గుంటూరు, సాక్షి: అనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.
ఈ ఫిరాయింపుపై వైఎస్సార్‌సీపీ, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే రఘురాజు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.
శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు.
ఉపేక్షించేది లేదు..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు.
దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment