Delivery system
-
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
ఫుడ్ డెలివరీలోకి అమెజాన్
న్యూఢిల్లీ: అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్ నౌ యాప్ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. íస్విగ్గీ, జొమాటోలు డిస్కౌంట్లలో కోత పెట్టి, కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమెజాన్ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఈమధ్యే తమ ఉబెర్‌ఈట్స్ ఇండియాను జొమాటోకు విక్రయించేసిన సంగతి తెలిసిందే. సమగ్ర వ్యాపార వ్యూహం.. ‘ప్రైమ్’ పెయిడ్ చందాదారులకు.. నిత్యావసరాలు, ఆహారం మొదలుకుని ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా గృహావసరాల ఉత్పత్తుల శ్రేణిని కూడా అందించే వ్యూహంలో భాగంగానే అమెజాన్ ఈ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్ మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోదని.. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. చివర్లో వచ్చినా కూడా గెలవొచ్చన్నది ఆ సంస్థ సిద్ధాంతమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫుడ్ బిజినెస్‌నే అమెజాన్ ఎందుకు ఎంచుకున్నది వివరిస్తూ.. కన్జూమర్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యాపార విభాగాల్లో ఫుడ్ డెలివరీకి అత్యధికంగా ఆదరణ ఉంటుందని .. తర్వాత స్థానాల్లో నిత్యావసరాలు, ఎఫ్ఎంజీసీ, సాధారణ ఈ–కామర్స్ లావాదేవీలు ఉంటాయని ఓ ఇన్వెస్టర్ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేసే వారిని ఆకర్షించాలన్నది అమెజాన్ వ్యూహం. ప్రస్తుతానికి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను సొంత ఉద్యోగులకే అమెజాన్ అందిస్తోంది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్, బెల్లందూరు, హరలూరు, మరతహళ్లి, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. హోటళ్లతో ఒప్పందాలు .. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్, అమెజాన్ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన ప్రైవన్ బిజినెస్ సర్వీసెస్ సారథ్యంలో ఈ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ డైరెక్టర్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం) రఘు లక్కప్రగడ ఈ వ్యూహానికి సారథ్యం వహిస్తున్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ కమీషన్ కోట్ చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్లతో ప్రైవన్ బిజినెస్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. సుమారు 10–15 శాతం కమీషన్‌ను అమెజాన్ ప్రతిపాదిస్తోంది. స్విగ్గీ, జొమాటోలతో పోలిస్తే ఇది దాదాపు సగం. లాజిస్టిక్స్‌పై భారీగా పెట్టుబడులు ఫుడ్ డెలివరీ వ్యాపారం విజయవంతం కావాలంటే అమెజాన్ ఎక్కువగా లాజిస్టిక్స్, రెస్టారెంట్ వ్యవస్థ, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు. అలాగే, స్విగీ.. జొమాటోలను ఢీకొనాలంటే.. కొరియన్, జపనీస్ మొదలైన వంటకాలు కూడా అందించే రెస్టారెంట్లతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశముందని వివరించారు. ఇటీవలే 350 మిలియన్ డాలర్లతో ఉబెర్‌ఈట్స్‌ను జొమాటో కొనుగోలు చేసింది. అటు స్విగ్గీ కూడా ఇటీవలే ప్రస్తుత ఇన్వెస్టరు, దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్పర్స్ సారథ్యంలో మరికొందరు ఇన్వెస్టర్ల నుంచి సుమారు 113 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
కార్గో రవాణాకు ‘ఆన్లైన్’ దన్ను!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొనుగోలుదార్లను డిస్కౌంట్లతో ఆకర్షించడమే కాదు. వారు కొన్న వస్తువుల్ని వారికి భద్రంగా అందించటం కూడా కత్తిమీద సామే. అందుకే ఆన్లైన్ సంస్థలు ఇపుడు సరుకు రవాణా, కొరియర్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. దీంతో ఈ రెండు రంగాలూ ఒకదానికొకటి తోడవుతూ వేగంగా ఎదుగుతున్నాయి. ఈ తీరుతెన్నులపై ప్రత్యేక కథనమిది... దేశీయంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆర్డర్లను సకాలంలో కస్టమర్లకు చేర్చడమనేది దేశీ రిటైల్ సంస్థలకు సవాలుగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్డరు చేసిన 24 గంటల్లోగా ఇంటికి చేరవేస్తామంటూ ఆన్లైన్ సంస్థలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం సుమారు 2 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.12,500 కోట్లు) ఉంది. ఇది 2023 నాటికి 56 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.3.5 లక్షల కోట్లకు)చేరుతుందని అంచనా. సరుకు రవాణా కంపెనీలకు ఈ రంగం నుంచి 2021 నాటికి 5 బిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ.31 వేల కోట్లు) వ్యాపారం రాగలదని అంచనా. వచ్చే ఏడాదిలో తమ కంపెనీ ద్వారానే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలకు రూ.250 కోట్ల మేర వ్యాపారం రావచ్చని ఆన్లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ చెబుతోంది. అందుకే ఈ అవకాశాలు అందుకోవటానికి సరుకు రవాణా సంస్థలూ గట్టిగా కసరత్తు చేస్తున్నాయి. కొంగొత్త విధానాలు.. దిగ్గజాలతో పాటు డాట్‌జాట్, డెలివరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వంటి స్టార్టప్ లాజిస్టిక్స్ సంస్థలు ఆన్లైన్ రిటైల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా సర్వీసులను విస్తరిస్తున్నాయి. డాట్‌జాట్ ప్రత్యేకంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లు తమ ప్యాకేజీలను డెలివరీ తీసుకోవడంతో పాటు రిటర్న్ చేయాలన్నా ఈ కేంద్రాల్లో ఇచ్చేయొచ్చు. దేశీయంగా అతి పెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డీటీడీసీకి డాట్జాట్లో మెజార్టీ వాటా ఉంది. డీటీడీసీకి దేశవ్యాప్తంగా 5,200 పైగా ప్రాంతాల్లో నెట్వర్క్ ఉంది. కలెక్షన్, డెలివరీ కోసం డాట్‌జాట్.. డీటీడీసీ నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించుకుంటోంది. రోజుకు 12,000 పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల దాకా ఆదాయం ఆర్జించనున్న డాట్‌జాట్ 2016 నాటికి రూ.100 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక ఢిల్లీవరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు.. వేలకొద్దీ పార్సిళ్లను వేరు చేసే మెషీన్లతో గిడ్డంగులను ఏర్పాటు చేసి, కస్టమర్ల ఇంటి వద్దే ఆల్టరేషన్ సేవలు కూడా అందించడానికి కసరత్తు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకూ సత్వరం సేవలందించటంపై డాట్‌జాట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మల్టీ-యూజర్ గిడ్డంగులు ఏర్పాటు చేస్తోంది. విక్రేతల నుంచి ఆర్డర్లను పికప్ చేసుకుని, వాటి నిల్వ, ప్యాకింగ్ మొదలుకుని కస్టమరుకు రవాణా దాకా అన్ని సేవలూ అందించేందుకు డాట్‌జాట్ ప్రయత్నిస్తోంది. 59 నగరాల్లో సేవలందిస్తున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ .. భారీగా వచ్చే ఆర్డర్లను వేరు చేసేందుకు ఆటోమేషన్ విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. వీలైన సందర్భాల్లో ఆయా కంపెనీల ఆర్డర్లను ఆయా కంపెనీల యూనిఫాంలలోనే డెలివరీ బాయ్స్ అందించేలా చూస్తోంది. కాగా, ఆల్టరేషన్ సేవలు కూడా అందించేందుకు బెంగళూరుకు చెందిన ఒక ఫ్యాషన్ పోర్టల్‌తో చర్చలు జరుపుతోంది. దీని ప్రకారం సదరు డ్రెస్‌ను అందించిన తర్వాత కస్టమర్ దాన్ని ట్రయల్ చేసి చూసేదాకా డెలివరీ బాయ్ వేచి ఉంటాడు. ఒకవేళ కొలతల్లో ఏవైనా తేడాలుంటే.. స్వయంగా ప్రి-అప్రూవ్డ్ టైలర్ దగ్గరకు డ్రెస్‌ను తీసుకెళ్లి మార్పులు చేయించి కస్టమర్‌కి తిరిగి అందిస్తాడు. లాజిస్టిక్స్ దిగ్గజాల్లో ఒకటైన బ్లూడార్ట్ మాజీ ఉద్యోగులు ‘ఈకామ్ ఎక్స్‌ప్రెస్’ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్లో 1,300 మంది ఉద్యోగులుండగా... కొద్ది రోజుల్లో మరో 50 నగరాలకు సేవలు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. పటిష్టమైన వ్యవ స్థ.. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ లావాదేవీల్లో సింహభాగం (సుమారు 60%) క్యాష్ ఆన్ డెలివరీదే(ఆర్డరు చేతికి వచ్చాక నగదు చెల్లింపు) ఉంటోంది. ఇలాంటి లావాదేవీల్లో తప్పులు జరగకుండా చూసుకునేలా ఐటీ వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఢిల్లీవరీ వర్గాలు తెలిపాయి. బ్యాంకులతో కూడా కలసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2011లో ఏర్పాటైన ఢిల్లీవరీ ప్రస్తుతం 130 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. కంపెనీలో 3వేల పైచిలుకు ఉద్యోగులుండగా.. రోజుకు 50,000 పైగా ఆర్డర్లను చేరవేస్తోంది. అటు బ్లూడార్ట్, అరామెక్స్ వంటి భారీ సంస్థలు కూడా ఈకామర్స్ సైట్ల అవసరాల గురించి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాయి.