Contactless debit cards
-
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
ఎస్బీఐ నుంచి కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ డిప్యూటీ ఎండీ సీఆర్ శశి కుమార్ .. ‘ఎస్బీఐ ఇన్టచ్ ట్యాప్ అండ్ గో’ డెబిట్ కార్డును ఆవిష్కరించారు. ఇప్పుడు వినియోగిస్తున్న కార్డులను స్వైప్ చేయాల్సి ఉంటోందని, కొత్త కార్డులను కేవలం పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్‌పై తడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని, రాబోయే రోజుల్లో ఆర్బీఐ అనుమతిస్తే పిన్ నంబరు ప్రమేయం లేకుండా లావాదేవీలు జరపవచ్చన్నారు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీని ఉపయోగించే ఈ విధానంలో.. సాధారణ కార్డులతో పోలిస్తే వీటి ద్వారా లావాదేవీలు మరింత సురక్షితంగాను, వేగంగాను జరుగుతాయని వివరించారు. ఇప్పుడున్న కార్డుల స్థానంలో కొత్తవి కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకుని పొందవచ్చని శశి కుమార్ తెలిపారు. తొలి ఏడాది వీటిపై ఎటువంటి ఫీజులు ఉండవు. ఆ తర్వాత వార్షికంగా సుమారు రూ. 150 ఫీజు ఉంటుంది. ప్రస్తుతం సాధారణ డెబిట్ కార్డుల వార్షిక ఫీజు దాదాపు రూ. 110గా ఉంది. ఈ కార్డులను దశలవారీగా దేశమంతటా ప్రవేశపెడుతున్నామని శశి కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కొందరు ఖాతాదారులకు కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులను అందించారు. మరోవైపు, ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కాంటాక్ట్‌లెస్ కార్డులను ఆవిష్కరించారు. ఇప్పటికే 8 పెద్ద మెట్రో నగరాల్లో 1.08 లక్షల కొత్త కార్డులను కస్టమర్లకు అందజేసినట్లు వివరించారు. బ్యాంకుకు 2.5 లక్షల పీవోఎస్ టెర్మినల్స్ ఉండగా ప్రధాన మెట్రోల్లో లక్ష టెర్మినల్స్‌ను ఎన్ఎఫ్సీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీతో నగదు చెల్లింపులు మూడు రెట్లు వేగవంతంగా చేయొచ్చని వివరించారు. రుణ ఎగవేతదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీలను ఇకపై ప్రతి త్రైమాసికంలోనూ వేలం వేయనున్నట్లు అరుంధతి భట్టాచార్య తెలి పారు. ఇకపై కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీలను వేర్వేరుగా వేలం వేయాలని నిర్ణయించినట్లు వివరించారు. రూ. 2,000 దాకా పిన్ అక్కర్లేదు: ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు గురువారం కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల నిబంధనలను సడలించింది. ఈ విధానంలో చెల్లింపులకు సంబంధించి రూ. 2,000 దాకా పిన్ నంబరు అవసరం ఉండబోదని పేర్కొంది.