న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్‌లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment