Grofers
-
ఎంత పని చేశార్రా..! జోమోటో పేరును మార్చేశారుగా..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గ్రాసరీ సేవలను అందించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బ్లింకిట్(గ్రోఫర్స్)ను పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు జొమాటో సిద్దమైంది. ఆల్స్టాక్ డీల్లోభాగంగా ఇప్పటికే ఇరు కంపెనీల వీలిన ఒప్పందంపై చర్చలు పూర్తిగా సఫలం అయ్యాయి. ఈ డీల్ విలువ సుమారు 700 నుంచి 800 మిలియన్ డాలర్లు ఉండనుంది. అయితే జొమాటో, బ్లింకిట్ కంపెనీల వీలిన ఒప్పందంపై నెటిజన్లు ట్విటర్లో జోకులు వేసుకుంటున్నారు. కొత్త పేరు..! కొంత మంది నెటిజన్లు.. ఇరు కంపెనీల వీలినంపై సరదాగా ‘జోమాటో+బ్లింకిట్= జాంబి’ అంటూ కొత్త పేరును సూచిస్తున్నారు. మరొక నెటిజన్ తన ట్విట్లో.. ఇకపై జొమాటో 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ చెప్పుకొచ్చాడు. ఈవిధంగా నెటిజన్లు రకరకాలుగా ఇరు కంపెనీల వీలినంపై ట్విటర్లో నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు. Zomato and Blinkit to merge New name could be.... ZomBihttps://t.co/SUQ5XERVze — MachaZ (@Maaachaaa69) March 15, 2022 Now we can get food delivered in 10 minutes!!!🤨#ZomatoBlinkitMerger#zomato #blinkit — Bharat (@BharatLalwani94) March 15, 2022 Meanwhile, @YatinMota sending me merger jokes on WhatsApp Zomato and Blinkit to merge Hope, they call themselves ZomBi🙈 — Chandra R. Srikanth (@chandrarsrikant) March 15, 2022 ఇన్వెస్టర్లకు వాటాలు..! ఆల్ స్టాక్ డీల్ భాగంగా బ్లింకిట్లోని ఇన్వెస్టర్లు జొమాటోలో వాటాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ 60 రోజుల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం ఉంది.గత ఏడాది జొమాటో నుంచి బ్లింకిట్ భారీ పెట్టుబడులను సేకరించింది. దీంతో బ్లింకిట్ యూనికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. 2021 ఆగస్టులో బ్లింకిట్‌లో సుమారు 9.3 శాతం వాటాలను 100 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకుంది. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇక పూర్తిగా -
జొమాటో సంచలన నిర్ణయం..! ఇక పూర్తిగా..
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకొనుంది. ఆల్ స్టాక్ డీల్‌లో భాగంగా ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న బ్లింకిట్(గ్రోఫర్స్)ను పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు జొమాటో సిద్దమైనట్లు తెలుస్తోంది. చర్చలు సఫలం..! వీలినం ఒప్పందంపై ఇరు కంపెనీల మధ్య చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల క్విక్ కామర్స్ స్టార్ట్-అప్ బ్లింకిట్ ఫుడ్ డెలివరీ యూనికార్న్ జొమాటోతో విలీన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ డీల్ విలువ సుమారు 700-800 మిలియన్ డాలర్ల మధ్య ఉండనుంది. ఈ డీల్‌తో బ్లింకిట్లోని ఇన్వెస్టర్లు జొమాటోలో వాటాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 60 రోజుల వ్యవధిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. గత ఏడాది జొమాటో నుంచి బ్లింకిట్ భారీ పెట్టుబడులను సేకరించింది. దీంతో బ్లింకిట్ యూనికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. 2021 ఆగస్టులో బ్లింకిట్‌లో సుమారు 9.3 శాతం వాటాలను 100 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..! -
సెప్టెంబర్ 17 నుంచి జొమాటోలో ఆ సేవలు బంద్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో తన కిరాణా డోర్ డెలివరీ సేవలను సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి ఆశించినంత రీతిలో స్పందన రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గ్రోఫర్స్ సంస్థ ఇతర కిరాణా సంస్థల కంటే మెరుగైన ఫలితాలను సృష్టిస్తుందని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది.(చదవండి: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రికల్ వెహికల్) జొమాటో తన కిరాణా భాగస్వాములకు ఒక ఈ-మెయిల్ లో ఇలా పేర్కొంది.. "జొమాటో మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, మా వ్యాపార భాగస్వాములకు మరిన్ని లాభాలను అందించాలని మేము ఆశించాము. మా కస్టమర్లకు, మర్చంట్ భాగస్వాముల ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి ప్రస్తుత మోడల్ అత్యుత్తమ మార్గం కాదని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల, మా పైలట్ కిరాణా డెలివరీ సేవలను 17 సెప్టెంబర్, 2021 నుంచి నిలిపివేయాలని మేం భావిస్తున్నాం'' అని పేర్కొంది. దీని గురుంచి జొమాటో ప్రతినిధిని సంప్రదించినప్పుడు.. "మేము మా కిరాణా పైలట్ మూసివేయాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతానికి మా ప్లాట్ ఫారమ్ పై కిరాణా డెలివరీ సేవలు అందించడానికి ప్రణాళికలు లేవు. గ్రోఫర్స్ 10 నిమిషాలలో కిరాణాలను అందిస్తూ మార్కెట్లో మొదటి స్థానంలో ఉంది" అని అన్నారు. కిరాణా డెలివరీ ఫ్లాట్ ఫారం గ్రోఫర్స్ లో మైనారిటీ వాటాను పొందడానికి 100 మిలియన్ డాలర్లు (సుమారు ₹745 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ఇంతకు ముందు జొమాటో పేర్కొంది. -
పేటీఎం- గ్రోఫర్స్ డీల్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పుష్!
జియోమార్ట్ ద్వారా ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్లోకి డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించడంతో ఈకామర్స్ కంపెనీలలో కన్సాలిడేషన్‌కు మార్గమేర్పడవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కోవిడ్-19 సమస్యతో ఇటీవల ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, స్పెన్సర్స్ వంటి కంపెనీలకుతోడు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితరాలు సైతం ఈకామర్స్ ద్వారా గ్రోసరీస్ విక్రయాలను చేపడుతున్నాయి. కాగా.. ఆన్లైన్ రిటైలర్ పేటీఎంతోపాటు.. గ్రోఫర్స్‌లోనూ పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ బిజినెస్‌లో పోటీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేటీఎం, గ్రోఫర్స్ మధ్య విలీనం లేదా డీల్ కుదరితే ప్రయోజనకరంగా ఉంటుందని సాఫ్ట్‌బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య చర్చలకు తెరతీసినట్లు సంబంధివర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు ఇలా జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అటు పేటీఎం మాల్, ఇటు గ్రోఫర్స్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. వెరసి ఈ రెండు కంపెనీలలో తాజాగా ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలనూ అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ద్వారా పేటీఎం మాల్లో 20 శాతం వాటాను సాఫ్ట్‌బ్యాంక్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ ద్వారా గ్రోఫర్స్లో 40 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈకామర్స్ రిటైలర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న పేటీఎం, ఆన్లైన్ గ్రోసరీస్ విక్రేత అయిన గ్రోఫర్స్ మధ్య డీల్ కుదిరితే రెండు కంపెనీలకూ ప్రయోజనం చేకూరడంతోపాటు.. పెట్టుబడులు వృద్ధి చెందే వీలున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ ఆశిస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక డీల్‌కు తెరతీసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్లో అలీబాబాకు 35 శాతం వాటా ఉంది. సైఫ్ పార్టనర్స్, ఈబే, సీఈవో విజయ్ శంకర్ శర్మ సైతం వాటాలను కలిగి ఉన్నారు. కాగా.. మరోపక్క మిల్క్ డెలివరీ స్టార్టప్ మిల్క్ బాస్కట్‌లో పెట్టుబడికి పేటీఎం మాల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలను సైతం జత చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మిల్క్ బాస్కట్‌లో కలారీ కేపిటల్, మేఫీల్డ్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఊహాజనితాలు గ్రోఫర్స్‌తో డీల్ లేదా రెండు కంపెనీల మధ్య విలీనం వంటి అంచనాలను పేటీఎం మాల్ ప్రతినిధి ఒకరు తోసిపుచ్చారు. ఇక కంపెనీలో పేటీఎం మాల్ పెట్టుబడి వంటి అంశాలన్నీ ఊహాజనితాలని గ్రోఫర్స్ వ్యాఖ్యానించింది. ఇలాంటి అంచనాలపై తాము స్పందించబోమంటూ పేర్కొంది. -
ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ హైజంప్!
దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పలు రంగాలు డీలాపడినప్పటికీ.. ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ మాత్రం జోరందుకుంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ అమలు చేస్తున్న నేపథ్యంలో హోమ్ డెలివరీలు చేసే ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ తదితర సంస్థల బిజినెస్ ఊపందుకుంది. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ 76 శాతం జంప్‌చేయనున్నట్లు ఫారెస్టర్ రీసెర్చ్ తాజాగా అభిప్రాయపడింది. వెరసి 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,500 కోట్లు)ను తాకనున్నట్లు అంచనా వేసింది. దేశవ్యాప్త లాక్‌డవున్ కారణంగా ఈకామర్స్ బిజినెస్‌కు 1.3 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు ఫారెస్టర్ అంచనా వేసింది. దీంతో తొలుత వేసిన 2 బిలియన్ డాలర్ల ఆన్లైన్ గ్రోసరీస్ బిజినెస్ 3 బిలియన్ డాలర్లను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలు సైతం వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులను అందిస్తున్న విషయం విదితమే. 35.5 బిలియన్ డాలర్లకు ఈఏడాది దేశీయంగా మొత్తం ఈకామర్స్ బిజినెస్ 6 శాతం వృద్ధితో 35.5 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా. అయితే గత ఆరు వారాలుగా ఈకామర్స్ బిజినెస్‌లో నమోదైన అధిక డిమాండ్ కొనసాగకపోవచ్చని ఫారెస్టర్ రీసెర్చ్ పేర్కొంది. లాక్‌డవున్ తొలి రోజుల్లో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి కంపెనీలకు ఐదు రెట్లు అధికంగా ఆర్డర్లు లభించినప్పటికీ ఇటీవల నెమ్మదించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే మరికొంతకాలంపాటు ఈకామర్స్ బిజినెస్‌లో అమ్మకాల పరిమాణం అధికంగానే నమోదయ్యే వీలున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 35 శాతం అధికంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మీనన్ పేర్కొన్నారు. కోవిడ్-19కు ముందు బిజినెస్‌తో పోలిస్తే లాక్‌డవున్ కాలంలో 60 శాతం అధిక విలువగల ఆర్డర్లు లభించినట్లు గ్రోఫర్స్ సీఈవో అల్వీందర్ తెలియజేశారు. -
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
ఆన్లైన్ కిరాణా.. నువ్వానేనా!
మార్కెట్లో పట్టు కోసం ఈ కామర్స్ సంస్థల పెట్టుబడి అస్త్రాలు ► గ్రోఫర్స్లో వాటాపై అమెజాన్ ఆసక్తి ► ఎంట్రీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నద్ధం ► అండగా సాఫ్ట్ బ్యాంకు నిధులు ► ఇప్పటికే బిగ్ బాస్కెట్లోకి పేటీఎం ఎంట్రీ న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. భారీ మార్కెట్ అవకాశాల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎంలు ఈ విభాగంలో పట్టు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రోఫర్స్లో మైనారిటీ వాటా పొందేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఆసక్తితో ఉంది. ఆన్లైన్ గ్రోసరీ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో వాటా తీసుకోవాలని అమేజాన్ ప్రయత్నించినప్పటికీ చర్చలు సఫలీకృతం కాలేదు. దీంతో సాఫ్ట్‌బ్యాంకు మద్దతు గల గ్రోఫర్స్లో వాటా తీసుకునే యోచనతో అమెజాన్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు బిగ్ బాస్కెట్లో చైనాకు చెందిన అలీబాబా గ్రూపు ఏకంగా 200 మిలియన్ డాలర్ల (రూ.1,280 కోట్లు)ను పేటీఎం మాల్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమేజాన్ నుంచి తాజా పెట్టుబడులు వస్తే గ్రోసరీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. గ్రోఫర్స్లో ఇన్వెస్టర్లు అయిన జపాన్ సాఫ్ట్ బ్యాంకు, టైగర్ గ్లోబల్ ఆశ్చర్యంగా ఫ్లిప్‌కార్ట్ లోనూ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లోకి ఇటీవలే సాఫ్ట్‌బ్యాంకు 2.5 బిలియన డాలర్ల (రూ.16,000 కోట్లు)ను విజన్ ఫండ్ ద్వారా పంప్ చేసింది. ఈ నిధుల ప్రోత్సాహంతో దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఆన్లైన్ గ్రోసరీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, గ్రోఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం కూడా నడుస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్లోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు అమెజాన్ 100 మిలియన్ డాలర్లు (రూ.690 కోట్లు) మేర ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో ఉందని తెలుస్తోంది. కాగా, గ్రోఫర్స్లో వాటాల విషయమై గతంలో ఆ సంస్థతో పేటీఎం సైతం చర్చలు నిర్వహించింది. కానీ, ముందడుగు పడలేదు. ఊరిస్తున్న భారీ అవకాశాలు... మన దేశంలో మొత్తం మీద గ్రోసరీ, ఆహార (ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు సైతం) మార్కెట్ 400 బిలియన్ డాలర్లు (రూ.25.60లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో వ్యవస్థీకృత రిటైలర్ల వాటా 5 శాతంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్ అధ్యయనం ఆధారంగా తెలుస్తోంది. అంటే ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బిగ్ బాస్కెట్ 2017లో రూ.1,400 కోట్ల అమ్మకాలను సాధించగా, గ్రోఫర్స్ సైతం ఇటీవలే తాము నెలవారీ విక్రయాలు రూ.65 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. వార్షిక విక్రయాలు రూ.760 కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది. బిగ్ బాస్కెట్ 16–18 శాతం మార్జిన్‌తో, గ్రోఫర్స్ 12 శాతం మార్జిన్‌తో నడుస్తున్నాయి. గ్రోసరీ విభాగంలో అమెజాన్ నౌ, అమెజాన్ ప్యాంట్రీ పేరుతో గత రెండేళ్లుగా కార్యకలాపాలు నడుపుతోంది. 2015లో గ్రోఫర్స్ సంస్థ గ్రోసరీలో హైపర్ లోకల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించగా, భారీ మార్కెట్ అవకాశాలున్నాయనే అంచనాలతో ఈ సంస్థలోకి పెట్టుబడులు వచ్చి పడ్డాయి. గతేడాది దీపావళి సమయంలో అమెజాన్ ఈ మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. రెట్టింపు అమ్మకాలు నిర్వహించింది. అంతకు కొన్ని నెలల ముందే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టడంతో చందాదారులు అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీంతో అధిక విక్రయాలు సాధ్యమయ్యాయి. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు ఉచిత షిప్పింగ్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్కెట్లోకి పేటీఎం ఎంట్రీ, సాఫ్ట్‌బ్యాంకు ఫండింగ్‌తో ఫ్లిప్‌కార్ట్ సైతం ఈ మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటికితోడు అమెజాన్ తాజా ప్రణాళికలతో మున్ముందు ఈ గ్రోసరీ మార్కెట్ మరింత పోటీని సంతరించుకోనుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీనం!
♦ విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి? ♦ 800 డాలర్ల విలువను ఆశిస్తున్న బిగ్‌బాస్కెట్ ♦ గ్రోఫర్స్ వేల్యుయేషన్.. 150–200 మి.డాలర్లు! ♦ చర్చలు మొదలు; ఏకాభిప్రాయంతోనే డీల్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిత్యావసర సరుకుల ఆన్లైన్ సంస్థలు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీన ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే గ్రోఫర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్... కొత్తగా ఏర్పడే విలీన సంస్థలో సుమారు 60–100 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని సమాచారం. మరోవంక బిగ్‌బాస్కెట్ కూడా గ్రోఫర్స్‌తో చర్చల నేపథ్యంలో తమకు కనీసం 700–800 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లభిస్తుందని భావిస్తోంది. గ్రోఫర్స్ విలువ 150–200 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఇరుపక్షాలు ఈ డీల్‌పై ఆసక్తిగానే ఉన్నట్లు వివరించాయి. ఒప్పందం గానీ కుదిరితే... విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, వేల్యుయేషన్స్‌పై అంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. బిగ్‌బాస్కెట్ కథ ఇదీ .. అబ్రాజ్ గ్రూప్, బెసీమర్ వెంచర్ పార్ట్నర్స్, శాండ్స్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బిగ్‌బాస్కెట్ ఇప్పటిదాకా 220 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సుమారు 450–500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గతేడాది మార్చిలో బిగ్‌బాస్కెట్ 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్ డాలర్ల మేర వ్యయాల భారం ఉంటున్న బిగ్‌బాస్కెట్ .. మరిన్ని నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే... వాల్–మార్ట్ స్టోర్స్, అమెజాన్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో మరిన్ని పెట్టుబడుల కోసం చర్చలు జరిపింది. కానీ వీటిలో పురోగతేమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్ విలీనం ద్వారా... అందులో ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు రాబట్టడంపై బిగ్‌బాస్కెట్ దృష్టి పెట్టినట్లు వివరించాయి. గ్రోఫర్స్ నెలవారీ వ్యయాలు 2 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. సంస్థ దగ్గర 50–60 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని అంచనా. గ్రోఫర్స్ కహానీ.. స్థానికంగా ఇరుగుపొరుగు నిత్యావసర సరుకుల వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు తీసుకుని.. వినియోగదారులకు డెలివరీ చేసే హైపర్‌లోకల్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ సంస్థగా 2013 డిసెంబర్లో గ్రోఫర్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. డెలివరీ ఫీజు కింద ఆర్డరు మొత్తంలో సింగిల్ డిజిట్ కమీషన్ తీసుకునేది. అయితే, వచ్చే కమీషన్ కన్నా డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటుండటంతో గడిచిన ఎనిమిది నెలల్లో గ్రోఫర్స్ క్రమంగా హైపర్‌లోకల్ విధానం నుంచి ఇన్వెంటరీ, అధిక మార్జిన్స్ ఉండే ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపార విధానాలవైపు మళ్లుతోంది. ఫ్రెష్బరీ, బెస్ట్ వేల్యూ పేరిట స్నాక్స్ మొదలైనవాటిని విక్రయిస్తోంది. గ్రోఫర్స్ ఇప్పటిదాకా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌బ్యాంక్ తదితర సంస్థల నుంచి 165 మిలియన్ డాలర్లు సమీకరించింది. చివరిసారిగా 2015 అక్టోబర్‌లో సుమారు 350–400 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గ్రోఫర్స్ 120 మిలియన్ డాలర్లు సమీకరించింది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వ్యాపార విధానాలు దాదాపు ఒకే తరహాలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పెట్టుబడులు దక్కించుకోగలగడం ఒక్కటే బిగ్‌బాస్కెట్‌కి ప్రయోజనకర అంశమని పేర్కొన్నాయి. నష్టాల్లోనే ఇరు కంపెనీలు.. బిగ్‌బాస్కెట్‌కి ఫ్రెషో, రాయల్, టేస్టీస్, హ్యాపీషెఫ్ తదితర సొంత బ్రాండ్స్ ఉన్నాయి. మార్చి ఆఖరు నాటికి తమ ఆదాయంలో 45 శాతం వాటా .. ప్రైవేట్ లేబుల్స్దే ఉండగలదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వూ్యలో బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ చెప్పారు. 2016–17లో సుమారు రూ. 1,800–2,000 కోట్ల ఆదాయం సాధించాలని బిగ్‌బాస్కెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిగ్‌బాస్కెట్ రూ. 580 కోట్ల ఆదాయంపై రూ. 278 కోట్ల నష్టం, గ్రోఫర్స్ మాత్రం రూ.14.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.225 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వెల్లడించింది. -
గ్రోఫర్స్‌తో యస్ బ్యాంక్ జట్టు
ఇంటి ముంగిట్లోకే రూ.2,000 నగదు న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో కస్టమర్లకు ఇంటి ముంగిట్లోకి నగదును తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ఈ–గ్రోసరీ సంస్థ ‘గ్రోఫర్స్’తో జతకట్టింది. ఆన్లైన్లో గ్రోఫర్స్ ద్వారా కిరాణా సరుకులు ఆర్డర్ ఇచ్చిన వారు వాటి డెలివరీతోపాటు రూ.2,000 వరకు నగదును పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది. ఏ బ్యాంక్ ఖాతాదారుడైనా ఈ సేవలు పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు ముంబై, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని వివరించింది. క్యాష్ పొందాలని భావించే వారు గ్రోఫర్స్లో కనీసం రూ.2,000తో కిరాణా సరుకులు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. సరుకులు ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఒక ప్రత్యేకమైన కోడ్ ద్వారా నగదు కావాలని విజ్ఞప్తి చేయాలని తెలిపింది. అప్పుడు సరుకులు తీసుకొని వచ్చే యస్ బ్యాంక్ పీఓఎస్ మెషీన్లను కలిగిన గ్రోఫర్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్ల డెబిట్ కార్డులను స్వైప్ చేసి వారికి నగదును అందజేస్తారని వివరించింది.