Legislative Council Chairman
-
అనర్హత విచారణ.. ఎమ్మెల్సీ రఘురాజు గైర్హాజరు
గుంటూరు, సాక్షి: అనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.ఈ ఫిరాయింపుపై వైఎస్సార్సీపీ, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే రఘురాజు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఉపేక్షించేది లేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది. -
అసెంబ్లీలో సీఎం ప్రసంగంపై మండలిలో నోటీసు చెల్లదు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై మండలిలో టీడీపీ సభ్యులు నోటీసు ఇవ్వడం తగదని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు స్పష్టంచేశారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన చర్య తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు కేఈ ప్రభాకర్, జి.దీపక్‌రెడ్డి, పి.అశోక్‌బాబు తదితరులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును తిరస్కరిస్తున్నట్టు గురువారం సభలో ప్రకటించారు. ‘జంగారెడ్డిగూడెంలో సంభవించిన 26 మరణాలు సహజమైనవని, 2011 జనాభా లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994 అని, ఈ దశాబ్ద కాలంలో 12% పెరిగితే ప్రస్తుత జనాభా 54,880 మంది ఉంటారని, వారిలో 26 మంది మరణాలు ఒకే సమయంలో సంభవించలేదని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పారు. టీడీపీ వాస్తవాలను వక్రీకరించి సహజ మరణాలపై రాజకీయం చేస్తోందని సీఎం ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆ మరణాలు సహజమే తప్ప కల్తీ మద్యం వల్ల కాదని సీఎం అసెంబ్లీలో వివరించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (శాసన మండలి) విధివిధానాలు, బిజినెస్ ప్రవర్తన నియమాలు 173 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. వాస్తవానికి ఈ అంశాన్ని ఏ రోజున లేవనెత్తాలని అనుకుంటారో అదే రోజు సభ ప్రారంభానికి ముందు తగిన ఫార్మాట్లో ఆధారాలతో సహా చైర్మన్‌కు అందించాలి. సభ సమావేశ సమయంలో నోటీసు తగిన ఫార్మాట్లో లేకుంటే చైర్మన్‌కు ఉన్న ప్రత్యేకాధికారంతో తిరస్కరించవచ్చు. టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసు ఆధారంగా నేను శాసన మండలి నియమాలు, పార్లమెంట్, ఇతర రాష్ట్ర శాసన సభల్లోని ఆచరణ, విధానానికి సంబంధించిన అంశాలు పరిశీలించాను. భారతదేశంలో పార్లమెంట్, ఇతర సభల్లో, మరేదైనా రాష్ట్ర శాసన సభలో ఒక సభ్యుడు చేసిన ప్రసంగంపై మరో సభలో అధికార ఉల్లంఘన, సభ ధిక్కార కేసు వర్తించదు. ఎందుకంటే ప్రతి సభ దానికదే సొంత అధికారాల మేరకు అత్యున్నతమైనది. ఈ కారణంతోనే టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నాను. ఏ సభ కూడా ఎటువంటి ఆక్షేపణను ప్రదర్శించదు. ఈ విధంగా ఏ సభ్యునిపైన, మరే ఇతర సభపైన ఏ సభ్యుడూ ఎలాంటి అపోహను ప్రదర్శించరు. ఈ సంపూర్ణమైన సూత్రాన్ని ప్రతిచోటా పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని చైర్మన్ మోషేన్‌రాజు స్పష్టం చేశారు. -
శాసన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్
-
మండలి పీఠంపై దళిత బిడ్డ
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల చట్ట సభల్లో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర శాసన మండలి తెరతీసింది. పెద్దల సభగా పిలుచుకునే మండలి చైర్మన్ పీఠంపై తొలిసారిగా దళిత వ్యక్తి ఆసీనులయ్యారు. శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు తోడ్కొనివచ్చి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఒక సామాన్య దళిత రైతు కుటుంబం నుంచి మోషేన్ అన్న వచ్చారు. అతి చిన్న వయసులోనే భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ శాసన మండలి చైర్మన్ స్థాయికి ఎదిగారు. మోషేన్ రాజుకు హృదయపూర్వక అభినందనలు. మోషేన్ రాజు నాన్నగారి సమయం నుంచి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా క్రియాశీలకంగా పనిచేశారు. పదేళ్లుగా నాతోనే ఉన్నారు. ఇవాళ మండలి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషం కలిగిస్తోంది’’ అని చెప్పారు. కార్యక్రమానికి దూరంగా టీడీపీ! తొలిసారిగా పెద్దల సభ చైర్మన్‌గా దళిత వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ప్రధాన ప్రతి పక్ష పార్టీ బహిష్కరించింది. టీడీపీ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దళిత వ్యక్తి మండలి చైర్మన్ అవుతున్న కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రతిపక్ష టీడీపీ ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీసిందని మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. దేశంలోని దళితులంతా రాష్ట్రం వైపు చూస్తున్న ఇటువంటి కార్యక్రమంలో టీడీపీ పాల్గొనకపోవడం దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సాహసోపేత నిర్ణయం : మోషేన్ రాజు మోషేన్ రాజు మాట్లాడుతూ... పేద, వ్యవసాయ, దళిత కుటుంబానికి చెందిన తనను మండలి చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో పైకి రావాలంటే డబ్బు, కులం, రాజకీయ నేపథ్యం అవసరమని అందరిలానే తానూ భావించే వాడినని చెప్పారు. ఈ పదవి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదని.. విశ్వాసం, నమ్మకం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలని అర్థమైందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని.. దాని అర్థం ఇప్పుడు అర్థమయ్యిందని అన్నారు. తనను మండలి సభ్యుడిని చేయడంతో పాటు చైర్మన్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. జగన్ తప్ప మరెవరూ ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో ప్రతిపక్షాలకు ఒక వంతు ఎక్కువే అవకాశం ఇస్తానని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి మాట్లాడాలని ఆయన సూచించారు. -
‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’
సాక్షి, విజయవాడ : చట్టానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబు కనుసన్నల్లో శాసన మండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు గతంలో కోడెలను శాసనసభకు, మండలి చైర్మన్‌కు షరీఫ్‌ను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మంట కలిపారని మండిపడ్డారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తమను మట్లాడకుండా గొంత నొక్కారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్ విచక్షణ అధికారం అని ప్రజాస్వామ్యాన్ని అపహప్యం చేశారని వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది. చంద్రబాబు చెప్పారు.. చెస్తున్నా.. అన్నట్లు మాట్లాడిన చైర్మన్ మాటలను తప్పు పట్టారు. ఏపీ ప్రజలు ఆకాంక్షించే బిల్లులను వ్యతిరేకిస్తున్నారని,చట్టసభలను జిగుచ్చాకరంగా మార్చారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. లోకేష్‌పై మంత్రులు దాడి చేశారనడం అసత్యమని, చైర్మన్‌ను దూషించడం.అబద్దామని పేర్కొన్నారు. మండలి చైర్మన్ న్యాయ పక్షాన కాకుండా అన్యాయ పక్షాన నిలిచారని ఆరోపించారు. ప్రజలు చివరి అస్త్రంగానే ఓట్లు వేసి బాబును ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం వారు ఏ రోజైనా ప్రజలకు కావాల్సింది కాకుండా చంద్రబాబుకు కావాల్సిందే అడిగుతున్నారని విమర్శించారు. టీడీపీకి రాబోయే కాలంలోనూ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అన్ని ప్రాంతాల అభిృద్ధి కావాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేత భూపతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నేను ఏ పార్టీ గుర్తు మీద గెలువలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేశారు? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశాం. కానీ, దానిపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది. ఈ అంశంపై కోర్టుకు వెళతా.. న్యాయపోరాటం చేస్తా’ అని అన్నారు. -
శాసన మండలి చైర్మన్ ఫరూక్ రాజీనామా
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు మైనారిటీలపై ప్రేమ పుట్టుకొస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు మైనారీటీల తరఫున మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. దీంతో ఆయన శాసన మండలి చైర్మన్ పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆదివారం ఉయదం ఫరూక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ షరీఫ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మైనారిటీ, ఎస్టీలను ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు దగ్గరపడిన సమయంలో వారిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోనుండటం గమనార్హం. ఎన్నికలకు ముందు ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు ఈమేరకు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కొడుకుని హత్య చేసిన మండలి ఛైర్మన్ భార్య
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన ఆ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ రమేష్ యాదవ్ కుమారుడి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. రమేష్ కుమారుడు అభిజిత్ యాదవ్ (23) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మృతిపై పోలీసులకు అనుమానం రావడంతో అతని స్నేహితుల ఫిర్యాదు మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. రిపోర్టులో ఊహించని నిజాలు వెలుగుచూశాయి. అభిజిత్‌ను అతని తల్లి మీరా యాదవ్‌యే గొంతు నులుమి హత్య చేసిందని పోలీసుల విచారణలో తెలింది. దీంతో పోలీసులతో సహా కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. అసలు విషయం బయట పడడంతో.. మీరా కూడా నిజం ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి అభిజిత్ బాగా మధ్యం సేవించి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య స్పల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మీరా అతనిని గొంతు నులుమి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్ శాసన మండలి ప్రస్తుత ఛైర్మన్ రమేష్‌కు మీరా రెండో భార్య కావడం గమనార్హం. -
కొడుకు హత్య; ఎమ్మెల్సీ భార్య అరెస్ట్
లక్నో : కుమారుడిని హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రమేశ్ యాదవ్ భార్య మీరా యాదవ్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... రమేశ్ యాదవ్ రెండో భార్య మీరా యాదవ్ గతంలో రాష్ట్ర పర్యాటక శాఖలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం తన ఇద్దరు కుమారులు అభిషేక్, అభిజీత్‌లతో దారుల్‌షఫా ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అభిజీత్(23) శనివారం గుండెపోటుతో మరణించాడంటూ మీరా బంధువులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ప్రవర్తనతో అనుమానం కలిగిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. వాడు ఇక ఎప్పుడూ నిద్రలేవడు! ‘అభిజీత్ రాత్రి బాగా తాగి ఇంటికొచ్చాడు. అసలు వాడికి నిద్ర పట్టనే లేదు. అందుకే వాడి ఛాతీపై బామ్‌తో మర్ధనా చేశాను. నాకు తెలిసి వాడు ఇక ఎప్పుడూ నిద్ర లేవడు’ అంటూ మీరా యాదవ్ తమతో అన్నారని పొరుగింటి వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కొడుకును తానే గొంతు నులిమి హత్య చేశానని మీరా యాదవ్ అంగీకరించారు. తాగిన మైకంలో కన్న కొడుకే తనతో అసభ్యంగా ప్రవర్తించినందు వల్లే ఈ దారుణానికి ఒడిగట్టానని ఆమె చెప్పారని ఎస్పీ సర్వేశ్ మిశ్రా పేర్కొన్నారు. -
శాసనమండలి చైర్మన్‌గా ఫరూక్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్‌గా ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఫరూక్‌కు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఫరూక్‌ను శాసనమండలి నేత యనమల రామకృష్ణ, బీజేపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చైర్మన్ పీఠం వద్దకు తీసుకెళ్లగా ఆయన భాద్యతలు చేపట్టారు. కాగా మండలి చైర్మన్‌గా ఫరూఖ్‌కు అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఆయనకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హమీ మేరకు ఫరూఖ్‌ను మండలి చైర్మన్‌గా నియమించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూఖ్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. శాసనసభలో చీఫ్ విప్‌గా పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌లను నియమించారు. అలాగే శాసనసభలో విప్‌లుగా ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను, శాసనమండలి విప్‌లుగా బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌లను నియమించారు. -
క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్
- రోడ్డుపై పడిపోయిన బాధితుడు - ఆస్పత్రికి తరలించిన స్వామిగౌడ్ రాజేంద్రనగర్: రోడ్డు దాటుతున్న ఓ దినసరి కూలీని వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టి ముందుకు వెళ్లింది. అదే దారిలో వెళ్తున్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెంటనే స్పందించి తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహదేవ్ (55) బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వలస వచ్చాడు. దినసరి కూలీ గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో హైదర్షాకోట్ బృందావన్ బార్ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానికంగా వాహనదారులు అటూ ఇటూ వెళ్తున్నారు తప్ప గాయపడ్డ మహదేవ్‌ను ఆస్పత్రికి తరలించలేదు. అదే సమయంలో ఈ రోడ్డులో వెళ్తు న్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఘట న చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. ఢీకొట్టి వెళ్తున్న వాహనాన్ని ఆపాలంటూ ఆయన సెక్యూరిటీకి తెలపడంతో వారు ఎస్కార్ట్ వాహనంలో వెళ్లి కారును వెంబడించి ఆపా రు. గాయపడ్డ మహదేవ్‌ను స్వయంగా స్వామిగౌడ్ ఆటోలో బండ్లగూడలోని షాదన్ ఆస్పత్రికి తరలించారు. మహదేవ్ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
సభాపతులు అమ్ముడుపోయారు!
- శాసన మండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య అమరావతి: సభాపతులు అమ్ముడు పోయారని శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌పై ఉందని, ప్రతి ఒక్కరూ ఏదోఒక పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి గెలిచిన వారేనని, కానీ సభాపతి స్థానంలో కూర్చున్న తరువాత నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయాలన్నారు. కానీ సభాపతులు అలా కాకుండా అమ్ముడుపోయిన విధానాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నారని, కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. యాంటి డిఫెక్షన్ బిల్లును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పని తాను ప్రతిపక్ష నాయకునిగా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిల్లో చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీపై గెలిచిన వారు వేరే పార్టీకి పోతే కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడంటే ఇందులో మతలబు ఉందన్నారు. పార్టీ నుంచి ఎక్స్టెన్షన్లు వస్తాయనో... ఇంకా ఏవైనా లాభాలు వస్తాయో... నాకు తెలియదు కాని ఇటువంటి దిగజారుడు తనం ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలు ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంటరీ కమిటీ కానీ రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్‌కు, రాష్ట్రపతికి లేఖ రాశానన్నారు. గవర్నర్ ప్రసంగంపైన మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రారంభమైంది. నేను మాట్లాడుతున్నాను. ఉన్న ఫ్యాక్ట్స్ చెబుతున్నా. సునిశితమైన వ్యాఖ్యలు ఉంటాయి. ప్రభుత్వం అనేది ప్రజల ఆస్థికి కస్టోడియన్. వారు ప్రభుత్వ సంక్షేమానికి డబ్బును ఉపయోగపెట్టకుంటే దానిని గుర్తుచేసే బాధ్యత రాజ్యాంగ పరంగా మాకుందన్నారు. కాబట్టి దాని గురించి చెప్పేందుకు అనుమతించకుంటే ప్రిసైడింగ్ అధికారి చట్టసభలో కూర్చునేందుకు అనర్హుడని అన్నారు. తాను మాట్లాడుతుంటే ఒక మంత్రి ఏదో చెప్పబోయారు, వారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమని కోరాను, అయినా నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారు. సభాపతి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రూలింగ్ పార్టీ వారి కోసం ఇంత దిగజారుడు తనంగా లొంగిపోయే వారు ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఎలా పనికొస్తారని ప్రశ్నించారు. చట్టసభల్లో కార్యాక్రమాలు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. రూలింగ్ పార్టీ నుంచి లాభం కోసం ఫేవర్‌గా ఉండి రాజకీయాలు చేసే వాతావరణం పోవాలన్నారు. లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదన్నారు. హౌస్‌లో ఉండే సాంప్రదాయానికి భిన్నంగా వాళ్ళను ఆకర్షించే దానికి, రూల్స్‌కు భిన్నంగా పోతే ఏరకమైన ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుకోవాలి. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రిసైడింగ్ అధికారుల నిర్వాకంపై పార్లమెంట్ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ మారిన వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకోబడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కుర్చీల్లో కూర్చొని మాట్లాడితే పాయింట్ అవుట్ చేసినా సభాపతి తల తిప్పి చూడటం లేదన్నారు. ఈ అమ్ముడుపోయే విధానాలు ఎందుకు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇటువంటి పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ మండలి చైర్మన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, ఫారూక్ హుస్సేన్‌లపై అనర్హత వేటు వేయాలని స్వామిగౌడ్‌కు ఆయన వినతి పత్రం సమర్పించారు. -
'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది'
మండలి ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ పక్ష నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... శాసనమండలి ఛైర్మన్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ పెట్టడం సరికాదని డిఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఎందుకు అంటు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెషన్‌ను గవర్నర్‌ను కోరినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీ ఎమ్మెల్సీలను కోరామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ పదవిని గెలుస్తామని తమకు నమ్మకం ఉందని డీఎస్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మండలి ఛైర్మన్ పదవికి బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి పారూక్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు.