బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ విలీనం! | India's BigBasket in talks for possible merger with Grofers India | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ విలీనం!

Published Thu, Apr 20 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ విలీనం!

బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ విలీనం!

విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌ 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి?
800 డాలర్ల విలువను ఆశిస్తున్న బిగ్‌బాస్కెట్‌
గ్రోఫర్స్‌ వేల్యుయేషన్‌.. 150–200 మి.డాలర్లు!
చర్చలు మొదలు; ఏకాభిప్రాయంతోనే డీల్‌  


న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిత్యావసర సరుకుల ఆన్‌లైన్‌ సంస్థలు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ విలీన ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డీల్‌ సాకారమైతే గ్రోఫర్స్‌ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌... కొత్తగా ఏర్పడే విలీన సంస్థలో సుమారు 60–100 మిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేయొచ్చని సమాచారం.

మరోవంక బిగ్‌బాస్కెట్‌ కూడా గ్రోఫర్స్‌తో చర్చల నేపథ్యంలో తమకు కనీసం 700–800 మిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ లభిస్తుందని భావిస్తోంది. గ్రోఫర్స్‌ విలువ 150–200 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఇరుపక్షాలు ఈ డీల్‌పై ఆసక్తిగానే ఉన్నట్లు వివరించాయి. ఒప్పందం గానీ కుదిరితే... విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, వేల్యుయేషన్స్‌పై అంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.

బిగ్‌బాస్కెట్‌ కథ ఇదీ ..
అబ్రాజ్‌ గ్రూప్, బెసీమర్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, శాండ్స్‌ క్యాపిటల్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి బిగ్‌బాస్కెట్‌ ఇప్పటిదాకా 220 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. సుమారు 450–500 మిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో గతేడాది మార్చిలో బిగ్‌బాస్కెట్‌ 150 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్‌ డాలర్ల మేర వ్యయాల భారం ఉంటున్న బిగ్‌బాస్కెట్‌ .. మరిన్ని నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఇప్పటికే... వాల్‌–మార్ట్‌ స్టోర్స్, అమెజాన్, టెన్సెంట్‌ హోల్డింగ్స్, ఫోసన్‌ ఇంటర్నేషనల్‌ తదితర సంస్థలతో మరిన్ని పెట్టుబడుల కోసం చర్చలు జరిపింది. కానీ వీటిలో పురోగతేమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్‌ విలీనం ద్వారా... అందులో ఇన్వెస్టర్‌ సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి నిధులు రాబట్టడంపై బిగ్‌బాస్కెట్‌ దృష్టి పెట్టినట్లు వివరించాయి. గ్రోఫర్స్‌ నెలవారీ వ్యయాలు 2 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా.. సంస్థ దగ్గర 50–60 మిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నాయని అంచనా.

గ్రోఫర్స్‌ కహానీ..
స్థానికంగా ఇరుగుపొరుగు నిత్యావసర సరుకుల వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు తీసుకుని.. వినియోగదారులకు డెలివరీ చేసే హైపర్‌లోకల్‌ గ్రాసరీ డెలివరీ స్టార్టప్‌ సంస్థగా 2013 డిసెంబర్‌లో గ్రోఫర్స్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. డెలివరీ ఫీజు కింద ఆర్డరు మొత్తంలో సింగిల్‌ డిజిట్‌ కమీషన్‌ తీసుకునేది. అయితే, వచ్చే కమీషన్‌ కన్నా డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటుండటంతో గడిచిన ఎనిమిది నెలల్లో గ్రోఫర్స్‌ క్రమంగా హైపర్‌లోకల్‌ విధానం నుంచి ఇన్వెంటరీ, అధిక మార్జిన్స్‌ ఉండే ప్రైవేట్‌ బ్రాండ్స్‌ వ్యాపార విధానాలవైపు మళ్లుతోంది.

ఫ్రెష్‌బరీ, బెస్ట్‌ వేల్యూ పేరిట స్నాక్స్‌ మొదలైనవాటిని విక్రయిస్తోంది. గ్రోఫర్స్‌ ఇప్పటిదాకా టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌బ్యాంక్‌ తదితర సంస్థల నుంచి 165 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. చివరిసారిగా 2015 అక్టోబర్‌లో సుమారు 350–400 మిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో గ్రోఫర్స్‌ 120 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ వ్యాపార విధానాలు దాదాపు ఒకే తరహాలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పెట్టుబడులు దక్కించుకోగలగడం ఒక్కటే బిగ్‌బాస్కెట్‌కి ప్రయోజనకర అంశమని పేర్కొన్నాయి.

నష్టాల్లోనే ఇరు కంపెనీలు..
బిగ్‌బాస్కెట్‌కి ఫ్రెషో, రాయల్, టేస్టీస్, హ్యాపీషెఫ్‌ తదితర సొంత బ్రాండ్స్‌ ఉన్నాయి. మార్చి ఆఖరు నాటికి తమ ఆదాయంలో 45 శాతం వాటా .. ప్రైవేట్‌ లేబుల్స్‌దే ఉండగలదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వూ్యలో బిగ్‌బాస్కెట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్‌ చెప్పారు. 2016–17లో సుమారు రూ. 1,800–2,000 కోట్ల ఆదాయం సాధించాలని బిగ్‌బాస్కెట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిగ్‌బాస్కెట్‌ రూ. 580 కోట్ల ఆదాయంపై రూ. 278 కోట్ల నష్టం, గ్రోఫర్స్‌ మాత్రం రూ.14.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.225 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు రీసెర్చ్‌ సంస్థ టోఫ్లర్‌ వెల్లడించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement