ఖాతాలు, మనుషులే.. పారసైట్‌లు! | Cyber security experts warn Innocent people Over Cybercriminals Scam | Sakshi
Sakshi News home page

ఖాతాలు, మనుషులే.. పారసైట్‌లు!

Published Sat, Feb 4 2023 2:58 AM | Last Updated on Sat, Feb 4 2023 12:06 PM

Cyber security experts warn Innocent people Over Cybercriminals Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్‌ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్‌ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మో­సాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్‌’­బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్‌ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్‌ హెచ్చరించారు. 

ఖాతాలు.. కమీషన్లు.. వర్క్‌ఫ్రం హోం పేరిట.. 
ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్‌ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్‌ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు.

డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్‌ఫర్‌ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్‌ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్‌లైన్‌ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

కమిషన్‌ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్‌ బటన్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్‌ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్‌ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులను వాడి వీరికి ఎస్‌ఎంఎస్‌ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్‌బటన్‌ యాప్‌లను వాడాలని సూచిస్తారు.

మొత్తానికి.. సైబర్‌ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్‌’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్‌బటన్‌ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్‌ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్‌ తెలిపారు. 

ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది 
సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్‌ నేరస్తులకు సహకరించినవారే. సైబర్‌ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్‌ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్‌ భద్రత నిపుణులు ‘పారసైట్‌’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్‌ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. 

కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్‌కాయిన్లుగా మార్చి.. 
సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్‌కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్‌ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి.

అవన్నీ కూడా తమ కంప్యూటర్‌ సర్వర్లను హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్‌ వంటి దేశాల నుంచి ఆపరేట్‌ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement