రిమోట్ కంట్రోల్‌తో నడిచే బొమ్మ కార్లు, బుల్లి హెలికాప్టర్లు ఎప్పుడో నడిపేశాం. మారుతున్న కాలం బుల్లి విమానాలను ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన సాధనంగా మార్చేసింది. అవుట్‌డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ భారీ వెడ్డింగ్‌ల వరకూ ఈ విహంగ నేత్రాలుకన్ను గీటుతున్నాయి. సిటీలో మెట్రో పరుగుల్ని సైతం వీటి సాయంతోనే చిత్రీకరించారు. గారడీ చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ ఆకట్టుకునే ఈ సరదా బొమ్మలే సీరియస్ ఫీల్డ్‌లోకి ఎంటరై ‘డ్రోన్’లుగా రూపాంతరం చెంది అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి.
పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ, సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్. వీటి వాడకంలో వైవిధ్యానికి సంబంధించి దేశంలోని తొలి ఆరు నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన నేపథ్యంలో ‘డ్రోన్’ వినియోగం అంతకంతకూ ఆసక్తి రేపుతోంది.
వార్‌లో వెల్‘డ్రో’న్...
డ్రోన్‌కు కెమెరా బిగించి చిత్రీకరించడం ఆర్మీ అవసరాలతో మొదలైంది. అట్నుంచి బాలీవుడ్‌లో ల్యాండ్ అయిన డ్రోన్.. లెజెండ్, ఆగడు, బాహుబలి లొకేషన్స్‌లో ఎగురుతూ.. సిటీలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలనూ ఓ చూపు చూస్తున్నాయి. తమ వెంచర్ విశేషాలను కస్టమర్లకు చూపడానికి సిటీ రియల్ ఎస్టేట్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. భారీ పరిశ్రమల ఏరియల్ ‘వ్యూ’కి సైతం ఇవి ఉపకరిస్తున్నాయి. నిన్నటి ఆడుకునే డ్రోన్ నేడు నమ్మకమైన నేస్తంగా వీడియోగ్రఫీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
చిత్రీకరణ (గ)ఘనం...
పలు దేశ, విదేశీ కంపెనీలు ఈ డ్రోన్‌లను ఆక్టోకాప్టర్, డబుల్ ఆక్టోకాప్టర్ విభాగాల్లో అందిస్తున్నాయి. సినిమా వంటి అవసరాల కోసం డబుల్ ఆక్టోకాప్టర్‌లు వినియోగిస్తుంటే నగరంలో విభిన్న అవసరాల కోసం వాడేవి పరిమిత సామర్థ్యం ఉన్న ఆక్టోకాప్టర్లే. వీటి ధర రూ. లక్ష నుంచి రూ.7 లక్షల దాకా పలుకుతోంది. దాదాపు ఒకటిన్నర కేజీ ఆపైన బరువుండే వీటికి 400 నుంచి 800 గ్రాముల బరువుండే కెమెరాలను అమరుస్తున్నారు. ఇవి తక్కువ శబ్దుంతో, బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక బ్యాటరీ 20 నిమిషాల వరకు పనిచేస్తుంది. చేతిలో ఉన్న రిమోట్ సూచనలకు అనుగుణంగా తిప్పుతూ అవసరమైన సీన్లు షూట్ చేసుకునే చాన్స్ ఉంది. స్క్రీన్ మీద వీటి గమనాన్ని వీక్షిస్తూ.. ల్యాప్‌టాప్, ఐపాడ్, టాబ్లెట్స్, మొబైల్స్ ద్వారా సైతం కదలికల్ని నియంత్రించవచ్చు.
క్రేన్స్‌కు చెక్...
భారీ కార్యక్రమాలను చిత్రీకరించేందుకు కెమెరాను అమర్చేందుకు వాడుకలో ఉన్న క్రేన్స్ హవాకి డ్రోన్స్ చెక్ పెడుతున్నాయి. తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోవడం, సులభంగా ఆపరేట్ చేయగలగడం, ఖర్చు పరంగా చూసినా లాభమే కావడంతో.. పలువురు వీడియో గ్రాఫర్లు డ్రోన్‌కు జై కొడుతున్నారు. ముందుకూ వెనక్కూ కదిలే సౌలభ్యం ఉండటంతో జూమ్ చేయాల్సిన అవసరం లేకుండానే చిత్రీకరణ సాగిపోతోంది. అయితే డ్రోన్ ప్రయోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ప్రముఖులు ఉన్న ప్రదేశాల్లో వీటి వినియోగానికి అనుమతి లభించదు.
ఫ్యాషన్ పరేడ్‌లో డ్రోన్
ఇటీవల సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో డ్రోన్ వాడటం ద్వారా దేశంలోనే హైదరాబాద్ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. నగరవాసులైన దీపికానాథ్ (ఖమ్మం), రాజేష్‌కట్టా (కరీంనగర్)లు తమ స్టార్టప్ కంపెనీ ‘పిక్సలిజం’ ద్వారా సిటీలో డ్రోన్‌ల వాడకంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ‘బీటెక్ చదివి, చిన్న చిన్న ప్రమోషన్‌ల ద్వారా వచ్చిన డబ్బులే పెట్టుబడిగా ఈ కంపెనీ పెట్టాం. షార్ట్ టైంలో మా కంపెనీకి మంచి పేరొచ్చిందంటే దానికి ప్రధాన కారణం డ్రోన్స్‌ను వైవిధ్యంగా వినియోగించడమే. సిటీలోనే కాదు తెలంగాణ, ఏపీ నుంచి కూడా మాకు ఎంక్వయిరీలు వస్తున్నాయి. పెళ్లిళ్లు, విభిన్న రకాల వేడుకల్లో మరిన్ని సరికొత్త ధోరణులను ప్రవేశపెట్టనున్నాం’’ అని ఈ మిత్రద్వయం చెబుతోంది.
మరిన్ని రంగాల్లో ..
త్వరలో మరిన్ని రంగాలకు డ్రోన్స్ వాడకం విస్తరించనుంది. సిటీలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ట్రయిలర్ చూపించడానికి ప్రొజెక్టర్‌ను డ్రోన్‌కు బిగించి కొత్త స్టైల్‌కు తెర తీశారు. ఇప్పటికే ముంబైలో డామినోస్ సంస్థ పిజ్జా డెలివరీకి డ్రోన్‌ను ఉపయోగించగా, కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంప పంటకు హానికరమైన తెగుళ్లను పట్టుకోవడానికి కూడా డ్రోన్స్‌ను వినియోగిస్తున్నారు. పలు రెస్టారెంట్స్ ఫుడ్ సర్వ్ చేయడానికి వెయిటర్స్ బదులు డ్రోన్స్‌ను వినియోగించేలా ప్లాన్స్ చేస్తున్నాయి.
- ఎస్.సత్యబాబు
వినువీధి వి‘చిత్రం.. వెల్ డ్రోన్
Published Wed, Sep 10 2014 12:32 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM
Advertisement
Advertisement