సిద్దిపేటకమాన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌కమిషనర్ శ్వేత అన్నారు. లాటరీ, లోన్, బహుమతి పేరుతో, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని వచ్చే ఫోన్‌కాల్స్‌కు ఎవరూ స్పందించకూడదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలు చెప్పొద్దన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం సైబర్ మోసాల ద్వారా పోగొట్టుకున్న వాటిలో రూ.46,55,964 ఫ్రీజ్ చేశామని, త్వరలో విడతల వారీగా సంబంధిత బాధితుల ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన పలు సైబర్ నేరాలపై సీపీ తెలిపిన వరాల ప్రకారం..
ఇండియన్ బుల్స్ కంపెనీ పేరుతో..
సిద్దిపేట వన్‌టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఒకరు ఫోన్‌చేసి ఇండియా బుల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మీకు లోన్ మంజూరైంది... లోన్ ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తి సూచించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు గుర్తు తెలియని వ్యక్తి సూచించిన నంబర్‌కు ఫోన్ ఫే ద్వారా రూ.10,653 పంపించాడు. తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని గుర్తు తెలియని వ్యక్తి భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు.
లోన్‌యాప్ పేరిట..
రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో లోన్ టీకాయాప్‌లో లోన్ తీసుకుని తిరిగి మిత్తితో సహా అసలు మొత్తం డబ్బు చెల్లించాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో బాధితుడు ఆన్‌లైన్‌లో రూ.6,100 పంపించాడు. అనంతరం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు పంపించాలని లేదంటే నీ ఫొటోలు న్యూడ్‌గా ఎడిట్ చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాధితుడిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.
మహిళ డీపీతో...
రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని డబ్బులు పంపించాలని కోరాడు. స్పందించకపోవడంతో ఆమె డీపీ (ఫొటో)ను ఉపయోగించి వేరే ఫోన్‌నంబర్ ద్వారా వాట్సాప్ క్రియేట్ చేశాడు. మెసేజ్ పంపించగా స్పందించిన బాధితురాలు ఆన్‌లైన్‌లో రూ.5 వేలు పంపించింది. తర్వాత విచారణ చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపినట్టు సైబర్ మోసం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment