ఆన్‌లైన్‌లో ‘ఖరీదు’ చేద్దామా..!
నేటి తరానికి చెందిన ఐటీ ఉద్యోగి మాధవీ గణేషన్‌కి ఆన్‌లైన్ షాపింగ్ అంటే మహా క్రేజీ. ఇంటిలోని కిరాణ వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొంటుంది. కానీ ఖరీదైన వస్తువుల విషయానికి వస్తే వెనుకంజ వేస్తోంది. దీనికి కారణం ‘ఆన్‌లైన్‌లో దొరికే లగ్జరీ వస్తువులపై పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే. లగ్జరీ వస్తువుల విషయంలో కొంతమంది ఆన్‌లైన్ రిటైలర్లు మోసాలకు పాల్పడుతున్నారని, అసలుదా, నకిలీదా అన్నది గుర్తుపట్టడం కష్టం’ అని అంటున్నారామె. ఒక్క మాధవినే కాదు చాలా మంది లగ్జరీ వస్తువుల విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారట.
ఖరీదైన వస్తువులకు సంబంధించిన వివరాలను, వాటి సమీక్షలను తెలుసుకోవడానికే ఆన్‌లైన్‌కు పరిమితమవుతున్నారని, చివరకు వస్తువు కొనే సరికి నేరుగా షోరూంకు వెళ్ళి కొంటున్నారట. తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉందని, ఇది 2020 నాటికి 12 శాతానికి చేరుతుందని రీసెర్చ్ సంస్థ మెకిన్సే అంచనా వేస్తోంది. కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే ఆన్‌లైన్‌లో కూడా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో లగ్జరీ వస్తువులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం..
ఇవి గమనించండి..
ఈ-కామర్స్ కంపెనీల రిటర్న్ పాలసీ, డిస్‌క్లైమర్‌ను పూర్తిగా వినియోగదార్లు చదవాలి అని రిటైల్ నిపుణులు కలిశెట్టి నాయుడు సూచించారు. ధ్రువీకరణ, డెలివరీ హామీ, కస్టమర్ కేర్ నంబరు ప్రముఖంగా ఉన్నదీ లేనిదీ కస్టమర్లు గమనించాలి. విక్రయిస్తున్న బ్రాండ్స్ వివరాలు, ఉత్పత్తుల ఫొటోలు, కస్టమర్ల కామెంట్లు, రేటింగ్స్, తాజా ఫ్యాషన్ తీరు, డిజైనర్ల గురించిన సమాచారం ఉంటే ఆ వెబ్‌సైట్‌కు విశ్వసనీయత ఉంటుంది. తాము ఏకైక అధికారిక రిటైలర్ అని ఏదైనా వెబ్‌సైట్ ప్రకటించుకున్నట్టయితే ఆ బ్రాండ్ ఉత్పత్తులు మరేదైనా వెబ్‌సైట్లో లభిస్తున్నాయా లేదా పరిశీలించండి. బ్రాండ్ అధీకృత వెబ్‌సైట్ అయితే నడుస్తున్న సీజన్ కలెక్షన్‌ను గుర్తించవచ్చు.
ప్రయోజనం ఏమిటంటే..
సాధారణంగా లగ్జరీ వస్తువులకు సంబంధించిన షోరూంలు పెద్ద పెద్ద నగరాలు, పట్ణణాలకే పరిమతమవుతాయి. దీనివల్ల మీకు వీటిని కొనాలని ఉన్నా అవి అందుబాటులో ఉండవు. అదే ఆన్‌లైన్‌లో అయితే ఎక్కడి నుంచైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. మీకు నచ్చిన సమయంలో కొనే వెసులుబాటు ఉంటుంది. ఇక లగ్జరీ షోరూంల నిర్వహణ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. సాధారణంగా లగ్జరీ షాపులు సంపన్నులు అధికంగా ఉండే ఖరీదైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు అమ్ముతున్న వస్తువులకు తగ్గట్టుగా షాపును సుందరంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఈ వ్యయాలన్నీ మన నుంచే ముక్కు పిండి వసూలు చేస్తారు. అదే ఆన్‌లైన్‌లో అయితే ఈ ఖర్చులేమీ ఉండవు. దీనితో చౌకగా ఈ వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం దొరుకుతుంది. సాధారణంగా బ్రాండెడ్ షోరూంతో పోలిస్తే ఆన్‌లైన్‌లో 10 శాతం తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు లభిస్తాయని ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి.
ఉత్పాదన నకిలీదైతే..
మీరు స్వీకరించిన ఉత్పాదన నకిలీదైతే కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పాదనను వెనక్కి తీసుకుంటాయి. వెనక్కి తీసుకోకపోతేనే అసలు సమస్య. కంన్సూమర్ ఫోరంలో ఆ వెబ్‌సైట్‌పై ఫిర్యాదు చేయవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను నలుగురికి తెలియజేయండి. గౌరవానికి భంగం కలుగుతుందన్న భయంతోనైనా ఆ వెబ్‌సైట్ నుంచి మీ డబ్బులు మీకు రావొచ్చు. నకిలీది కాబట్టి బ్రాండ్లు ఈ విషయంలో ఏమీ సహాయం చేయవు. అందుకే బ్రాండ్స్‌కు చెందిన సొంత వెబ్‌సైట్లు లేదా పాపులర్ వెబ్‌సైట్ల ద్వారా షాపింగ్ చేయడం ఉత్తమం.
ధర విషయంలో..
కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంటాయి. లగ్జరీ బ్రాండ్ల విషయంలో ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. బ్రాండ్ షాపులో లేదా ఆ బ్రాండ్ వెబ్‌సైట్లో ఉన్న ధర కంటేతక్కువకే అమ్మితే ప్రామాణికతను పరిశీలించాలి అని క్లాసిక్ పోలో తెలంగాణ పంపిణీదారు గుండుబోయిన శ్రీకాంత్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
‘రెడీమేడ్స్ విషయంలో 4 నెలలకోసారి కొత్త సరుకు మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు పాత సరుకుపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. సరుకును కొన్న వ్యాపారి ఆన్‌లైన్ విక్రేతలు లేదా రిటైలర్లకు కొంత ధర తగ్గించి విక్రయిస్తారు’ అని వివరించారు. భారత్‌లో ధరపై నియంత్రణ లేదు. స్టాక్ చాలా మిగిలిపోతే కంపెనీలు భారీగా డిస్కౌంట్ ఇవ్వడం సహజం. కానీ లగ్జరీ వస్తువుల విషయంలో డిస్కౌంట్ అనేది అంత ఎక్కువ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
తనిఖీ చేయండి..
ఆన్‌లైన్‌లో ఉత్పాదన స్వీకరించగానే ట్యాగ్, డస్ట్ బ్యాగ్, వారంటీ కార్డ్‌ను పరిశీలించండి. బ్రాండెడ్ గూడ్స్ ముఖ్యంగా లగ్జరీ ఉత్పత్తులు ఇవి లేకుండా విక్రయించవు. కొన్ని బ్రాండ్లు ఉత్పత్తి లేదా ప్యాక్‌పై ఒక కోడ్‌ను ముద్రిస్తాయి. ఈ కోడ్ ఆధారంగా అసలుదా, నకిలీదా ట్రాక్ చేయవచ్చు. విక్రయానంతర సేవను ఈ బ్రాండ్లు ఆఫర్ చేస్తాయి. ఇవేవీ లేవంటే మీరు నకిలీ ఉత్పాదనను కొన్నారన్న మాట. దుస్తులైతే వస్త్రం, కుట్లు (స్టిచ్చింగ్) ఎలా ఉన్నాయో గమనించాలి. వినియోగదార్లు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవాలి.
మార్కెట్ ప్లేస్ విధానంతో..
సాధారణంగా లగ్జరీ బ్రాండ్లు చాలామటుకు సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారానే విక్రయిస్తున్నాయి. సొంతంగా ఈకామర్స్ వెబ్‌సైట్స్ లేకపోతే మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ఈ-కామర్స్ కంపెనీలతో చేతులు కలిపిన రిటైల్ విక్రేతలే ఉత్పత్తులను సరఫరా చేయడాన్ని మార్కెట్ ప్లేస్ విధానం అంటారు. ఇలాంటి సమయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని రిటైల్ సంస్థలు మోసాలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలుదా నకిలీదా అన్ని గుర్తుపట్టలేనంతగా వీటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ రిటైల్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నాయి. అందుకే మీరు ఆర్డరు ఇచ్చే ఆన్‌లైన్ రిటైల్ సంస్థ ఎంత నమ్మకమైనదన్న విషయం కూడా ఇక్కడ ముఖ్యమే.