సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్... ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌లో సరుకులు బుక్ చేస్తే వ్యాపారులు వాటిని ఇంటికే పంపిస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి బడా సంస్థలు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ...మెజారిటీ పల్లెలకు ఈ సంస్థలు ఇంకా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ పల్లెల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్స్) ద్వారా ఈ–కామర్స్ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా సీఎస్‌సీ గ్రామీణ్ ఈ–స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో ఈ–కామర్స్‌ను పరిచయం చేసిన సీఎస్‌సీ... తాజాగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహిస్తోంది.
సరుకులు అనేకం... ప్లాట్‌ఫామ్ ఒకటే...
ఆన్‌లైన్ వ్యాపారంలో వేగాన్ని పెంచేందుకు సీఎస్‌సీ ప్రత్యేకంగా సీఎస్‌సీ గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనికి అనుబంధంగా సరుకుల మేనేజ్‌మెంట్, ఆర్డర్లు తీసుకోడానికి మరో రెండు సపోర్టింగ్ యాప్‌లుంటాయి. సీఎస్‌సీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఎల్‌ఈ(విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్)కు ప్రత్యేకంగా ఈ యాప్‌ను పరిచయం చేస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్న వీఎల్‌ఈకి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను జారీ చేస్తుంది. దీని ద్వారా సరుకుల లభ్యత, ధరల నిర్ధారణ తదితరాలను సపోర్టింగ్ యాప్ ‘మై గ్రోసరీస్’లో చేయాలి. కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్‌ను గుర్తించి సరుకులు డెలివరీ చేసేందుకు ఆర్డర్ సిస్టంలో చూడాలి. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యావసర సరుకులే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీతో పాటు అందుబాటులో ఉన్న రకాలను ఇందులో నమోదు చేసి మేనేజ్ చేయవచ్చు. ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూడు రకాల యాప్‌లను వీఎల్‌ఈ మేనేజ్ చేసినప్పటికీ కస్టమర్ మాత్రం గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌ను వినియోగిస్తే సరిపోతుంది.
ప్రమోట్ చేస్తే సరి...
క్షేత్రస్థాయిలో గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను వీఎల్‌ఈ ప్రచారం చేసుకోవాలి. యాప్‌పై వినియోగదారునికి అవగాహన కల్పించి తన దుకాణాన్ని యాప్‌లో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బుక్ చేసే ఆర్డర్లన్నీ ఎంపిక చేసిన వీఎల్‌ఈకి చేరతాయి. ఆ మేరకు సరుకులను సరఫరా చేస్తారు. సీఎస్‌సీ రూపొందించిన గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌లో సరుకుల లభ్యతను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తే వినియోగదారుడికి కూడా స్పష్టత ఉంటుంది. అదేవిధంగా ధరలను కూడా వీఎల్‌ఈ నిర్ధారించిన ప్రకారం ప్రత్యక్షమవుతాయి. తక్కువ లాభాలను ఆశించి సరసమైన ధరలతో ప్రారంభిస్తే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవచ్చని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం యాప్‌పై సీఎస్‌సీ గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది.
అవగాహనతోనే వ్యాపార వృద్ధి...
గ్రామాల్లో వీఎల్‌ఈ ప్రారంభించే ఈ–కామర్స్ వ్యాపారానికి.. గ్రామం లేదా సమీపంలోని టౌన్‌లో ఉన్న హోల్‌సేల్ కిరాణా స్టోర్‌తో సరుకుల సరఫరాకు అవగాహన చేసుకోవాలి. యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్ల మేరకు సరుకులను ప్యాక్ చేసి కస్టమర్‌కు బట్వాడా చేస్తే లక్ష్యం పూర్తయినట్లే. కిరాణా దుకాణం తోనే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీ, ఇతర హోల్‌సేల్ దుకాణాలతో ఒప్పందం చేసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సీఎస్‌సీ సూచిస్తోంది.
పల్లె వాకిట.. ఆన్‌లైన్ స్టోర్..!
Published Thu, May 14 2020 2:56 AM | Last Updated on Thu, May 14 2020 2:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment