న్యూఢిల్లీ: అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్ నౌ యాప్ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. íస్విగ్గీ, జొమాటోలు డిస్కౌంట్లలో కోత పెట్టి, కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమెజాన్ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఈమధ్యే తమ ఉబెర్‌ఈట్స్ ఇండియాను జొమాటోకు విక్రయించేసిన సంగతి తెలిసిందే.
సమగ్ర వ్యాపార వ్యూహం..
‘ప్రైమ్’ పెయిడ్ చందాదారులకు.. నిత్యావసరాలు, ఆహారం మొదలుకుని ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా గృహావసరాల ఉత్పత్తుల శ్రేణిని కూడా అందించే వ్యూహంలో భాగంగానే అమెజాన్ ఈ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్ మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోదని.. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. చివర్లో వచ్చినా కూడా గెలవొచ్చన్నది ఆ సంస్థ సిద్ధాంతమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫుడ్ బిజినెస్‌నే అమెజాన్ ఎందుకు ఎంచుకున్నది వివరిస్తూ.. కన్జూమర్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యాపార విభాగాల్లో ఫుడ్ డెలివరీకి అత్యధికంగా ఆదరణ ఉంటుందని .. తర్వాత స్థానాల్లో నిత్యావసరాలు, ఎఫ్‌ఎంజీసీ, సాధారణ ఈ–కామర్స్ లావాదేవీలు ఉంటాయని ఓ ఇన్వెస్టర్ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేసే వారిని ఆకర్షించాలన్నది అమెజాన్ వ్యూహం. ప్రస్తుతానికి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను సొంత ఉద్యోగులకే అమెజాన్ అందిస్తోంది. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్, బెల్లందూరు, హరలూరు, మరతహళ్లి, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.
హోటళ్లతో ఒప్పందాలు ..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్, అమెజాన్ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన ప్రైవన్ బిజినెస్ సర్వీసెస్ సారథ్యంలో ఈ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ డైరెక్టర్ (ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం) రఘు లక్కప్రగడ ఈ వ్యూహానికి సారథ్యం వహిస్తున్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ కమీషన్ కోట్ చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్లతో ప్రైవన్ బిజినెస్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. సుమారు 10–15 శాతం కమీషన్‌ను అమెజాన్ ప్రతిపాదిస్తోంది. స్విగ్గీ, జొమాటోలతో పోలిస్తే ఇది దాదాపు సగం.
లాజిస్టిక్స్‌పై భారీగా పెట్టుబడులు
ఫుడ్ డెలివరీ వ్యాపారం విజయవంతం కావాలంటే అమెజాన్ ఎక్కువగా లాజిస్టిక్స్, రెస్టారెంట్ వ్యవస్థ, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు. అలాగే, స్విగీ.. జొమాటోలను ఢీకొనాలంటే.. కొరియన్, జపనీస్ మొదలైన వంటకాలు కూడా అందించే రెస్టారెంట్లతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశముందని వివరించారు. ఇటీవలే 350 మిలియన్ డాలర్లతో ఉబెర్‌ఈట్స్‌ను జొమాటో కొనుగోలు చేసింది. అటు స్విగ్గీ కూడా ఇటీవలే ప్రస్తుత ఇన్వెస్టరు, దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్‌పర్స్ సారథ్యంలో మరికొందరు ఇన్వెస్టర్ల నుంచి సుమారు 113 మిలియన్ డాలర్లు సమీకరించింది.
ఫుడ్ డెలివరీలోకి అమెజాన్
Published Fri, Feb 28 2020 4:29 AM | Last Updated on Fri, Feb 28 2020 4:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment