BigBasket
-
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
టాప్ 10 పాస్వర్డ్స్: మీరు ఇలాంటి పాస్వర్డ్లు వాడటం లేదు కదా?
ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్వర్డ్స్. ఆ టాప్‌టెన్ జాబితాను నార్డ్‌పాస్ సంస్థ ప్రచురించింది. ఈజీగా గుర్తుండటం కోసం బలహీనమైన పాస్వర్డ్స్ వాడుతున్నారని నిర్వాహక సంస్థ తెలిపింది. ఇందులో తొలిస్థానంలో ఉన్న Passwordను పాస్‌వర్డ్‌గా 34లక్షల సార్లు ఉపయోగించారు. ఈ జాబితాలో ఉన్న బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే క్రాక్ చేశారు. దీన్ని జనం 75 వేల సార్లు ఉపయోగించడం విశేషం. అందుకే కఠినమైన పాస్‌వర్డ్‌ను వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ మీరు ఇలాంటి ఈజీ పాస్వర్డ్లు వాడటం లేదు కదా? ♦Password ♦123456 ♦12345678 ♦bigbasket ♦123456789 ♦pass@123 ♦1234567890 ♦anmol123 ♦abcd1234 ♦googledummy -
ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ దాడులనుంచి రక్షణ, ఇతర సెక్యూరిటీ నిమిత్తం పాస్వర్డ్స్ చాలా కీలకం. సోషల్ మీడియా అకౌంట్స్ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు. అయినా నిర్లక్క్ష్యమే. బలహీనమైన లేదా సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, చాలా కీలకమైన ఫైనాన్షియల్ డేటాను కూడా హ్యాకర్లు ఈజీగా తస్కరించే అవకాశం ఉంది. ప్రతీ ఏడాది లాగానే 2022లో కూడా యూజర్లు చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తాజాగా సర్వేలో తేలింది. అందులోనూ భారతీయులు ఇంకా బలహీనమైన పాస్వర్డ్స్ఉపయోగిస్తున్నారని NordPass-2022 అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా ఏకంగా 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను మందికి పైగా భారతీయులు ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ‘‘పాస్వర్డ్" అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. భారతదేశంలో దాదాపు 3.5 లక్షల మంది సైన్ అప్ చేయడానికి పాస్‌వర్డ్‌గా “పాస్వర్డ్”ని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఇండియాతో దాదాపు 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. ఈ సంవత్సరం టాప్ 10 అత్యంత సాధారణ పాస్వర్డ్లు 123456, bigbasket, పాస్వర్డ్, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy. వీటితోపాటు గెస్ట్, వీఐపీ, 123456 లాంటి పాస్‌వర్డ్‌లను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది, పాస్వర్డ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ♦ వినియోగదారులు ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి, లేదంటే పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడం, హ్యాక్ చేయడం, యాక్సెస్ చేయడం హ్యాకర్‌కు ఈజీ అవుతుంది. ♦ పుట్టిన రోజులు, పెళ్లి రోజులను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకుండా ఉండటం మంచింది. (ఈజీగా గుర్తు ఉంటుందని దాదాపు అందరూ అలానే చేస్తారు) అలాగే అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్వర్డ్ కూర్చుకుంటే మంచిదని నిపుణుల సూచన. ♦ప్రతి నెలా పాస్‌వర్డ్‌ను అప్డేట్ చేయడం బెటర్. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం మంచి పద్ధతి. -
లగ్జరీ ఫుడ్ స్టోర్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా గ్రూప్..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ తాజాగా లగ్జరీ ఫుడ్ స్టోర్వైపు అడుగులు వేస్తోంది. ఇందుకు గ్రోసరీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌తో ప్రీమియర్ లగ్జరీ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ టాటా క్లిక్ లగ్జరీ చేతులు కలిపింది. తద్వారా తొలుత ముంబైలో కొత్త లగ్జరీ గోర్మెట్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌లోని ఈకామర్స్ సంస్థలు టాటా క్లిక్ లగ్జరీ, బిగ్‌బాస్కెట్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించాయి. టాటా క్లిక్ లగ్జరీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏర్పాటుకానున్న ఈ స్టోర్లను న్యూఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రో నగరాలకు తదుపరి దశలో విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. దేశ, విదేశాలలో ప్రాచుర్యం పొందిన లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లు, ఎంపిక చేసిన వివిధ ప్రొడక్టులు, ప్రత్యేక విభాగాలతో ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం తృణధాన్యాలు, చాకొలెట్లు, బిస్కెట్లు, పానీయాలు, వంటనూనెలు, డ్రై ఫ్రూట్స్, సాస్‌లు, సూప్స్, నూడుల్స్ తదితర పలు ప్రొడక్టులతోపాటు.. ప్రీమియం, లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లను ఆఫర్ చేయనున్నట్లు వివరించాయి. కాగా.. 2021 మే నెలలో బిగ్‌బాస్కెట్‌లో టాటా గ్రూప్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడం తెలిసిందే. (చదవండి: చైనా మరో కీలక ప్రయోగం.. భూమి అంతం కానుందా?) -
ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి బిగ్‌బాస్కెట్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ తాజాగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్ సర్వీస్ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా వీటి ద్వారా అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ స్టోర్స్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు బ్రెడ్, గుడ్లు మొదలైన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో 50,000 ఉత్పత్తుల శ్రేణి నుంచి కొనుగోలుదారులు తమకు కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి, తమ వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్ నుంచి వాటిని తీసుకోవచ్చని మీనన్ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని, ఆటోమేటిక్ కంప్యూటర్ విజన్ ఉండే కౌంటర్లో తూకం వేయొచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
బిగ్‌బాస్కెట్ కొనుగోలుకు టాటా రెడీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ ప్రతిపాదించింది. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు చేసిన దరఖాస్తు ప్రకారం బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ప్రతిపాదిత వివరాల ప్రకారం టాటా డిజిటల్(టీడీఎల్), బిగ్‌బాస్కెట్ నిర్వాహక సంస్థ సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్(ఎస్జీఎస్)లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీల్‌ను ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన టీడీఎల్ టెక్నాలజీ సర్వీసులను అందిస్తోంది. వీటిలో ఐడెంటిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్, లాయల్టీ ప్రోగ్రామ్, ఆఫర్లు, చెల్లింపులు తదితర సేవలున్నాయి. ప్రతిపాదిత వాటా కొనుగోలు కారణంగా పోటీ లేదా పోటీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులూ వాటిల్లబోవంటూ సీసీఐకు టీడీఎల్ నివేదించింది. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్కెట్ కొనుగోలుకి టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ డీల్ ద్వారా చైనీస్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో వాటాను విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ తదితర దిగ్గజాలతో పోటీ పడుతోంది. -
టాటా ‘బిగ్‌బాస్కెట్ ’డీల్!
ముంబై: కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ ఆన్లైన్ గ్రోసరీ విక్రయ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీల్ తుది దశకు చేరినట్లు వెల్లడించాయి. ఇందుకు టాటా గ్రూప్ రూ. 9,300–9500 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు తెలియజేశాయి. ఒప్పంద వివరాలు నాలుగైదు వారాల్లో వెల్లడయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. డీల్ కుదిరితే ఆన్లైన్ గ్రోసరీ విభాగంలో అతిపెద్ద కొనుగోలుగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ డీల్‌తో బిగ్‌బాస్కెట్ విలువ రూ. 13,500 కోట్లకు చేరనున్నట్లు తెలియజేశారు. అలీబాబా ఔట్ బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన చైనీస్ దిగ్గజం అలీబాబాతోపాటు అబ్రాజ్, ఐఎఫ్‌సీ.. టాటా గ్రూప్‌నకు వాటాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తద్వారాబిగ్బాస్కెట్లో సుమారు 26 శాతం వాటా కలిగిన అలీబాబా..æకంపెనీ నుంచి వైదొలగనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీల్ కుదుర్చుకునేందుకు కాంపిటీషన్ కమిషన్ అనుమతి కోసం రెండు సంస్థలూ నిరీక్షిస్తున్నట్లు తెలియజేశాయి. కాగా.. టాటా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు తదుపరి కూడా బిగ్‌బాస్కెట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్సహా అత్యున్నత అధికారులు బోర్డులో కొనసాగనున్నట్లు అంచనా. అయితే డీల్ అంశంపై అటు టాటా గ్రూప్, ఇటు బిగ్‌బాస్కెట్ స్పందించకపోవడం గమనార్హం! చదవండి: (బైజూస్ చేతికి టాపర్ టెక్!) సూపర్‌యాప్ ఇటీవల అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశీ ఈకామర్స్ బిజినెస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన టాటా గ్రూప్ ప్రణాళికలు వేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా టాటా గ్రూప్‌లోని రిటైల్, ఆన్లైన్ బిజినెస్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే సన్నాహాల్లో ఉంది. మరోవైపు దిగ్గజ గ్రూప్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్(రిటైల్) ఈకామర్స్ రంగంలో భారీ అడుగులు వేస్తున్నాయి. దీంతో పోటీ సైతం తీవ్రతరమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాయి. కాగా.. కొంతకాలంగా ఈకామర్స్ బిజినెస్‌కు సంబంధించి భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర కంపెనీలలో మెజారిటీ వాటాల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. -
టాటా గ్రూప్ కిట్టీలో బిగ్‌బాస్కెట్!
ముంబై, సాక్షి: దాదాపు ఐదు నెలల చర్చల అనంతరం ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,600 కోట్లు)కు టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బిగ్‌బాస్కెట్ విలువను 1.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,850 కోట్లు)గా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. డీల్ ఇలా.. ఒప్పందంలో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే వాటా కలిగిన ఇన్వెస్టర్ల నుంచి టాటా గ్రూప్ 50-60 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లలో చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలున్నాయి. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్కెట్ తాజాగా జారీ చేయనున్న మరో 20-30 శాతం వాటాను సైతం టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా బిగ్‌బాస్కెట్‌లో మొత్తం 80 శాతం వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకునే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సూపర్-యాప్.. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. డీల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను సైతం సూపర్ యాప్‌లో భాగం చేసే యోచనలోఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో హౌస్‌హోల్డ్, గ్రోసరీ విభాగంలో పలు ప్రొడక్టులను అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. టాటా సన్స్ వార్షిక సమావేశంలో భాగంగా గతేడాది చైర్మన్ చంద్రశేఖరన్ సూపర్‌యాప్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం విదితమే. సూపర్ యాప్ ద్వారా గ్రోసరీ, ఫ్యాషన్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ తదితర పలు సర్వీసులకు తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా దేశీ ఈకామర్స్ మార్కెట్లో అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్లిప్‌కార్ట్ తదితర దిగ్గజాలు వేగవంతంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగినంత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్‌పై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! -
బిగ్‌బాస్కెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్‌ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్ వెబ్‌ను మానిటర్ చేస్తున్నప్పుడు బిగ్‌బాస్కెట్‌కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది. బిగ్‌బాస్కెట్ వినియోగదారులు - జాగ్రత్తలు ఓటీపీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ చెప్పవద్దు. ఆప్ నుండి ఆర్డర్ చేయడానికుపయోగించే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చండి. యూపీఐ యాప్ పిన్‌లను మార్చండి. అలాగే ఈమెయిల్, ఇతర సేవలకు ఒకే పాస్వర్డ్ లేదా పిన్‌లను ఉపయోగిస్తుంటే తక్షణమే వాటన్నింటి పాస్‌వర్డ్‌లను మార్చండి. వేరు వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఉత్తమం. బిగ్‌బాస్కెట్ యాప్‌ను అధికారిక ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి లేదా అప్ డేట్ చేయండి. అప్డేట్కు సంబంధించి ఎలాంటి తప్పుడు సందేశాలను నమ్మకండి. కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లపై పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకుసంబంధంలేని, మీరు ఆర్డర్ ఇవ్వని ప్యాకేజీలను డెలివరీలు స్వీకరించవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వని క్యాష్ ఆన్ డెలివరీ ప్యాకేజీలను విశ్వసించకండి. వాటికి ఎలాంటి నగదు చెల్లించకండి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా నటిస్తూ మానిప్యులేట్ చేస్తున్న స్కాం పట్ల జాగ్రత్త వహించండి. -
బిగ్‌బాస్కెట్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది. -
టాటా గ్రూప్ చేతికి బిగ్‌బాస్కెట్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పోటీ తీవ్రం: బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్ దిగ్గజం అమెజాన్.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్ కంపెనీ అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు సమాచారం. -
టాటా గ్రూప్ చేతికి బిగ్‌బాస్కెట్!
ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! పోటీ తీవ్రం బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్ దిగ్గజం అమెజాన్.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్ ఆన్లైన్ దిగ్గజం అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కోసం టాటా గ్రూప్ 50-70 కోట్ల డాలర్లను వెచ్చించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 20 కోట్ల డాలర్లను సమీకరించేందుకు టాటా గ్రూప్‌తో బిగ్‌బాస్కెట్ చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. -
పల్లె వాకిట.. ఆన్లైన్ స్టోర్..!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్... ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆన్లైన్లో సరుకులు బుక్ చేస్తే వ్యాపారులు వాటిని ఇంటికే పంపిస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి బడా సంస్థలు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ...మెజారిటీ పల్లెలకు ఈ సంస్థలు ఇంకా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ పల్లెల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్స్) ద్వారా ఈ–కామర్స్ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో ఈ–కామర్స్‌ను పరిచయం చేసిన సీఎస్సీ... తాజాగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. సరుకులు అనేకం... ప్లాట్‌ఫామ్ ఒకటే... ఆన్లైన్ వ్యాపారంలో వేగాన్ని పెంచేందుకు సీఎస్సీ ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనికి అనుబంధంగా సరుకుల మేనేజ్మెంట్, ఆర్డర్లు తీసుకోడానికి మరో రెండు సపోర్టింగ్ యాప్లుంటాయి. సీఎస్సీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఎల్ఈ(విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్)కు ప్రత్యేకంగా ఈ యాప్‌ను పరిచయం చేస్తోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్న వీఎల్ఈకి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను జారీ చేస్తుంది. దీని ద్వారా సరుకుల లభ్యత, ధరల నిర్ధారణ తదితరాలను సపోర్టింగ్ యాప్ ‘మై గ్రోసరీస్’లో చేయాలి. కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్‌ను గుర్తించి సరుకులు డెలివరీ చేసేందుకు ఆర్డర్ సిస్టంలో చూడాలి. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యావసర సరుకులే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీతో పాటు అందుబాటులో ఉన్న రకాలను ఇందులో నమోదు చేసి మేనేజ్ చేయవచ్చు. ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూడు రకాల యాప్‌లను వీఎల్ఈ మేనేజ్ చేసినప్పటికీ కస్టమర్ మాత్రం గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌ను వినియోగిస్తే సరిపోతుంది. ప్రమోట్ చేస్తే సరి... క్షేత్రస్థాయిలో గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను వీఎల్ఈ ప్రచారం చేసుకోవాలి. యాప్‌పై వినియోగదారునికి అవగాహన కల్పించి తన దుకాణాన్ని యాప్‌లో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బుక్ చేసే ఆర్డర్లన్నీ ఎంపిక చేసిన వీఎల్ఈకి చేరతాయి. ఆ మేరకు సరుకులను సరఫరా చేస్తారు. సీఎస్సీ రూపొందించిన గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌లో సరుకుల లభ్యతను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే వినియోగదారుడికి కూడా స్పష్టత ఉంటుంది. అదేవిధంగా ధరలను కూడా వీఎల్ఈ నిర్ధారించిన ప్రకారం ప్రత్యక్షమవుతాయి. తక్కువ లాభాలను ఆశించి సరసమైన ధరలతో ప్రారంభిస్తే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవచ్చని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం యాప్‌పై సీఎస్సీ గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది. అవగాహనతోనే వ్యాపార వృద్ధి... గ్రామాల్లో వీఎల్ఈ ప్రారంభించే ఈ–కామర్స్ వ్యాపారానికి.. గ్రామం లేదా సమీపంలోని టౌన్లో ఉన్న హోల్‌సేల్ కిరాణా స్టోర్‌తో సరుకుల సరఫరాకు అవగాహన చేసుకోవాలి. యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్ల మేరకు సరుకులను ప్యాక్ చేసి కస్టమర్‌కు బట్వాడా చేస్తే లక్ష్యం పూర్తయినట్లే. కిరాణా దుకాణం తోనే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీ, ఇతర హోల్‌సేల్ దుకాణాలతో ఒప్పందం చేసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సీఎస్సీ సూచిస్తోంది. -
ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?
సాక్షి, ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్ గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఈ కోవలో ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్ల పై ఆధారపడిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. (చదవండి: అమ్మను సర్ప్రైజ్ చేస్తానని.. అనంత లోకాలకు) ‘ప్రస్తుతానికి సేవలను నిలిపివేశాం..కేంద్ర అధికారుల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికారుల ఆంక్షల కారణంగా సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవు. త్వరలోనే పునరుద్దిస్తాం’ అనే సందేశం దేశవ్యాప్తంగా చాలామంది బిగ్‌బాస్కెట్ వినియోగదారులకు దర్శనమిస్తోంది. అంతేకాదు ఆర్డర్ రద్దు చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నామనే సందేశం కూడా కొంతమంది వినియోగదారులను వెక్కిరిస్తోంది. ప్రభుత్వం అత్యవసర సేవలుగా ప్రకటించినప్పటికీ డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) అంతేకాదు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు వేధింపులకు గురి కావల్సి వస్తోందని వాపోయింది. తమ డెలివరీ బాయ్స్‌ని పోలీసులు ఆపి ప్రశ్నించడంతోపాటు, కొన్ని సందర్భాల్లో దాడి చేసినట్టు కూడా ఆరోపించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవడం ఆపేసి, అవసరమైన వస్తువుల పంపిణీపై మాత్రమే దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల రవాణాను నిలిపివేసినట్టు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని మరో సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే ఈ సంస్థల సేవలు తిరిగి ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు. మరోవైపు తాజా పరిమాణాలపై స్పందించిన ఒక నెటిజన్ తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను తగిన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందే కేటీఆర్ ఆశిస్తూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్ -19 ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితం కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో నిత్యాసరాలకోసం ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఆన్లైన్ సైట్ల ద్వారానే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు అన్నీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. -
ఆన్లైన్ రిటైల్... ఆకాశమే హద్దు!!
ముంబై: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్లో ఆన్లైన్ రిటైల్ వాటా 25 శాతంగా ఉండగా, 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని తెలియజేసింది. నివేదికలోని అంశాల మేరకు... ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. ఒక్కో ఆన్లైన్ షాపింగ్ కస్టమర్ ప్రస్తుతం ఒక ఏడాదిలో రూ.12,800ను ఖర్చు చేస్తుంటే... 2030 నాటికి ఇది రూ.25,138 స్థాయికి పెరుగుతుంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ సహా ఎలక్ట్రానిక్స్ విభాగంలో భౌతిక రిటైల్ దుకాణాల మార్కెట్ వాటాను ఆన్లైన్ రిటైల్ రంగం సొంతం చేసుకున్నట్లు జెఫ్రీస్ తెలియజేసింది. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆన్లైన్ రిటైల్ రంగానికి ప్రధాన విభాగాలుగా ఉండగా, ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలు కూడా పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. బిగ్‌బాస్కెట్, అమేజాన్ ప్యాంట్రీ ప్రతీ నెలా ప్రారంభంలో ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. సౌకర్యమే ఆకర్షణీయత కొత్త కస్టమర్లు ఆన్లైన్ విభాగానికి రావటమనేది మున్ముందు బాగా పెరుగుతుందని అంచనా వేసిన ఈ నివేదిక... ధరల పరంగా తక్కువ వ్యత్యాసం, సౌకర్యాలు ఇందుకు కారణాలని వివరించింది. వ్యక్తిగత సంరక్షణ, మేకప్ ఉత్పత్తులకూ ఆన్లైన్ మార్కెట్ పెరుగుతున్నట్టు పేర్కొంది. ‘‘ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విస్తరణకు ప్రస్తుతం తగ్గింపు ధరలు, సౌకర్యం అన్నవి సానుకూలతలు. మధ్యకాలానికి తగ్గింపులన్నవి క్రమబద్ధీకరణ అవుతాయి. ఆ తర్వాత సౌకర్యం మాత్రమే వినియోగదారులను ఆకర్షించే అంశంగా ఉంటుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మందికి ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన ఉంది. నకిలీ వస్తువులు పంపుతున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఆన్లైన్ రిటైలర్లు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అప్పటి వరకు కొంత మంది కస్టమర్లు ఆన్లైన్ రిటైల్‌కు దూరంగానే ఉంటారు’’ అని జెఫరీస్ వివరించింది. -
కిరాణా సేవల్లోకి ‘స్విగ్గీ’
బెంగళూరు: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్ డెలివరీ సేవల్లోనే ఉన్న ఈ సంస్థ.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ తరహాలో ఇక నుంచి కిరాణా వస్తువులు, మందులు, శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఇతర రోజువారీ సదుపాయాలను అందించనుంది. ఇందుకోసం ‘స్టోర్స్’ పేరిట ఒక ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ఫ్లాట్‌ఫాంను మంగళవారం ఆవిష్కరించింది. తొలుత ఈ సేవలను హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ఇక్కడి 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టోర్‌కు మా సేవలను అనుసంధానం చేయడంలో భాగంగా ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్ కేర్ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానం చేశాం అని వ్యాఖ్యానించారు. -
ఈ–కిరాణాలో హోరాహోరీ
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ఈ–గ్రోసరీ సెగ్మెంట్ (ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్ ఆర్డర్ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్ కేక్. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, –మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింతగా గుమ్మరించడం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం కోసం పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ సంస్థ ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన ఈ కామర్స్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయబోతోంది. అంతేకాకుండా ఇటీవలనే మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్ కంపెనీ కూడా ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసం భారీగా పెట్టుబడులు గుమ్మరించబోతోంది. బిగ్‌బాస్కెట్ కోసం పేటీఎమ్ మాల్... బిగ్‌బాస్కెట్ మొదటగా బెంగళూరులో తన కార్యకలాపాలు ఆరంభించింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ను డెలివరీ చేస్తోంది. 20,000పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. లో అత్యధిక మార్కెట్ వాటా బిగ్ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా. ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినప్పటికీ, ఈ కంపెనీ ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్ఫార్మ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు గత ఏడాదే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. వాల్‌మార్ట్ సంస్థ, భారత్‌లో ఈ కామర్స్ సంస్థతో టై–అప్ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పటినుంచే బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు పేటీఎమ్ చర్చలు జరపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎమ్‌కు దన్నుగా నిలుస్తున్న అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా పేర్కొంది. విలువ దగ్గరే పీటముడి ? బిగ్‌బాస్కెట్–పేటీఎమ్ మాల్ డీల్ విషయమై... బిగ్‌బాస్కెట్ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైననే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశం తేలకనే చర్చలు ముందుకు సాగట్లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకుగాను పేటీఎమ్ మాల్లో తమకొక డైరెక్టర్ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్ కోరుతోందని సమాచారం. డీల్ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి. బిగ్‌బాస్కెట్ అయితే బావుంటుంది..! ఈ కామర్స్ స్పేస్‌లో అమెజాన్–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్ మాల్ ఈ కామర్స్ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎమ్ మాల్ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని నిపుణులంటున్నారు. బిగ్‌బాస్కెట్‌తో టై అప్ వల్ల పేటీఎమ్ మాల్‌కు రిపీటెడ్ కస్టమర్లు లభిస్తారని, ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్ మాల్‌కు, బిగ్‌బాస్కెట్.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు. ఈ–గ్రోసరీదే హవా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలకు భవిష్యత్తులో గ్రోసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని రెండేళ్ల క్రితమే అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అంచనా వేశారు. అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్లైన్ వ్యాపారంలో సగం వాటా గ్రోసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ గ్రోసరీ మార్కెట్ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్ సంస్థలు గ్రోసరీస్పేస్లో మరింత మార్కెట్ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాల్‌మార్ట్ నుంచి సూపర్‌మార్ట్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ తదితర సంస్థలు ఈ గ్రోసరీ సెగ్మెంట్లో మరింత వాటా కొల్లగొట్టడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలనే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్...ఈ గ్రోసరీ సెగ్మెంట్ కోసమే 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్లైన్ గ్రోసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సప్లై చెయిన్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్ చెయిన్ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు. ♦ రూ.1,460 కోట్లు–బిగ్‌బాస్కెట్‌లో ఆలీబాబా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ♦ రూ.2,920 కోట్లు –ఈ–గ్రోసరీ కోసం వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్ చేయనున్న మొత్తం ♦ రూ.4,200 కోట్లు–మోర్ కోసం అమెజాన్, సమర క్యాపిటల్‌లు వెచ్చించిన మొత్తం ♦ 8,000– రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య. ఈ స్టోర్స్‌ను ఈ–గ్రోసరీ కోసం వినియోగించాలనుకుంటున్న రిలయన్స్ -
ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి దిగ్గజాలు...
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో దేశీ ఆన్లైన్ షాపింగ్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న దిగ్గజ ఈ–కామర్స్ సంస్థలు తాజాగా ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను కొనేయడమో లేదా పెట్టుబడులు పెట్టడమో, వాటాలు తీసుకోవటమో చేసే పనిలో పడ్డాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పాటు బిగ్‌బాస్కెట్, స్విగ్గీ వంటి సంస్థలూ బరిలోకి దిగడంతో ఆన్లైన్ ఫార్మా రంగంలో పోటీ మరింత తీవ్రం కానుంది. దేశీయంగా ఔషధాల అమ్మకాలు 2020 నాటికల్లా 55 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం 2017లో రూ. 1,19,641 కోట్ల (17.5 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.10,215 కోట్ల (1.49 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు దేశీయంగా అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 8.6 శాతం అధికం. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఫార్మాలో పెద్దగా డిస్కౌంట్ల ఊసుండదు. దీంతో మార్జిన్లు భారీగానే (సుమారు 20–30 శాతం దాకా) ఉంటాయి. కొన్ని స్టార్టప్‌లు డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆన్లైన్ ఫార్మసీలు ప్రారంభించినప్పటికీ... ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ అంశాలే ఈ–కామర్స్ దిగ్గజాలను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మా సంస్థలతో అమెజాన్ చర్చలు ప్రస్తుతం దేశీయంగా మెడ్‌ప్లస్, 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మీజీ, మైరా, అపోలో, నెట్‌మెడ్స్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మెడ్‌ప్లస్ వంటి 3–4 సంస్థలతో అమెజాన్ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశీయంగా రెండో అతి పెద్ద ఫార్మసీ చెయిన్ అయిన మెడ్‌ప్లస్‌పై అమెజాన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెడ్‌ప్లస్‌కు ఆన్లైన్ ఫార్మసీతో పాటు దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే... ఈ స్టోర్స్‌ని అమెజాన్ డెలివరీ సెంటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించవచ్చు. అమెజాన్ నిర్దిష్టంగా ఎంత మేర వాటాలు కొనుగోలు చేసేదీ తెలియనప్పటికీ.. మెడ్ప్లస్తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెడ్‌ప్లస్‌లో వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడికి దాదాపు 90% వాటాలున్నాయి. 2006లో ప్రారంభమైన మెడ్‌ప్లస్.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. మెడ్‌ప్లస్ ఆదాయాలు 2014–15లో రూ. 1,361 కోట్లు, 2015–16లో రూ. 1,726 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్లలో లాభాలు రూ. 7–9 కోట్లుగా ఉన్నాయి. మెడ్లైఫ్పై ఫ్లిప్‌కార్ట్ దృష్టి.. అమెజాన్‌కు పోటీదారైన దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఆన్లైన్ ఫార్మాలో ప్రవేశించేందుకు చకచకా పావులు కదుపుతోంది. అల్కెమ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు నిర్వహించే మెడ్‌లైఫ్ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పేర్లు వెల్లడించనప్పటికీ.. రెండు భారీ ఈ–కామర్స్ సంస్థలతో చర్చలు జరిపినట్లు, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు మెడ్‌లైఫ్ వర్గాలు పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. ఇక ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న బెంగళూరు సంస్థ స్విగ్గీ .. ఔషధాల డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఈ–ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. అటు ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ సంస్థ.. కొత్తగా ఫార్మాను కూడా తమ లిస్టులో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐవోసీడీ ఆందోళన.. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏఐవోసీడీ ఆగస్టు 1 నుంచి 14 దాకా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ తమ డిమాండ్లను పట్టించుకోకపోయిన పక్షంలో రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే షాపులు తెరిచేలా వర్క్–టు–రూల్ విధానాన్ని అమలు చేస్తామని ఏఐవోసీడీ హెచ్చరిస్తోంది. ఇందులో 8.5 లక్షల మంది కెమిస్టులు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉన్నారు. పిల్‌ప్యాక్ కొనుగోలుతో అమెజాన్ సంచలనం.. అమెరికాలో పిల్‌ప్యాక్ అనే ఆన్లైన్ ఫార్మా కంపెనీని దాదాపు 1 బిలియన్ డాలర్లకు అమెజాన్ కొనుగోలు చేయడం అక్కడి ఫార్మా మార్కెట్‌ను కుదిపేసింది. ఈ డీల్ వార్తతో అమెరికా ఫార్మసీ/డ్రగ్‌స్టోర్ పరిశ్రమ మార్కెట్ క్యాప్ ఏకంగా 13 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఇలాంటి భారీ సంచలనాన్నే భారత్‌లోనూ పునరావృతం చేసేందుకు అమెజాన్ కసరత్తు చేస్తోంది. నిజానికి అమెజాన్‌కి ఆన్లైన్ ఫార్మా వ్యాపారం కొత్తేమీ కాదు. 1998లో డ్రగ్స్టోర్డాట్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ, 2000లో టెక్నాలజీ సంస్థలు కుదేలవడంతో.. ఇది మూతబడింది. ఆకర్షణీయమైన భారత మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమెజాన్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. -
స్విగ్గీ, బిగ్‌బాస్కెట్.. ఓ పాలప్యాకెట్!
సాక్షి, బిజినెస్ విభాగం: ఇపుడు మీ ఇంటికి ఉదయాన్నే పాలు ఎవరు తెస్తారు? మీ ఇంటికి దగ్గర్లోని పాల ఏజెన్సీ నడుపుతున్న వ్యక్తేనా..? ఇప్పటికిప్పుడు కాకున్నా... మున్ముందు పరిస్థితి మారబోతోంది. ఇప్పటికే ఈ రంగంలోకి కొన్ని స్టార్టప్‌లు ప్రవేశించగా... కొత్త వ్యాపారావకాశాల కోసం వెదుకుతున్న ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ దిగ్గజాల కన్ను వీటిపై పడింది. వీటిని కొనుగోలు చేసి ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటానికి స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటివి ప్రయత్నాలు మొదలెట్టాయి. స్టార్టప్‌లతో స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ చర్చలు పుష్కలంగా నిధులు కలిగి, గ్రాసరీ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తోన్న స్విగ్గీ... సబ్స్క్రిప్షన్ విధానంలో పాలు డెలివరీ చేసే ‘సూపర్ డైలీ’ స్టార్టప్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఇక అలీబాబా దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్‌బాస్కెట్... పుణేకు చెందిన రెయిన్క్యాన్, గుర్గావ్కు చెందిన మిల్క్ బాస్కెట్, బెంగళూరుకు చెందిన డైలీ నింజా స్టార్టప్‌లతో కొనుగోలు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలేవీ ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఈ వార్తలపై అటు బిగ్ బాస్కెట్, స్విగ్గీలు కానీ ఇటు ఆయా స్టార్టప్‌లు గానీ స్పందించటం లేదు. ‘కంపెనీలు స్టార్టప్‌లకు మూలధనం అందించాలి. ఇవి సామర్థ్యం పెంచుకోవటానికి ఈ పెట్టుబడులును వినియోగించుకోవాలి. కస్టమర్లను దక్కించుకోవడం కోసం ప్రయత్నించాలి. సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవలు అందించే సంస్థలు విశ్వసనీయమైన కస్టమర్లను ఇవ్వగలవు. అందుకే స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలు వ్యాపారంలో మంచి వృద్ధిని ఆశిస్తే... స్టార్టప్‌ల కొనుగోలు ద్వారా ముందుకెళ్లాలి’ అని అల్టెరియా క్యాపిటల్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ మురళీ వివరించారు. ఆర్డర్లు పెరుగుతాయ్! మిల్క్ డెలివరీ స్టార్టప్‌లు స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ సంస్థల ఆర్డర్ల పెరుగుదలకు దోహదపడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నెలవారీ ఆర్డర్లు 15–20 రెట్లుకు పెరగొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డర్లు నెలకు 4–5 రెట్లుగా ఉన్నాయన్నారు. ‘మనం పాలు ప్రతిరోజూ కొంటాం. ఇందుకోసం ప్రతి కుటుంబం సగటున నెలకు రూ.1,000కు పైగా వెచ్చిస్తుంది. పాల విక్రయంపై మార్జిన్లు తక్కువగా ఉండటంతో ఆన్లైన్ మిల్క్ డెలివరీ స్టార్టప్స్.. ఇతర గ్రాసరీ ప్రొడక్టులను వారి పోర్ట్‌ఫోలియోకి జత చేసుకుంటున్నాయి’ అని రెడ్‌సీర్ కన్సల్టింగ్ పేర్కొంది. గ్రాసరీలో తీవ్రమైన పోటీ గ్రాసరీ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వల్ల పోటీ తీవ్రమౌతోంది. ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీలోకి అడుగు పెడుతుండటంతో బిగ్‌బాస్కెట్ వచ్చే రెండు త్రైమాసికాల్లో వీలైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. పరిశ్రమ అంచనా ప్రకారం.. బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా రోజుకు 60,000 నుంచి 70,000 ఆర్డర్లను హ్యాండిల్ చేస్తోంది. ఇక స్విగ్గీకి అయితే రోజుకు 3,00,000 పైగా ఫుడ్ డెలివరీ ఆర్డర్లు వస్తున్నాయి. ఇక డైలీ నింజా రోజుకు 25,000 ఆర్డర్లను, రెయిన్క్యాన్ రోజుకు 10,000 ఆర్డర్లను, మిల్క్‌బాస్కెట్ రోజుకు 8,000 ఆర్డర్లను, సూపర్ డైలీ రోజుకు 5,000 ఆర్డర్లను పొందుతున్నాయి. మరొకవైపు గ్రోఫర్స్ జనవరిలో సబ్స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇక బిగ్‌బాస్కెట్ ఈ ఏడాది 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇటీవలే 100 మిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 200 మిలియన్ డాలర్లను సమీకరించడానికి చర్చలు జరుపుతోంది. -
వెయ్యి స్టోర్లు.. 500 కోట్ల ఆదాయం
ముంబై: ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌కి చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ శ్రీశ్రీ తత్వ... తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్లైన్లో పరిమిత స్థాయిలో ఉన్న లావాదేవీలను మరింత పెంచుకునేందుకు ఆన్లైన్ రిటైల్ సంస్థ బిగ్‌బాస్కెట్‌తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ఏడాది ఆఖరుకల్లా 1,000 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ అరవింద్ వర్చస్వి తెలిపారు. ఫ్రాంచైజీ విధానంలో ప్రారంభించే ఈ స్టోర్స్ కోసం ఫ్రాంచైజీ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీశ్రీ తత్వ మార్ట్, శ్రీశ్రీ తత్వ వెల్నెస్ ప్లేస్, శ్రీశ్రీ తత్వ హోమ్ అండ్ హెల్త్ పేరిట మూడు రకాల స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అరవింద్ తెలిపారు. మార్ట్‌లో ఆహారోత్పత్తులు, హోమ్ కేర్ ఉత్పత్తులు ఉంటాయని, వెల్నెస్ ప్లేస్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులతో పాటు హెల్త్‌కేర్ నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారాయన. ఇక, హోమ్ అండ్ హెల్త్ బ్రాండ్ స్టోర్స్‌లో రోజువారీ ఉపయోగించే అన్ని ఉత్పత్తులు, ఔషధాలతో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా ఉంటారని తెలియజేశారు. కంపెనీ ప్రస్తుతం 33 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఈ ఏడాది ప్రధానంగా లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, రష్యా, తూర్పు యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ తెలియజేశారు. యోగా గురు రాందేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా.. పలు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్కెట్లో పేటీఎంకు మైనారిటీ వాటా?
రూ.1,300 కోట్ల పెట్టుబడులపై చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ (కిరాణా సరుకులు) రిటైలింగ్ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో పేటీఎం మైనారిటీ వాటా తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (రూ.1,300 కోట్లు) ఉండొచ్చని సమాచారం. చర్చలు మొదలయ్యాయని, వచ్చే కొన్ని వారాల్లో డీల్ ఖరారవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశాయి. బిగ్‌బాస్కెట్‌లో పెట్టుబడులతో ఈ కామర్స్‌లో పేటీఎం మరింత బలోపేతం అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొన్నాయి. కాగా, ఇది పూర్తిగా నిజం కాదని బిగ్‌బాస్కెట్ స్పష్టం చేయగా, పేటీఎం స్పందించేందుకు నిరాకరించింది. అమెజాన్, బిగ్‌బాస్కెట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని లోగడ వార్తలు వచ్చాయి. ఆన్లైన్ గ్రాసరీ విక్రయాలను పేటీఎం, అమెజాన్ ఇప్పటికే తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రారంభించాయి కూడా. -
అమెజాన్ చేతికి బిగ్ బాస్కెట్?
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారత్‌లో మరింత విస్తరణ పథకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ఇండియాలో ఆన్ లైన్ మార్కెటింగ్ మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్న అమెజాన్ ఆన్లైన్ కిరాణా వెబ్సైట్ బిగ్‌బాస్కెట్.కామ్‌ను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ కొనుగోలుకు సంబంధించిన చర్చలు చాలా ప్రాథమిక స్థాయిలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులను ఉటంకిస్తూ మీడియాలో కథనలు వెలువడుతున్నాయి. అమెజాన్ తన మార్కెట్ వాటాను ఏకీకృతం చేసే కృషిలో భాగంగా బిగ్ బాస్కెట్‌పై కన్నేసినట్టు తెలుస్తోంది. అమెజాన్ ఆన్లైన్ లో ఆహారాన్ని, కిరాణా అమ్మకాలపై యోచిస్తోంది. ఈ మేరకు దాని ఉత్పత్తిలో ఆఫర్లను పెంచుతుంది. ఈ రిటైల్ ట్రేడింగ్ లైసెన్స్ కోసం భారత ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ పథకాన్ని త్వరలో మంజూరు చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్లో పేర్కొంది. అయితే అమెజాన్ ఆసక్తి చూపినప్పటికీ, బిగ్‌బాస్కెట్ విక్రయానికి అంగీకరించకపోవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్కెట్ ఇప్పటికే గత ఏడాది $ 150 మిలియన్ డాలర్లను నిధులను పొందింది. దీంతోపాటు ఈ ఏడాది మార్చ్ నెలలో వారు తిరిగి రూ. వడ్డీ రుణంలో 45 కోట్ల డెలివరీ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుంది. ఈక్రమంలో కొత్త గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్కెట్ ప్రతినిధి ఈ పుకార్లు నిజం కాదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ వార్తలపై అమెజాన్ ప్రతినిధి నిరాకరించడం విశేషం. -
బిగ్ బాస్కెట్‌పై అమెజాన్ కన్ను!
ప్రాథమిక స్థాయిలో చర్చలు న్యూఢిల్లీ: అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నిత్యావసర సరుకుల విక్రయ ఆన్లైన్ సంస్థ బిగ్‌బాస్కెట్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇవి ఫలవంతం కావొచ్చు లేక కాకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూపర్‌మార్కెట్ గ్రాసరీ సప్లైస్ సంస్థలో భాగమైన బిగ్‌బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన అబ్రాజ్ గ్రూప్, హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన ఇన్వెస్టర్ల నుంచి గతేడాది 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. కొత్తగా గిడ్డంగుల ఏర్పాటుకు, డెలివరీ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ట్రైఫెక్టా క్యాపిటల్ నుంచి మరో 7 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆదాయాలు గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న బిగ్‌బాస్కెట్ ఇప్పటికే రెండు నగరాల్లో బ్రేక్ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ భారత్‌లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీనం!
♦ విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి? ♦ 800 డాలర్ల విలువను ఆశిస్తున్న బిగ్‌బాస్కెట్ ♦ గ్రోఫర్స్ వేల్యుయేషన్.. 150–200 మి.డాలర్లు! ♦ చర్చలు మొదలు; ఏకాభిప్రాయంతోనే డీల్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిత్యావసర సరుకుల ఆన్లైన్ సంస్థలు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీన ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే గ్రోఫర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్... కొత్తగా ఏర్పడే విలీన సంస్థలో సుమారు 60–100 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని సమాచారం. మరోవంక బిగ్‌బాస్కెట్ కూడా గ్రోఫర్స్‌తో చర్చల నేపథ్యంలో తమకు కనీసం 700–800 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లభిస్తుందని భావిస్తోంది. గ్రోఫర్స్ విలువ 150–200 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఇరుపక్షాలు ఈ డీల్‌పై ఆసక్తిగానే ఉన్నట్లు వివరించాయి. ఒప్పందం గానీ కుదిరితే... విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, వేల్యుయేషన్స్‌పై అంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. బిగ్‌బాస్కెట్ కథ ఇదీ .. అబ్రాజ్ గ్రూప్, బెసీమర్ వెంచర్ పార్ట్నర్స్, శాండ్స్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బిగ్‌బాస్కెట్ ఇప్పటిదాకా 220 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సుమారు 450–500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గతేడాది మార్చిలో బిగ్‌బాస్కెట్ 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్ డాలర్ల మేర వ్యయాల భారం ఉంటున్న బిగ్‌బాస్కెట్ .. మరిన్ని నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే... వాల్–మార్ట్ స్టోర్స్, అమెజాన్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో మరిన్ని పెట్టుబడుల కోసం చర్చలు జరిపింది. కానీ వీటిలో పురోగతేమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్ విలీనం ద్వారా... అందులో ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు రాబట్టడంపై బిగ్‌బాస్కెట్ దృష్టి పెట్టినట్లు వివరించాయి. గ్రోఫర్స్ నెలవారీ వ్యయాలు 2 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. సంస్థ దగ్గర 50–60 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని అంచనా. గ్రోఫర్స్ కహానీ.. స్థానికంగా ఇరుగుపొరుగు నిత్యావసర సరుకుల వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు తీసుకుని.. వినియోగదారులకు డెలివరీ చేసే హైపర్‌లోకల్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ సంస్థగా 2013 డిసెంబర్లో గ్రోఫర్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. డెలివరీ ఫీజు కింద ఆర్డరు మొత్తంలో సింగిల్ డిజిట్ కమీషన్ తీసుకునేది. అయితే, వచ్చే కమీషన్ కన్నా డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటుండటంతో గడిచిన ఎనిమిది నెలల్లో గ్రోఫర్స్ క్రమంగా హైపర్‌లోకల్ విధానం నుంచి ఇన్వెంటరీ, అధిక మార్జిన్స్ ఉండే ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపార విధానాలవైపు మళ్లుతోంది. ఫ్రెష్బరీ, బెస్ట్ వేల్యూ పేరిట స్నాక్స్ మొదలైనవాటిని విక్రయిస్తోంది. గ్రోఫర్స్ ఇప్పటిదాకా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌బ్యాంక్ తదితర సంస్థల నుంచి 165 మిలియన్ డాలర్లు సమీకరించింది. చివరిసారిగా 2015 అక్టోబర్‌లో సుమారు 350–400 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గ్రోఫర్స్ 120 మిలియన్ డాలర్లు సమీకరించింది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వ్యాపార విధానాలు దాదాపు ఒకే తరహాలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పెట్టుబడులు దక్కించుకోగలగడం ఒక్కటే బిగ్‌బాస్కెట్‌కి ప్రయోజనకర అంశమని పేర్కొన్నాయి. నష్టాల్లోనే ఇరు కంపెనీలు.. బిగ్‌బాస్కెట్‌కి ఫ్రెషో, రాయల్, టేస్టీస్, హ్యాపీషెఫ్ తదితర సొంత బ్రాండ్స్ ఉన్నాయి. మార్చి ఆఖరు నాటికి తమ ఆదాయంలో 45 శాతం వాటా .. ప్రైవేట్ లేబుల్స్దే ఉండగలదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వూ్యలో బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ చెప్పారు. 2016–17లో సుమారు రూ. 1,800–2,000 కోట్ల ఆదాయం సాధించాలని బిగ్‌బాస్కెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిగ్‌బాస్కెట్ రూ. 580 కోట్ల ఆదాయంపై రూ. 278 కోట్ల నష్టం, గ్రోఫర్స్ మాత్రం రూ.14.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.225 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వెల్లడించింది.