Cyber Intelligence
-
31,170 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్ మోసాలు!
న్యూఢిల్లీ: కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్‌లుగా పేర్కొంటూ, మోసపూరిత కార్యకలాపాలకు తెగబడుతున్న 31,179 ఫోన్ నెంబర్లను గుర్తించినట్లు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ శుక్రవారం తెలిపింది. ఈ నంబర్లను విశ్లేషించి, వాటిలో 56 శాతం అంటే 17,285 భారతీయ ఫోన్ నంబర్లు కాగా, మిగిలినవి నాన్–ఇండియన్ నెంబర్లుగా గుర్తించినట్లు పేర్కొంది. ‘‘క్లౌడ్‌సెక్ భారతదేశంలో విస్తృతమైన స్కామ్‌ను డీకోడ్ చేసింది. ఇందులో వినియోగదారులను మోసం చేయడానికి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను ఉపయోగించడం జరుగుతోంది. ఈ స్కామ్‌లో ప్రముఖ బ్రాండ్ల కోసం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టించి వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం, సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయడానికి సందేహించని వినియోగదారులను మోసగించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రచారం ఇలా... : భారత దేశ ఫోన్ నంబర్లగా గుర్తించిన వాటిలో 80 శాతం ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయని, అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. 88 శాతం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఫేస్బుక్ పోస్ట్‌లు, ప్రొఫై ల్స్, పేజ్ ద్వారా ప్రచారంలో ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలినట్లు వివరించింది. దాదాపు ఆరు శాతం మంది ట్విట్టర్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. 2 శాతం మంది సులేఖ, గూగుల్‌ను తమ ఫోన్ నెంబర్లను ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై తొలి గురి... మోసాలకు ఎంచుకుంటున్న రంగాల్లో మొదటి వరుసలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్ (59.4 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా హెల్త్‌కేర్ (19.2 శాతం), టెలికమ్యూనికేషన్స్ (10.5 శాతం) ఉన్నాయి. 23 శాతం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు నమోదయిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. అక్రమ కార్యకలాపాలకు కోల్‌కతాకు ప్రధాన కేంద్రంగా ఉంది. 9.3 శాతం చొప్పున వరుసగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. -
ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!
సాక్షి, హైదరాబాద్: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మోసాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్’బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్ హెచ్చరించారు. ఖాతాలు.. కమీషన్లు.. వర్క్‌ఫ్రం హోం పేరిట.. ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు. డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్‌ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్లైన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కమిషన్ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్ బటన్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులను వాడి వీరికి ఎస్ఎంఎస్ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్బటన్ యాప్‌లను వాడాలని సూచిస్తారు. మొత్తానికి.. సైబర్ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్బటన్ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్ తెలిపారు. ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్ నేరస్తులకు సహకరించినవారే. సైబర్ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్ భద్రత నిపుణులు ‘పారసైట్’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్కాయిన్లుగా మార్చి.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్లైన్లో బిట్కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. అవన్నీ కూడా తమ కంప్యూటర్ సర్వర్లను హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు. -
బిగ్‌బాస్కెట్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది. -
డీల్స్..
ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఐటీ దిగ్గజం విప్రో తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ... ఇన్సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇన్సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలో 20 శాతం కంటే తక్కువ వాటాను 15 లక్షల డాలర్లతో కొనుగోలు చేశామని విప్రో తెలిపింది. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తాజాగా జేఎస్‌డబ్ల్యూ ప్రకై ్సర్లో అధిక వాటాను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.240 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ప్రకై ్సర్ ఆక్సిజన్‌లో 74 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బీఎస్ఈకి నివేదించింది. పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ కంపెనీ అమెరికాకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ‘యాష్ స్టీవెన్స్’ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 53 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.350 కోట్లు). రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్స్టర్డామ్కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. రిలయన్స్ బ్రాండ్స్ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో ‘స్కాచ్ అండ్ సోడా’ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది 2017 నాటికి పూర్తవుతుంది. భారతి ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ అయిన భారతి టెలికంలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్(సింగ్టెల్) తెలిపింది. ఈ వాటాను 65.95 కోట్ల డాలర్లకు (రూ.4,400 కోట్లు) కొనుగోలు చేస్తామని పేర్కొంది. అలాగే థాయ్‌లాండ్ టెలికం కంపెనీ ఇన్టచ్ హోల్డింగ్స్ పీసీఎల్‌లో కూడా 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు వాటాల కొనుగోలు కోసం మొత్తం 180 కోట్ల డాలర్లు వెచ్చించనున్నామని, అంతా నగదులోనే చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. {పైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ తాజాగా ఎంఎంటీసీతో జతకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంక్... ఇండియన్ గోల్డ్ కాయిన్లను (ఐజీసీ) తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది.టాటా గ్రూప్‌కు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.