remote control
-
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
నడ్డా రిమోట్ ఎక్కడుంది: ఖర్గే
బెల్గావీ (కర్నాటక): ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం మండిపడ్డారు. ‘‘నా రిమోట్ వేరెవరి దగ్గరో ఉందని మోదీ అంటున్నారు. సరే, ఒప్పుకుంటా. అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గరుందో కూడా ఆయనే చెబితే బాగుంటుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ దమ్మూ ధైర్యం లేని పార్టీ. మీ లోపాల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మాపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పితే బెదురుతామనుకుంటే అది మీ భ్రమ’’ అన్నారు. -
Bharat Jodo Yatra: ఖర్గే, థరూర్ ప్రజాదరణ ఉన్న నాయకులు
తురువెకెరే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్.. ఇద్దరూ ప్రజల్లో మంచి ఆదరణ, హోదా ఉన్న నాయకులేనని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌తో ఆడించడం ఖాయమంటూ విమర్శలు చేయడం దారుణమని, అది వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు జనాన్ని కుంగదీస్తున్నాయని వాపోయారు. అందుకే భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబం చెప్పినట్టల్లా ఆడాల్సిందేనంటూ కొందరు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు గల కారణాలను 2019లోనే తన రాజీనామా లేఖలో తెలియజేశానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం మన దేశ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించేలా ఉందన్నారు. విద్యను కేంద్రీకృతం చేయడం కాదు, వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, భాషలను ప్రతిబింబించే విద్యా విధానం కావాలన్నారు. దేశంలో విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేవారిపై పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. అధికారం కోసం కాదు తుమకూరు: భారత్ జోడో పాదయాత్ర 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాదని రాహుల్ చెప్పారు. మతం పేరుతో దేశాన్ని చీల్చడానికి బీజేపీ సాగిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆ పార్టీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక కులం, ఒక మతం కోసం పని చేయలేదని, దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని రాహుల్ చెప్పారు. తనను పనికిరానివాడు అని చిత్రీకరించడానికి బీజేపీ నాయకులు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. శనివారం రాహుల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచారు. పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. -
‘రిమోట్ కంట్రోల్’ అనడం వారిని అవమానించడమే: రాహుల్ గాంధీ
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారు ఎవరైనా ‘రిమోట్ కంట్రోల్’ గాంధీలదేనన్న విమర్శలు వస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీని ఈ అంశంపై ప్రశ్నించగా.. ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులకూ సమాజంలో వారికంటూ ఓ స్థానం ఉంది. ప్రజలను అర్థం చేసుకోగలిగే దృక్పథం, ప్రజల పట్ల అవగాహన ఉంది. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి రిమోట్ కంట్రోల్ అనడం అంటే వారిని అవమానించడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. మరోవైపు.. యాత్రలో తానొక్కడినే పాల్గొనడం లేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగిన లక్షల జనం భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసం ఈ యాత్ర కాదని, భాజపా- ఆరెస్సెస్ తీసుకొస్తున్న విభజన నుంచి ప్రజలను ఐక్యం చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వికేంద్రీకరణ విద్యావిధానం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘భారత్ అనేది రాష్ట్రాల సమూహం. దాని అర్థం మన భాషలు, రాష్ట్రాలు, సంప్రదాయాలకు సమానంగా ముఖ్యమైన స్థానం ఉంటుంది. అదే మన దేశ స్వభావం. హింస, విద్వేషాలను వ్యాప్తి చేయటం దేశ వ్యతిరేక చర్య. ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టేవారికి వ్యతిరేకంగా మేము పోరాడతాం.’ అని తెలిపారు. LIVE: Shri @RahulGandhi addresses media amid Karnataka leg of the #BharatJodoYatra. https://t.co/9yyDUrZwuZ — Congress (@INCIndia) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
నేనేం సోనియా రిమోట్‌ను కాను
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు. బీజేపీలోనే అలాంటి వ్యవస్థ ఉంది. కాంగ్రెస్‌లో సర్వామోదంతోనే అన్నీ జరుగుతాయి. ఒకవేళ నేను పార్టీ పగ్గాలు చేపడితే నా రిమోట్ కంట్రోల్ నా వద్దే ఉంటుంది. కాంగ్రెస్‌లో పార్టీ కమిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఉమ్మడి, సమష్టి నిర్ణయాలే అమలవుతాయి. రిమోట్ కంట్రోల్ భావన బీజేపీదే. మీలోని వాళ్లే ఇలాంటివి సృష్టిస్తారు’ అని బీజేపీ నేతలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీజేపీ అధ్యక్ష ఎన్నికలను ప్రధాని ఎన్నిసార్లు నిర్వహించారు? బీజేపీలో రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో అందరికీ తెలుసు. మీరా మాకు హితబోధ చేసేది?’ అని ఎదురుదాడికి దిగారు. ‘చీఫ్‌గా ఎన్నికైతే పార్టీలో సగం సంస్థాగతమైన పదవులు 50 ఏళ్లలోపు వారికి దక్కేలా కృషిచేస్తా. మహిళలు, యువత, దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తా. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను పరిరక్షిస్తూ, పటేల్ ఐక్యతా పిలుపును బలపరుస్తా’ అని అన్నారు. -
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ కాదు: భగవత్
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు. -
చిన్న రోబో.. పెద్ద సాయం!
బోస్టన్: సీరియస్‌గా చదువుతుండగా ఎవరో డోర్‌బెల్ కొట్టారు.. వెంటనే లేచి డోర్ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైన వెళ్లి తీస్తే బాగుండనిపిస్తుంది కదూ! అందుకే మీలాంటి వారి కోసమే ఓ రోబోను తయారు చేశామంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వారు అభివృద్ధి చేసిన ఎగిరే రోబో.. రిమోట్‌తో ఆదేశిస్తే చాలు సహాయకుడిలా అన్ని చేసేస్తుందంటున్నారు. డోర్ లాక్ తీసి తలుపును తెరుస్తుంది. అంతేకాదు, దాహం వేస్తే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్‌ను సైతం తీసుకొచ్చి చేతికందిస్తుంది. ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోలను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఫ్లైక్రో టగ్స్గా పిలిచే వీటిని తొలుత తొండలు, కీటకాల నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు. గోడలపై పాకుతూ బూజు తొలగించడం, ఫ్లోర్‌పై చెత్తను తీసేయడం లాంటివి చేసేవి. తాజాగా పక్షిలా ఎగిరేలా వీటికి రెక్కలు జోడించడంతో పాటు, వాటి బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా సాంకేతికత సాయంతో సామర్థ్యాన్నీ పెంచారు. ఉపరితలానికి తగ్గట్టుగా ల్యాండ్ అయ్యేందుకు వీటికి 32 మైక్రోస్పైన్స్ కూడా అమర్చారు. ఇవి ఎక్కువ బరువును మోయడమే కాకుండా చాలా వేగంగా పని చేస్తాయని శాస్త్రవేత్త మార్క్ కట్కోస్కై తెలిపారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
రోబోలకూ హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వాడుతున్న మనుషులకే కాదు రోబోలకు కూడా హ్యాకింగ్ ముప్పు ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. పరిశోధనలు చేసే రోబోల కదలికలను హ్యాకర్లు రిమోట్ ద్వారా నియంత్రించే ప్రమా దం ఉందని, ఆఖరికి రోబోల కెమెరా లోని సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రోబో ఆపరేటింగ్ సిస్టమ్ (ఆర్వోఎస్)ను ప్రపంచవ్యాప్తంగా స్కాన్ చేశారు. 2017–18 మధ్య చేసిన ఈ స్కానింగ్‌లో దాదాపు 100 వరకు సురక్షితం కాని వ్యవస్థలు ఆర్వోఎస్ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ‘కొన్ని సురక్షితం కాని రోబోలకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ పరిశోధనలు చేసే రోబోలు మాత్రం పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నియంత్రించవచ్చు’ అని పరిశోధకులు వివరించారు. రోబోలకు, వాటిని నడిపే మనుషులకూ ప్రమాదంగా పరిణమించేలా వాటిని ప్రభావితం చేయొచ్చన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందన్నారు. ఆర్వోఎస్ను హ్యాక్ చేయ డం ద్వారా రోబోల కెమెరాలు, సెన్సర్లు తదితర పరికరాలనూ నియత్రించొచ్చని చెప్పారు. -
రిమోట్‌తో రాష్ట్రాన్ని పాలిస్తారా: మోదీ
బిహార్‌లో మహాకూటమి అధికారంలోకి వస్తే, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ రిమోట్ కంట్రోల్‌తో రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. లాలు అసలు ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన చేసిన తప్పుల వల్లే ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకుండా పోతోందని, అందుకే భారత న్యాయవ్యవస్థ ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపిందని చెప్పారు. గతంలో దివంగత జగ్జీవన్ రామ్ ప్రాతినిధ్యం వహించిన ససారమ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ మీద కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి దళితులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నితీష్ పొగరే ఆయనను ఓడిస్తుందని, తన స్వార్థం కోసం దళితుడికి వెన్నుపోటు పొడవడం లాంటి పాపాలకు పాల్పడ్డారన్నారు. -
త్రీన్మార్
దేవుడు మనకు ‘జీవితం’ అనే 100 సంవత్సరాల డైలీ సీరియల్ ఇచ్చాడు. రిమోట్ కంట్రోల్ మాత్రం తన దగ్గరే దాచుకున్నాడు!ఐ లైక్ ఫేస్బుక్. ఎందుకంటే, మా చుట్టాలు పక్కాలు, మిత్రులు, తోబుట్టువులు... అందరూ దానిలోనే ఉన్నారు! సెలైన్స్ అనేది ‘గోల్డ్’ అయితే... ఆ ‘గోల్డ్’కు మార్కెట్లో బొత్తిగా ధర పలకడం లేదు. - స్వామి నిజమేనంద -
వినువీధి వి‘చిత్రం.. వెల్ డ్రోన్
రిమోట్ కంట్రోల్‌తో నడిచే బొమ్మ కార్లు, బుల్లి హెలికాప్టర్లు ఎప్పుడో నడిపేశాం. మారుతున్న కాలం బుల్లి విమానాలను ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన సాధనంగా మార్చేసింది. అవుట్డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ భారీ వెడ్డింగ్‌ల వరకూ ఈ విహంగ నేత్రాలుకన్ను గీటుతున్నాయి. సిటీలో మెట్రో పరుగుల్ని సైతం వీటి సాయంతోనే చిత్రీకరించారు. గారడీ చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ ఆకట్టుకునే ఈ సరదా బొమ్మలే సీరియస్ ఫీల్డ్‌లోకి ఎంటరై ‘డ్రోన్’లుగా రూపాంతరం చెంది అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి. పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ, సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్. వీటి వాడకంలో వైవిధ్యానికి సంబంధించి దేశంలోని తొలి ఆరు నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన నేపథ్యంలో ‘డ్రోన్’ వినియోగం అంతకంతకూ ఆసక్తి రేపుతోంది. వార్‌లో వెల్‘డ్రో’న్... డ్రోన్‌కు కెమెరా బిగించి చిత్రీకరించడం ఆర్మీ అవసరాలతో మొదలైంది. అట్నుంచి బాలీవుడ్లో ల్యాండ్ అయిన డ్రోన్.. లెజెండ్, ఆగడు, బాహుబలి లొకేషన్స్‌లో ఎగురుతూ.. సిటీలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలనూ ఓ చూపు చూస్తున్నాయి. తమ వెంచర్ విశేషాలను కస్టమర్లకు చూపడానికి సిటీ రియల్ ఎస్టేట్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. భారీ పరిశ్రమల ఏరియల్ ‘వ్యూ’కి సైతం ఇవి ఉపకరిస్తున్నాయి. నిన్నటి ఆడుకునే డ్రోన్ నేడు నమ్మకమైన నేస్తంగా వీడియోగ్రఫీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిత్రీకరణ (గ)ఘనం... పలు దేశ, విదేశీ కంపెనీలు ఈ డ్రోన్లను ఆక్టోకాప్టర్, డబుల్ ఆక్టోకాప్టర్ విభాగాల్లో అందిస్తున్నాయి. సినిమా వంటి అవసరాల కోసం డబుల్ ఆక్టోకాప్టర్లు వినియోగిస్తుంటే నగరంలో విభిన్న అవసరాల కోసం వాడేవి పరిమిత సామర్థ్యం ఉన్న ఆక్టోకాప్టర్లే. వీటి ధర రూ. లక్ష నుంచి రూ.7 లక్షల దాకా పలుకుతోంది. దాదాపు ఒకటిన్నర కేజీ ఆపైన బరువుండే వీటికి 400 నుంచి 800 గ్రాముల బరువుండే కెమెరాలను అమరుస్తున్నారు. ఇవి తక్కువ శబ్దుంతో, బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక బ్యాటరీ 20 నిమిషాల వరకు పనిచేస్తుంది. చేతిలో ఉన్న రిమోట్ సూచనలకు అనుగుణంగా తిప్పుతూ అవసరమైన సీన్లు షూట్ చేసుకునే చాన్స్ ఉంది. స్క్రీన్ మీద వీటి గమనాన్ని వీక్షిస్తూ.. ల్యాప్‌టాప్, ఐపాడ్, టాబ్లెట్స్, మొబైల్స్ ద్వారా సైతం కదలికల్ని నియంత్రించవచ్చు. క్రేన్స్‌కు చెక్... భారీ కార్యక్రమాలను చిత్రీకరించేందుకు కెమెరాను అమర్చేందుకు వాడుకలో ఉన్న క్రేన్స్ హవాకి డ్రోన్స్ చెక్ పెడుతున్నాయి. తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోవడం, సులభంగా ఆపరేట్ చేయగలగడం, ఖర్చు పరంగా చూసినా లాభమే కావడంతో.. పలువురు వీడియో గ్రాఫర్లు డ్రోన్‌కు జై కొడుతున్నారు. ముందుకూ వెనక్కూ కదిలే సౌలభ్యం ఉండటంతో జూమ్ చేయాల్సిన అవసరం లేకుండానే చిత్రీకరణ సాగిపోతోంది. అయితే డ్రోన్ ప్రయోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ప్రముఖులు ఉన్న ప్రదేశాల్లో వీటి వినియోగానికి అనుమతి లభించదు. ఫ్యాషన్ పరేడ్‌లో డ్రోన్ ఇటీవల సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో డ్రోన్ వాడటం ద్వారా దేశంలోనే హైదరాబాద్ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. నగరవాసులైన దీపికానాథ్ (ఖమ్మం), రాజేష్కట్టా (కరీంనగర్)లు తమ స్టార్టప్ కంపెనీ ‘పిక్సలిజం’ ద్వారా సిటీలో డ్రోన్ల వాడకంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ‘బీటెక్ చదివి, చిన్న చిన్న ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులే పెట్టుబడిగా ఈ కంపెనీ పెట్టాం. షార్ట్ టైంలో మా కంపెనీకి మంచి పేరొచ్చిందంటే దానికి ప్రధాన కారణం డ్రోన్స్‌ను వైవిధ్యంగా వినియోగించడమే. సిటీలోనే కాదు తెలంగాణ, ఏపీ నుంచి కూడా మాకు ఎంక్వయిరీలు వస్తున్నాయి. పెళ్లిళ్లు, విభిన్న రకాల వేడుకల్లో మరిన్ని సరికొత్త ధోరణులను ప్రవేశపెట్టనున్నాం’’ అని ఈ మిత్రద్వయం చెబుతోంది. మరిన్ని రంగాల్లో .. త్వరలో మరిన్ని రంగాలకు డ్రోన్స్ వాడకం విస్తరించనుంది. సిటీలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ట్రయిలర్ చూపించడానికి ప్రొజెక్టర్‌ను డ్రోన్‌కు బిగించి కొత్త స్టైల్‌కు తెర తీశారు. ఇప్పటికే ముంబైలో డామినోస్ సంస్థ పిజ్జా డెలివరీకి డ్రోన్‌ను ఉపయోగించగా, కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంప పంటకు హానికరమైన తెగుళ్లను పట్టుకోవడానికి కూడా డ్రోన్స్‌ను వినియోగిస్తున్నారు. పలు రెస్టారెంట్స్ ఫుడ్ సర్వ్ చేయడానికి వెయిటర్స్ బదులు డ్రోన్స్‌ను వినియోగించేలా ప్లాన్స్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు -
యూపీఏ రిమోట్ కంట్రోల్: మోడీ
చిక్కబళాపూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూపీఏ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రిమోట్ కంట్రోల్‌తో నడుస్తోందని అని విమర్శించారు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. కర్ణాటకలోని చిక్కబళాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టదని, మరి కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమవుతుందని మోడీ జోస్యం చెప్పారు. 'భారత్‌లో ఎలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు? బలహీన ప్రభుత్వమా? రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగించే వారా? దేశ భవిష్యత్‌ను, వాగ్ధానాలను, దేశాన్ని విభజించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా' అంటూ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. కేంద్రంలో సుస్థిర, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీకే సాధ్యమని అన్నారు.