తురువెకెరే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్.. ఇద్దరూ ప్రజల్లో మంచి ఆదరణ, హోదా ఉన్న నాయకులేనని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌తో ఆడించడం ఖాయమంటూ విమర్శలు చేయడం దారుణమని, అది వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీతో పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు జనాన్ని కుంగదీస్తున్నాయని వాపోయారు. అందుకే భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబం చెప్పినట్టల్లా ఆడాల్సిందేనంటూ కొందరు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు.
పార్టీ అధ్యక్ష ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు గల కారణాలను 2019లోనే తన రాజీనామా లేఖలో తెలియజేశానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం మన దేశ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించేలా ఉందన్నారు. విద్యను కేంద్రీకృతం చేయడం కాదు, వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, భాషలను ప్రతిబింబించే విద్యా విధానం కావాలన్నారు. దేశంలో విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేవారిపై పోరాటం సాగిస్తున్నామని తెలిపారు.
అధికారం కోసం కాదు
తుమకూరు: భారత్ జోడో పాదయాత్ర 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాదని రాహుల్ చెప్పారు. మతం పేరుతో దేశాన్ని చీల్చడానికి బీజేపీ సాగిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆ పార్టీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక కులం, ఒక మతం కోసం పని చేయలేదని, దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని రాహుల్ చెప్పారు. తనను పనికిరానివాడు అని చిత్రీకరించడానికి బీజేపీ నాయకులు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. శనివారం రాహుల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచారు. పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment