ఆన్‌లైన్‌ ఔషధ విక్రయాల్లోకి దిగ్గజాలు... | Amazon in talks to buy Medplus, India's No. 2 pharmacy chain | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్‌.. ‘ఫార్మా’ వేట!

Published Sat, Jul 21 2018 12:33 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

Amazon in talks to buy Medplus, India's No. 2 pharmacy chain - Sakshi

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో దేశీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న దిగ్గజ ఈ–కామర్స్‌ సంస్థలు తాజాగా ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను కొనేయడమో లేదా పెట్టుబడులు పెట్టడమో, వాటాలు తీసుకోవటమో చేసే పనిలో పడ్డాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజాలతో పాటు బిగ్‌బాస్కెట్, స్విగ్గీ వంటి సంస్థలూ బరిలోకి దిగడంతో ఆన్‌లైన్‌ ఫార్మా రంగంలో పోటీ మరింత తీవ్రం కానుంది.  

దేశీయంగా ఔషధాల అమ్మకాలు 2020 నాటికల్లా 55 బిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనా. ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం 2017లో రూ. 1,19,641 కోట్ల (17.5 బిలియన్‌ డాలర్లు) విలువ చేసే ఔషధాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.10,215 కోట్ల (1.49 బిలియన్‌ డాలర్లు) విలువ చేసే ఔషధాలు దేశీయంగా అమ్ముడయ్యాయి.

గతేడాది ఇదే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 8.6 శాతం అధికం. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఫార్మాలో పెద్దగా డిస్కౌంట్ల ఊసుండదు. దీంతో మార్జిన్లు భారీగానే (సుమారు 20–30 శాతం దాకా) ఉంటాయి. కొన్ని స్టార్టప్‌లు డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆన్‌లైన్‌ ఫార్మసీలు ప్రారంభించినప్పటికీ... ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ అంశాలే ఈ–కామర్స్‌ దిగ్గజాలను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ ఫార్మా సంస్థలతో అమెజాన్‌ చర్చలు
ప్రస్తుతం దేశీయంగా మెడ్‌ప్లస్, 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మీజీ, మైరా, అపోలో, నెట్‌మెడ్స్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మెడ్‌ప్లస్‌ వంటి 3–4 సంస్థలతో అమెజాన్‌ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశీయంగా రెండో అతి పెద్ద ఫార్మసీ చెయిన్‌ అయిన మెడ్‌ప్లస్‌పై అమెజాన్‌ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెడ్‌ప్లస్‌కు ఆన్‌లైన్‌ ఫార్మసీతో పాటు దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్‌ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్‌ సాకారమైతే... ఈ స్టోర్స్‌ని అమెజాన్‌ డెలివరీ సెంటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

తద్వారా కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించవచ్చు. అమెజాన్‌ నిర్దిష్టంగా ఎంత మేర వాటాలు కొనుగోలు చేసేదీ తెలియనప్పటికీ.. మెడ్‌ప్లస్‌తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెడ్‌ప్లస్‌లో వ్యవస్థాపకుడు మధుకర్‌ గంగాడికి దాదాపు 90% వాటాలున్నాయి. 2006లో ప్రారంభమైన మెడ్‌ప్లస్‌.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. మెడ్‌ప్లస్‌ ఆదాయాలు 2014–15లో రూ. 1,361 కోట్లు, 2015–16లో రూ. 1,726 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్లలో లాభాలు రూ. 7–9 కోట్లుగా ఉన్నాయి.

మెడ్‌లైఫ్‌పై ఫ్లిప్‌కార్ట్‌ దృష్టి..
అమెజాన్‌కు పోటీదారైన దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఆన్‌లైన్‌ ఫార్మాలో ప్రవేశించేందుకు చకచకా పావులు కదుపుతోంది. అల్కెమ్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు నిర్వహించే మెడ్‌లైఫ్‌ సంస్థతో   చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పేర్లు వెల్లడించనప్పటికీ.. రెండు భారీ ఈ–కామర్స్‌ సంస్థలతో చర్చలు జరిపినట్లు, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు మెడ్‌లైఫ్‌ వర్గాలు పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది.

ఇక ఫుడ్‌ డెలివరీ సేవల్లో ఉన్న బెంగళూరు సంస్థ స్విగ్గీ .. ఔషధాల డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఈ–ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. అటు ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్‌ సంస్థ.. కొత్తగా ఫార్మాను కూడా తమ లిస్టులో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఏఐవోసీడీ ఆందోళన..
ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏఐవోసీడీ ఆగస్టు 1 నుంచి 14 దాకా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ తమ డిమాండ్లను పట్టించుకోకపోయిన పక్షంలో రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే షాపులు తెరిచేలా వర్క్‌–టు–రూల్‌ విధానాన్ని అమలు చేస్తామని ఏఐవోసీడీ హెచ్చరిస్తోంది. ఇందులో 8.5 లక్షల మంది కెమిస్టులు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉన్నారు.  

పిల్‌ప్యాక్‌ కొనుగోలుతో అమెజాన్‌ సంచలనం..
అమెరికాలో పిల్‌ప్యాక్‌ అనే ఆన్‌లైన్‌ ఫార్మా కంపెనీని దాదాపు 1 బిలియన్‌ డాలర్లకు అమెజాన్‌ కొనుగోలు చేయడం అక్కడి ఫార్మా మార్కెట్‌ను కుదిపేసింది. ఈ డీల్‌ వార్తతో అమెరికా ఫార్మసీ/డ్రగ్‌స్టోర్‌ పరిశ్రమ మార్కెట్‌ క్యాప్‌ ఏకంగా 13 బిలియన్‌ డాలర్ల మేర పతనమైంది.

ఇలాంటి భారీ సంచలనాన్నే భారత్‌లోనూ పునరావృతం చేసేందుకు అమెజాన్‌ కసరత్తు చేస్తోంది. నిజానికి అమెజాన్‌కి ఆన్‌లైన్‌ ఫార్మా వ్యాపారం కొత్తేమీ కాదు. 1998లో డ్రగ్‌స్టోర్‌డాట్‌కామ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ, 2000లో టెక్నాలజీ సంస్థలు కుదేలవడంతో.. ఇది మూతబడింది. ఆకర్షణీయమైన భారత మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమెజాన్‌ మళ్లీ రంగంలోకి దిగుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement