సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’
... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు.
ఎలా చేస్తున్నారంటే..
భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్‌లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్‌ను కొత్త ఫోన్‌లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు.
సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు.
ఎక్కువగా ఈ దేశాల నుంచే..
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు.
ఆర్బీఐ ఏం చేయాలంటే..
♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిఘా పెట్టాలి.
♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది.
♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి.
♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment