
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేస్తున్న చాలా మటుకు బడా ఈ–కామర్స్ కంపెనీలు అనేక రకాలుగా, యథేచ్ఛగా దేశ చట్టాలను ఉల్లంఘించాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. అన్ని ఈ–కామర్స్ కంపెనీలు కచ్చితంగా దేశ చట్టాలను కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అర్థబలం.. అంగబలంతో ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించరాదని ఒక సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పలు కంపెనీలు పాటిస్తున్న విధానాలు.. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ–కామర్స్ కంపెనీల కోసం కేంద్రం నిబంధనల ముసాయిదాను రూపొందించిందని, వీటిని దేశ విదేశ సంస్థలు అన్నీ పాటించి తీరాల్సిందేనని గోయల్ చెప్పారు.
నిబంధనలను మార్చొద్దు: సీఏఐటీ విజ్ఞప్తి
కాగా, ఈ–కామర్స్ సంస్థల విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని, నిబంధనల ముసాయిదాలో ఎటువంటి మార్పులు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. సిఫార్సులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను తక్షణం నోటిఫై చేయాలని కోరింది. పుష్కలంగా విదేశీ నిధులు పొందిన ఈ–కామర్స్ కంపెనీల అనైతిక వ్యాపార విధానాల వల్ల దేశంలో అనేక దుకాణాలు మూతబడ్డాయని సీఏఐటీ ఒక ప్రకటనలో తెలిపింది.