న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది.
సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్‌ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి.
ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం..
గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు..
► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి.
► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది.
► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment