ఎస్‌బీఐ నుంచి కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ డిప్యూటీ ఎండీ సీఆర్ శశి కుమార్ .. ‘ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ అండ్ గో’ డెబిట్ కార్డును ఆవిష్కరించారు. ఇప్పుడు వినియోగిస్తున్న కార్డులను స్వైప్ చేయాల్సి ఉంటోందని, కొత్త కార్డులను కేవలం పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్‌పై తడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని, రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ అనుమతిస్తే పిన్ నంబరు ప్రమేయం లేకుండా లావాదేవీలు జరపవచ్చన్నారు.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగించే ఈ విధానంలో.. సాధారణ కార్డులతో పోలిస్తే వీటి ద్వారా లావాదేవీలు మరింత సురక్షితంగాను, వేగంగాను జరుగుతాయని వివరించారు. ఇప్పుడున్న కార్డుల స్థానంలో కొత్తవి కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకుని పొందవచ్చని శశి కుమార్ తెలిపారు. తొలి ఏడాది వీటిపై ఎటువంటి ఫీజులు ఉండవు. ఆ తర్వాత వార్షికంగా సుమారు రూ. 150 ఫీజు ఉంటుంది. ప్రస్తుతం సాధారణ డెబిట్ కార్డుల వార్షిక ఫీజు దాదాపు రూ. 110గా ఉంది. ఈ కార్డులను దశలవారీగా దేశమంతటా ప్రవేశపెడుతున్నామని శశి కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కొందరు ఖాతాదారులకు కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులను అందించారు.
మరోవైపు, ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య కాంటాక్ట్‌లెస్ కార్డులను ఆవిష్కరించారు. ఇప్పటికే 8 పెద్ద మెట్రో నగరాల్లో 1.08 లక్షల కొత్త కార్డులను కస్టమర్లకు అందజేసినట్లు వివరించారు. బ్యాంకుకు 2.5 లక్షల పీవోఎస్ టెర్మినల్స్ ఉండగా ప్రధాన మెట్రోల్లో లక్ష టెర్మినల్స్‌ను ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీతో నగదు చెల్లింపులు మూడు రెట్లు వేగవంతంగా చేయొచ్చని వివరించారు. రుణ ఎగవేతదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీలను ఇకపై ప్రతి త్రైమాసికంలోనూ వేలం వేయనున్నట్లు అరుంధతి భట్టాచార్య తెలి పారు. ఇకపై కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీలను వేర్వేరుగా వేలం వేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
రూ. 2,000 దాకా పిన్ అక్కర్లేదు: ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంకు గురువారం కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల నిబంధనలను సడలించింది. ఈ విధానంలో చెల్లింపులకు సంబంధించి రూ. 2,000 దాకా పిన్ నంబరు అవసరం ఉండబోదని పేర్కొంది.