుంటే చైర్మన్‌కు ఉన్న ప్రత్యేకాధికారంతో తిరస్కరించవచ్చు.
టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసు ఆధారంగా నేను శాసన మండలి నియమాలు, పార్లమెంట్, ఇతర రాష్ట్ర శాసన సభల్లోని ఆచరణ, విధానానికి సంబంధించిన అంశాలు పరిశీలించాను. భారతదేశంలో పార్లమెంట్, ఇతర సభల్లో, మరేదైనా రాష్ట్ర శాసన సభలో ఒక సభ్యుడు చేసిన ప్రసంగంపై మరో సభలో అధికార ఉల్లంఘన, సభ ధిక్కార కేసు వర్తించదు. ఎందుకంటే ప్రతి సభ దానికదే సొంత అధికారాల మేరకు అత్యున్నతమైనది. ఈ కారణంతోనే టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నాను. ఏ సభ కూడా ఎటువంటి ఆక్షేపణను ప్రదర్శించదు. ఈ విధంగా ఏ సభ్యునిపైన, మరే ఇతర సభపైన ఏ సభ్యుడూ ఎలాంటి అపోహను ప్రదర్శించరు. ఈ సంపూర్ణమైన సూత్రాన్ని ప్రతిచోటా పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని చైర్మన్ మోషేన్‌రాజు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment