ముంబై: ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌కి చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ శ్రీశ్రీ తత్వ... తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరిమిత స్థాయిలో ఉన్న లావాదేవీలను మరింత పెంచుకునేందుకు ఆన్‌లైన్ రిటైల్ సంస్థ బిగ్‌బాస్కెట్‌తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ఏడాది ఆఖరుకల్లా 1,000 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ అరవింద్ వర్చస్వి తెలిపారు. ఫ్రాంచైజీ విధానంలో ప్రారంభించే ఈ స్టోర్స్ కోసం ఫ్రాంచైజీ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలియజేశారు.
శ్రీశ్రీ తత్వ మార్ట్, శ్రీశ్రీ తత్వ వెల్‌నెస్ ప్లేస్, శ్రీశ్రీ తత్వ హోమ్ అండ్ హెల్త్ పేరిట మూడు రకాల స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అరవింద్ తెలిపారు. మార్ట్‌లో ఆహారోత్పత్తులు, హోమ్ కేర్ ఉత్పత్తులు ఉంటాయని, వెల్‌నెస్ ప్లేస్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులతో పాటు హెల్త్‌కేర్ నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారాయన. ఇక, హోమ్ అండ్ హెల్త్ బ్రాండ్ స్టోర్స్‌లో రోజువారీ ఉపయోగించే అన్ని ఉత్పత్తులు, ఔషధాలతో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా ఉంటారని తెలియజేశారు.
కంపెనీ ప్రస్తుతం 33 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఈ ఏడాది ప్రధానంగా లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, రష్యా, తూర్పు యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ తెలియజేశారు. యోగా గురు రాందేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా.. పలు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment