భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!! | E-tailers, startups plan to go big on hiring delivery staff | Sakshi
Sakshi News home page

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

Published Fri, Apr 19 2019 4:45 AM | Last Updated on Fri, Apr 19 2019 5:24 AM

E-tailers, startups plan to go big on hiring delivery staff - Sakshi

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్‌ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్‌ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్‌ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్‌ఆర్‌ సంస్థ రాండ్‌స్టాండ్‌ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది.  

విస్తరణపై భారీగానే ఖర్చు
ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్‌ ఇండియా ఎండీ పౌల్‌ డుపియస్‌ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్‌ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌ గ్రోఫర్స్‌... సాఫ్ట్‌ బ్యాంకు విజన్‌ ఫండ్‌ ద్వారా గత నెలలో 60 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్‌ అంకుష్‌ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్‌ కూడా మరో 150 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్‌ హెచ్‌ఆర్‌ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్‌ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్‌లాక్‌ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది.

జోమాటో జోరు...
ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్‌ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్‌ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్‌ బన్సాల్‌ తెలిపారు. మిల్క్‌ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement