అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఇలా వెలుగులోకి..
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది.
ఐదుగురు అరెస్టు ..
ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి.
ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్‌ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం.
వివిధ రూపాల్లో మోసాలు..
యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్‌లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు.
అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి.
– కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment